యూనిట్

నిజాయితీ, నిబద్దత తో విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలి: కడప ఎస్పీ

శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు  నిజాయితీ, నిబద్దతతో విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని కడప జిల్లా  ఎస్.పి  కే.కే.యెన్.అన్బురాజన్  ఆకాంక్షించారు. శనివారం నగర శివార్లలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో గ్రామ వార్డు, మహిళా సంరక్షణ కార్యదర్శుల మూడవ బ్యాచ్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దె లక్ష్యంతో విధులు నిర్వర్తించాలన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు విధులు నిర్వర్తించే పరిధిలోని గ్రామ పంచాయతీ లో బాల కార్మికులున్న షాపు లేదా ప్రదేశం సమాచారం పోలీసుల దృష్టికి తీసుకువస్తే తక్షణం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  ఉద్యోగంతో ప్రభుత్వంలో భాగస్వాములయ్యారని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు.  శిక్షణలో భాగంగా బోధించిన అంశాలు విధి నిర్వహణలో ఎంతో ఉపయోగపడతాయన్నారు.  మీ విధులు నిర్వర్తించే పరిధిలో నివాసం ఉండే మహిళలందరి వద్దా మీ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అప్పుడే మిమ్మల్ని నియమించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు. మహిళలు, చిన్నారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం గా 'దిశ' పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నామన్నారు.  'స్పందన' కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇద్దరు 'దిశ' కో-ఆర్డినేటర్లు పోలీసు శాఖ నుండి ఉంటారని, సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు.  కోరుకున్న గ్రామస్వరాజ్యాన్ని తీసుకొచ్చే బాధ్యత మీ అందరి భుజస్కంధాలపై ఉందన్నారు  శిక్షణలో భాగంగా నిర్వహించిన పరీక్షలో  అత్యుత్తమ మార్కులు సాధించిన వెలుగుపాటి హిమబిందు, తక్కళ్లపల్లి గౌసియా బేగం, షేక్ సబీరా లకు జిల్లా ఎస్.పి బహుమతులందచేసి అభినందించారు. కార్యక్రమంలో డి.టి.సి. ఇంచార్జ్ డి.ఎస్.పి రంగనాయకులు, డి.టి.సి. ఇన్ స్పెక్టర్  బొజ్జప్ప, ఆర్.ఐ టైటస్, ఎస్.ఐ శాంతమ్మ, ఎస్.ఐ మరియన్న, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అశ్వని, కేస్ వర్కర్ మాధవీలతడి.టి.సి. సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని