యూనిట్

అమ్మమ్మ చదువు

అప్పుడు నా వయసు పన్నెండేళ్ళు. మా అమ్మమ్మ, తాతయ్యగారింట్లో ఉండేదాన్ని, వాళ్ళున్నది ఉత్తర కర్నాటకలోని ఓ పల్లెటూర్లో. ఇప్పట్లా అప్పుడు రవాణా సౌకర్యాలు ఎక్కువగా వుండేవి కాదు. ఉదయం రావాల్సిన వార్తాపత్రిక సాయంత్రానిక్కాని వచ్చేదిగాదు. వారపత్రిక ఒకరోజు ఆలస్యం. బస్సురాకకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవాళ్ళం. తపాలా, దినపత్రికలు, వార పత్రికలు దాన్లోనే వచ్చేవి. త్రివేణి ఆ రోజుల్లో ప్రఖ్యాత కన్నడ రచయిత్రి. అద్భుతంగా రాస్తుందావిడ. ఆవిడ రచన సులభంగా అర్థమయ్యేది. రాసిందంతా నిజమేననిపించేది. మామూలు మనుషుల క్లిష్టమైన మానసిక సమస్యల గురించి రాసేది. చదివేందుకు భలే బాగుండేది. ఆవిడ చిన్న వయసులోనే పరమపదం చేరింది. కన్నడభాష దురదృష్టం. నలబై ఏళ్ళ తరువాత, ఇప్పుడు కూడా ఆమె రచనలను మెచ్చుకుంటున్నారు. అప్పుడు కర్మవీర అనే పత్రిక వచ్చేది. అందులో ఆవిడ రాసిన కాశీయాత్ర అనే కథను సీరియల్‌గా వేసేవారు. ఒక ముసలావిడ కాశీయాత్ర చెయ్యాలనే గాఢమైన కోరికకు సంబంధించింది. జీవితంలో ఒక్కసారైనా కాశి (వారణాసి)కి పోయి అక్కడి దైవం విశ్వేశ్వరుణ్ణి పూజించడం పరమ పవిత్రమైన కార్యంగా హిందువులు చాలా మంది నమ్ముతారు. ఆ ముసలావిడ కోరిక కూడా అదే. కాశికి పోవాలనే ఆవిడ తాపత్రయాన్ని వర్ణించడమే నవల ముఖ్యాంశం. అందులోనే ఉపకథగా ఒక అనాథ యువతి కథుంది. ఆవిడ ప్రేమలో పడుతుంది. పెళ్ళి చేసుకునేందుకు డబ్బుండదు. ముసలావిడ జాలితో తను కాశికి పోయేందుకు కూడబెట్టుకున్న డబ్బంతా ఇచ్చేస్తుంది. ' ఈ అనాథ యువతి ఆనందం కాశీ విశ్వనాథుణ్ణి పూజించడం కంటే ముఖ్యమైంది'. అంటుందావిడ. మా అమ్మమ్మ క్రిష్ణక్క, ఎన్నడూ బడికిపోయి చదవలేదు. ప్రతి బుధవారం ప్రతిక వచ్చేది. రాగానే తరువాత కథ చదివి వినిపించేదాన్ని. కథ వింటూ ప్రపంచాన్నే మర్చిపోయేది విన్న తరువాత కథంతా పొల్లు పోకుండా తిరిగి చెప్పేది. మా అమ్మమ్మ కాశీకి పోలేదు. తానే కథలోని ముసలమ్మననుకునేది. అందువల్లనే 'తరువాత ఏం జరిగింది?' అని తెలుసుకునేందుకు మహా ఆరాటపడేది. సీరియల్‌ చదవమని నన్ను మహా వేధించేది. కొత్త కథాభాగం విన్న తరువాత గుడిలో తన స్నేహితుల మధ్యకు చేరేది. మేం పిల్లలం దాగుడుమూత లాడుకునేవాళ్ళం. కథను గురించి ఆవిడ స్నేహితులతో చర్చించేది. ఆ కథ గురించి అంతగా ఎందుకు మాట్లాడుకునేవాళ్ళో నాకప్పుడు తెలిసేది కాదు. ఒకసారి బంధువులతో కలిసి పొరుగూళ్ళో పెళ్ళికెళ్ళాను. ఆ రోజుల్లో వివాహం ఓ గొప్ప విశేష కార్యం. మేము బ్రహ్మాండంగా ఆనందించాం. పెద్దలకు పెళ్ళి హడావుడి. పిల్లలు అంతులేకుండా తినడం, ఆడుకోవడం, దొరికిన స్వతంత్రాన్ని భలే బాగా అనుభవించాం. రెండు రోజుల్లో తిరిగి వద్దామనుకున్న నేను వారం ఉండిపోయాను. ఊరికి తిరిగొచ్చి అమ్మమ్మను చూచాను. ఆవిడ కళ్ళవెంట నీరు కారుతున్నది. ఎంత కష్టమొచ్చినా కన్నీరు పెట్టేది కాదు. నాకాశ్చర్యమేసింది. ఏం కారణమై ఉంటుంది? నాకు దిగులు పట్టుకుంది. ''అవ్వా! నువ్వు బాగున్నావు కదా? అంతా బాగుంది కదా?'' అడిగాను. ఉత్తర కర్నాటక కన్నడంలో అంటే అమ్మ అని అర్థం. నేనామెను అవ్వ అంటాను. ఆమె తలూపింది గాని మాట్లాడలేదు. ఎందుకోలే అనుకొని తరువాత ఆ విషయం మరచాను. రాత్రి భోజనాలైం తరువాత అందరం డాబా మీద పడుకున్నాము. వేసవికాలం, పూర్ణచంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నాడు. అవ్వ వచ్చి నా ప్రక్కన కూచున్నది. ప్రియంగా నా నొసలు నిమిరింది. ఆవిడ ఏమో చెప్పాలనుకుంటున్నదని అర్థమైంది. ''ఏమవ్వా?'' అడిగాను. ''నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. నా ఆలనాపాలనా చూచేందుకు, సలహాలిచ్చేందుకు ఎవరూ లేరు. మా నాన్నకెప్పుడూ పనే. రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆ రోజుల్లో ఆడ పిల్లలకు చదువనవసరమని అనుకునే వాళ్ళు. నన్ను బడికి పంపలేదు. చిన్నతనంలోనే పెళ్ళి చేశారు. పిల్లలు పుట్టారు. తీరికలేకుండా పోయింది. తరువాత మనుమలు, మనుమరాళ్ళు వచ్చారు. వాళ్ళకు వండటం, పెట్టడం చాలా సంతోషంగా ఉండేది. అప్పుడప్పుడు చదువుకోలేదని బాధపడేదాన్ని. అందుకే నా పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని నిర్ణయించుకున్నాను.'' నాకు పన్నెండేళ్ళు, అమ్మమ్మకు అరవైరెండేళ్ళు. ఈ అర్ధరాత్రి తన జీవిత కథ నాకెందుకు చెబుతున్నట్లు? ఆమె అంటే నాకు మహా ఇష్టం. ఈ కథ చెప్పడానికి ఏదో కారణం వుందని నాకు తెలుసు. ఆమె ముఖంలోకి చూచాను. సంతోషంగా లేదు, కళ్ళ వెంట నీరు కారుతున్నది. ఆవిడ చాలా అందంగా, ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉంటుంది. అప్పటి ఆమె విషాదవదనం ఇప్పుడు గూడా నాకళ్లక్కడుతుంది. ముందుకు జరిగి ఆమె చెయ్యి పట్టుకున్నాను. ''ఏడవడమెందుకవ్వా? వద్దు. అసలు సంగతేమిటి? నేనేమైనా చెయ్యాల్నా?'' అన్నాను. ''అవును, నువ్వు సహాయం చెయ్యాలి. కర్మవీర మామూలుగా వచ్చింది. నువ్వులేవు. పత్రిక తెరచాను. కాశీయాత్ర కథ బొమ్మ చూచాను. కాని చదవలేకపోయాను. అవైనా తెలుసుకోగలవేమోనని వ్రేళ్ళను అక్షరాల మీదుగా చాలాసార్లు పోనిచ్చాను. ప్రయోజనం లేదని తెలుసు. నేను చదువుకొని వుంటే ఎంత బాగుండేది! నువ్వు త్వరగా వస్తావని, చదివి వినిపిస్తావని వెయ్యి కళ్ళతో ఎదురుచూచాను. అసలా వూరికే వచ్చి నీచేత చదివించుకోవాలనుకున్నాను. ఊళ్ళో ఎవరైనా చదవమని వుండొచ్చును. కానీ ఎందుకో నాకిష్టం లేదు. అస్వతంత్రంగా, నిస్సహాయంగా వున్నట్లనిపించింది. మనకు డబ్బుంది. స్వతంత్రంగా వుండలేకపోతే డబ్బెందుకు?'' ఏం చెప్పాలో తెలీలేదు. అవ్వ ఇంకా చెప్పింది. ''రేపట్నుంచి కన్నడం అక్షరాలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. బాగా కష్టపడతాను, సరస్వతిపూజ నాటికి పూర్తి చేస్తాను. ఆ రోజు నాకై నేను నవల చదవాలి. స్వతంత్రంగా వుండాలనిపిస్తున్నది.'' ఆమె ముఖంలో నిర్ణయంతో కూడిన నమ్మకం కనిపించింది. నవ్వాను. ''అరవై రెండేళ్ళ ముసలమ్మవి, అక్షరాలు నేర్చుకోవాలనుందా అవ్వా! జుట్టంతా తెల్లబడింది. చర్మం ముడుతలు పడ్డది. కళ్ళ ద్దాలొచ్చాయి. వంటిల్లే లోకం నీకు..'' ఆకతాయితనం, పెద్దామెను గేలిచేశాను. ఆమె చిరునవ్వు నవ్వింది. ''మంచి పని చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఎలాంటి ఆటంకాలనైనా దాటుతాను. అందరి కంటె ఎక్కువగా కష్టపడతాను. నిజంగా కష్టపడతాను. నేర్చుకునేందుకు వయసడ్డం కాదు.'' మర్నాడే చదువు చెప్పడం ఆరంభించాను. అవ్వ అద్భుతమైన విద్యార్థిని, హోంవర్కు అద్భుతంగా చేసింది. చదువుతుంది. మళ్ళీమళ్ళీ చదువుతుంది. రాస్తుంది. ఒప్పగిస్తుంది. నేనామెకు ఏకైక ఉపాధ్యాయినిని. ఆమె నా ప్రప్రథమ విద్యార్థిని. ఏదో ఒక రోజున నేను టీచర్నవుతానని, వందలమంది విద్యార్థులకు కంప్యూటర్‌ సైన్స్‌ బోధిస్తానని ఆనాడు తెలీదు! యథా ప్రకారం దసరా వచ్చింది. అప్పటికి కాశీయాత్ర పుస్తకరూపంలో వచ్చింది. ఆ నవలను రహస్యంగా కొన్నాను. అమ్మమ్మ నన్ను పూజగదిలోకి రమ్మన్నది. ఓ స్టూలు మీద కూచోబెట్టింది. లంగా, జాకెట్టుగుడ్డ బహుమానంగా ఇచ్చింది. వంగి నా కాళ్ళకు మొక్కింది. బెదిరిపోయి కాళ్ళు వెనక్కు తీసుకున్నాను. ఈపని అసాధారణం. ఎప్పుడూ మనం గౌరవ సూచకంగా దేవుడి పాదాలు, పెద్దల పాదాలు, గురువుల పాదాలు తాకుతాం. పెద్దలు పిల్లల పాదాలు తాకరు. ఇది మన చాలా గొప్ప సంప్రదాయం. ఇప్పుడు తలక్రిందులైంది. ఇది సరైంది కాదు. ''నే తాకింది గురువుగారి పాదాలు గాని, నా మనుమరాలి పాదాలు కాదు. నాకు ప్రేమగా పాఠాలు చెప్పిన టీచరువి. ఇప్పుడు ఏ నవలనైనా సునాయాసంగా చదవగలను. ఇప్పుడు నేను స్వతంత్రురాలని, నీవల్లనే, నా టీచర్‌ను గౌరవించడం నా ధర్మం, వయోభేదాన్ని ఆడమగ తేడాను పాటించకుండా గురువును గౌరవించాలని మన శాస్త్రాల్లో రాశారు కదా?'' ఆమె పాదాలు పట్టుకొని ప్రతి నమస్కారం చేశాను. మొట్టమొదటి విద్యార్థికి నా బహుమతినందించాను. కాశీయాత్ర నవల, రచయిత్రి త్రివేణి, ప్రచురణకర్త అంటూ గడగడా చదివేసింది. నా విద్యార్థిని అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది.

వార్తావాహిని