యూనిట్

అమర వీరుల త్యాగాలు సదా స్మరణీయం- కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి

అనంతపురం జిల్లాకు విచ్చేసిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పోలీస్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అమరవీరులను స్మరిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం జిల్లాలోని  అమరవీరుల కుటుంబాలను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు బహుకరించారు. ముందుగా ఆయన సాయుధ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. దేశ బహిర్గత. అంతర్గత రక్షణ కోసం అహర్నిశలు పోలీసులు శ్రమిస్తున్నారని, ఈ క్రమంలో ప్రాణ త్యాగాలు కూడా చేస్తున్నారని, వారి త్యాగాలను నిరంతరం స్మరిస్తూ, పోలీస్ శాఖ ఔన్నత్యాన్ని మరింతగా పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తమ కుటుంబాలను వదిలి అనుక్షణం సమాజ రక్షణలో తన మునకలయ్యే పోలీసుల త్యాగాలను సమాజంలోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీడియాపై ఉందని గుర్తు చేసారు. ఎక్కడో జరిగే చిన్న చిన్న పొరపాట్లను ఘోర తప్పిదాలుగా చిత్రీకరించడం తగదని హితవు పలికారు. పోలిసుల త్యాగాలను గుర్తించి ఢిల్లీ లో పోలీస్ నేషనల్ మెమోరియల్ నిర్మాణం చేశామని, ఈ మెమోరియల్ ని పరిశీలిస్తే సమాజ, దేశ రక్షణ కోసం పోలీసులు ఎంతటి బలిదానాలు చేసారో అర్థమవుతుందన్నారు. అటువంటి అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తూ, మనం అండగా ఉండాలాని విన్నవించారు. పోలీస్ సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నెహ్రు యువ సంఘటన జాతీయ ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అమరుల త్యాగాలు వృధా కానివ్వకుండా వారి ఆశయాలను దేశ ప్రజలంతా సంఘటితంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమం దృష్ట్యా అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని పెంచాలని విజ్ఞప్తి చేసారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ నేడు మనం ఇంత ప్రశాంతంగా జీవిస్తున్నామంటే దానికి కారణం పోలీస్ అమర వీరుల త్యాగాల ఫలమేనన్నారు.

దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే వారు విదేశీ శత్రువుల కంటే కూడా నిరంతరం తీవ్ర ప్రతికూల వాతావరణ పరిష్టితులతో పోరాటం జరుపుతుంటారని, వారికీ ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండడం మన బాధ్యత అన్నారు. జిల్లా అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ దేశం కోసం, సమాజం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలిసుల త్యాగాలు మరువలేమన్నారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు మాట్లాడుతూ జిల్లాకు చెందిన 19 మంది అమరులయ్యారని, వీరిలో జిల్లా పోలీసులు, మిలటరీ, కేంద్ర పారా మిలటరీ విభాగాల్లో పనిచేశారన్నారు. వారి వ్యక్తిగత వివరాలు, జీవిత విశేషాలతో పేరు పేరున ప్రస్తావించి వారి త్యాగాలను ఘనంగా స్మరించారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి మణికంఠ చందోలు , అదనపు ఎస్పీ జి. రామాంజనేయులు, డిఎస్పీలు ఏ.రామచంద్ర, వీర రాఘవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, పోలీస్ అధికారుల సంఘం అడ్ హాక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసుల నాయుడు, పోలీస్ అమరవీరుల కుటుంబాలు , పిటిసి ట్రైనీ ఎస్ ఐ లు, ఎన్ సి సి కేడెట్లు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పలువురు సి ఐ లు,  ఆర్ ఐ లు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని