యూనిట్

పీలేరు సి.ఐకి జాతీయ స్థాయి అవార్డు

చిత్తూరు జిల్లా పీలేరు అర్భన్‌ సి.ఐ సాధిక్‌ ఆలీకి జాతీయ స్థాయి ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) వరించింది. దిల్లీలో జరిగిన సదస్సులో ఫిక్కీ సంస్థ డైరెక్టర్‌ స్వాతి శ్రీవాత్సవ్‌ సమక్షంలో కేంద్ర మంత్రులు నిత్యానంద్‌ రాయ్‌, అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ చేతుల మీదుగా ఫిక్కీ అవార్డును సి.ఐ అందుకున్నాడు. రాష్ట్రంలో చిత్తూరు - కడప సరిహద్దు జిల్లాల్లో విస్తరించి వున్న ఎర్రచందనాన్ని దేశ విదేశాల్లో వున్న స్మగ్లర్లు అక్రమ రవాణాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూలీలు ఇలాంటి అంతర్జాతీయ స్మగ్లర్ల నీడన యధేచ్ఛగా వారి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించి ఎర్రచందన సంపదను కాపాడడంలో సాధిక్‌ ఆలీ చేసిన కృషికి గాను దేశ స్థాయిలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఫిక్కీ అవార్డుతో సత్కరించారు. దొంగవ్యాపారాలు, వాటికి సంబంధించి జరిగే ప్రణాళికలు, ఆర్ధిక లావాదేవీల కేసుల్లో చురుగ్గా పాల్గొని ఛేదించే వారి సేవలను గుర్తింపుగా దిల్లీ కేంద్రంగా ఉన్న ఫిక్కీ సంస్థ అవార్డులను అందిస్తుంది.

వార్తావాహిని