యూనిట్
Flash News
ప్రజా రక్షణే లక్ష్యంగా ముందుకు

రాష్ట్రవ్యాప్తంగా
పోలీసు అమరవీరుల సంస్మరణ దిన కార్యక్రమాలను వారం రోజులపాటు స్ఫూర్తిదాయకంగా
పూజ్యారాధనతో జరుపుకుని వారి ఎనలేని త్యాగాలను మననం చేసుకున్నాము. వారి అపూర్వ
త్యాగాల స్మృతిలో విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలను, రక్తదాన శిబిరాలను, ర్యాలీలను నిర్వహించి త్యాగధనులకు నీరాజనాలు పలికాము. పోలీస్ ఓపెన్
హౌస్‌ల ఏర్పాటుతో ప్రజలకు మరీ ముఖ్యంగా విద్యార్థినీ, విద్యార్థులకు.
యువతకు పోలీసుల పట్ల ఉన్న అభద్రతాభావాన్ని తొలగించి మన విధి విధానాలపై, ఆయుధ సంపత్తిపై అవగాహన కల్పిస్తూ మనపట్ల నమ్మకం కలిగించి మరింత
చేరువయ్యే ప్రయత్నం చేశాము. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి త్యాగ
స్ఫూర్తిని విధి నిర్వహణలో ప్రతిబింబిస్తామని ప్రతిజ్ఞ చేశాము. విధి నిర్వహణలో
పోలీసు మరణిస్తే రూ.40 లక్షలు, హోంగార్డు
మరణిస్తే రూ.30 లక్షల బీమా అందేలా ప్రత్యేక విధానాన్ని
తీసుకువచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిగారికి ప్రత్యేక
ధన్యవాదాలు. ఈ బీమా సౌకర్యం పదవీ విరమణ తర్వాత కూడా పోలీస్ సిబ్బందికి
వర్తిస్తుంది. 'చట్టం అందరికీ ఒకేలా ఉండాలి. అది ఏ
కొందరికో చుట్టం కాకూడదు. అలాగైతేనే న్యాయం, ధర్మం
బతుకుతాయి. వాటిని బతికించే బాధ్యత పోలీసుల భుజస్కంధాలపైనే ఉంది' అని సూచించిన గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలను ఎల్లవేళలా గుర్తెరిగి విధి
నిర్వహణలో ఎటువంటి పక్షపాత ధోరణి అవలంభించబోమని తెలియజేస్తున్నాను. పోలీసులంటే
కేవలం ప్రజల శాంతిభద్రతల, ధన, మాన
ఆస్తులకు రక్షణగా ఉండి ప్రజా శ్రేయస్సును ఎల్లవేళలా కోరేవారే తప్పిస్తే ఏ ఒక్క
రాజకీయ పార్టీ పక్షం వహించబోరని నేను వారికి హామీ ఇవ్వడం జరిగింది. నూతన రాష్ట్ర
ఆవిర్భావ అనంతరం శిక్షణ ముగించుకుని మూడు నెలల తదుపరి గ్రేహౌండ్స్ శిక్షణకు
వెళుతున్న నూతన డిఎస్‌పిలకు శుభాకాంక్షలు. శిక్షణ ముగించుకున్న 25 మందిలో 11 మంది మహిళలు ఉండటం ముదావహం.
మారుతున్న కాలానికనుగుణంగా పెరుగుతున్న వైట్‌కాలర్, సైబర్
నేరాలు పోలీసులకు సరికొత్త సవాళ్ళు విసురుతున్నాయి. ఈ సవాళ్ళ ఛేదనలో కావాల్సిన
సాంకేతిక నైపుణ్యాన్ని కొత్త డిఎస్‌పిలకు శిక్షణలో అందించడం జరిగింది. విధి
నిర్వహణలో వీరు అత్యంత సమర్థవంతమైన సేవలు ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాను.
పోలీసుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన వారాంతపు సెలవుల ప్రక్రియ
సంపూర్ణంగా అమలు జరుగుతోంది. ఈ సెలవుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతమైన అమలుకై త్వరలో సరికొత్త యాప్‌ను ఆవిష్కరించడం జరుగుతుంది.
అలాగే అమరవీరుల త్యాగాలను ప్రతిబింబించే విధంగా స్మారక స్థూపం డిజైన్ మరియు
నిర్మాణాన్ని నూతన రాజధానిలో నిర్మించటం జరుగుతుంది. గత ఏడు సంవత్సరాలుగా పెండింగ్‌లో
ఉన్న పోలీసు సిబ్బంది ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేసి తగిన పరిష్కారం చూపుతాం.
మన పోలీసు కుటుంబాల ప్రియ పత్రిక 'సురక్ష' 39వ వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భం?? అందరికీ
నా హృదయపూర్వక శుభాకాంక్షలు.