యూనిట్

జాతీయ రహదారి పై నిర్వహించే రాస్తారోకో కు అనుమతి లేదు : గుంటూరు అర్బన్ ఎస్పీ

ఈ రోజు  రాజధాని మార్పు గురించి నిరసనలో భాగంగా పొలిటికల్ జె ఏ సి  గుంటూరు అర్బన్ పరిధిలో 16 వ నెంబరు జాతీయ రహదారి (చెన్నై- కోల్ కతా నేషనల్ హైవే నెంబర్ 16) పైన నిర్వహించే రాస్తారోకో/ధర్నా వంటి నిరసన కార్యక్రమములకు పోలీసుశాఖ నుండి ఏలాంటి అనుమతులు మంజూరు చేయలేదని గుంటూరు అర్బన్ ఎస్పీ పిహెచ్ డి రామకృష్ణ తెలిపారు. అయన మాట్లాడుతూ భారత దేశంలోనే అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉన్న జాతీయ రహదారి మరియు ముఖ్యకూడలి ప్రాంతమైన గుంటూరు అర్బన్ పరిధిలోని ఈ జాతీయ రహదారి గుండా నిరంతరంగా అనేకమంది ప్రజలు, వాహన దారులు ఆసుపత్రులలో వైద్యం పొందుటకు మరియు అనేక ఇతర ముఖ్యమైన పనుల గురించి రాకపోకలు కోనసాగిస్తుంటారు.  కనుక రాస్తారోకో / ధర్నాలు వంటి నిరసన కార్యక్రమాల వల్ల విపరీతమైన ట్రాఫిక్ అంతరాయము ఏర్పడి, ప్రజలు /వాహనదారులు మిక్కిలిగా ఇబ్బందులకు గురి అవుతారు. అందువలన పోలీసుశాఖ ఈ రాస్తారోకో కార్యక్రమమునకు అనుమతిని ఇచ్చుటకు అవకాశము లేదన్నారు.  శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా, భద్రతా చర్యల్లో భాగంగా గుంటూరు అర్బన్ పోలీసు జిల్లా పరిధిలో సెక్షన్ 144 Cr.P.C క్రింద నిషేధాజ్ఞలు మరియు సెక్షన్ 30 పోలీస్ చట్టము నిబంధనలు విధించడం జరిగి , అట్టి ఉత్తర్వులు అమలులో ఉన్నాయన్నారు. కనుక ఈ నిరసన కార్యక్రమము  నందు ప్రజలు ఎవ్వరూ పాల్గొనరాదని తెలిపారు.  ఎవరైనా పైన తెలిపిన ఉత్తర్వు లను ఉల్లంఘించిన ఎడల, శాంతిభద్రతల పరిరక్షణదృష్ట్యా చట్టప్రకారం వ్యవహరించి, అట్టి వారి పైన తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందని పేర్కొన్నారు. 

వార్తావాహిని