యూనిట్

విజయవాడ పోలీస్ కమీషనర్ నూతన కార్యాలయం ప్రారంభం

విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యాలయ అవరణలో నూతనంగా నిర్మించిన పోలీస్ కమీషనర్ కార్యాలయం మొదటి అంతస్తును, సెంట్రల్ కంప్లైట్ సెల్ను రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.ఆర్.అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు పోలీస్ కమీషనర్ కార్యాలయం సౌకర్యాల లేమితో వుండేదన్నారు. ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలీసు శాఖకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. వివిధ కారణాలతో కమీషనర్ కార్యాలయాన్ని ఆశ్రయించే బాధితుల సమస్యలను 'సెంట్రల్ కంప్లైట్ సెల్' ద్వారా పరిష్కరించి, బాధితులకు బరోసా కల్పించే దిశగా కృషి చేయాలని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్ కె.నాగుల్ మీరా మాట్లాడుతూ రాష్ట్రం వేరుపడిన అనంతరం నవ్యాంధ్ర రాజధాని అమరావతి అయినప్పటికీ విజయవాడే రాజధాని కేంద్రంగా చేసుకుని అనేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్ ఆధునీకరణకు మరియు మౌళిక సదుపాయాల కల్పనకు మొత్తం రూ.7కోట్లు మేర నిధులు మంజూరు చేయగా ఇప్పటికి సుమారు రూ.5కోట్ల వరకు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ప్రజా జీవితంలో పోలీసులు ప్రముఖ పాత్ర వహిస్తారని పేర్కొంటూ ఇందుకోసం ప్రతి పోలీస్ సిబ్బందికి ప్రశాంత వాతావరణంలో నివాసం వుండేలా ఉత్తమమైన పోలీస్ నివాస గృహాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నగర పోలీస్ కమీషనర్ సి.హెచ్.ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ గతంలో పోలీస్ కమీషనర్ కార్యాలయంలో రోజు వారి కార్యకలాపాలు నిర్వహించడానికి అసౌకర్యంగా వుండేదని, కమీషనర్ కార్యాలయానికి విచ్చేసే వారికి భద్రత కల్పించడంతో పాటు జవాబుదారీ తనంగా వ్యవహరించేందుకు అదనంగా భవనాలను విస్తరిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ విసి మరియు ఎండి పి.వి.సునీల్ కుమార్, నగర డిసిపిలు బి.రాజకుమారి, డా.గజరావు భూపాల్, వెంకటప్పలనాయుడు, రవిశంకర్ రెడ్డి, ఉదయ రాణి మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని