యూనిట్

రౌడీ మేళ నిర్వహించిన నెల్లూరు జిల్లా ఎస్పీ

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సంకాత్రి పండుగ, ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే సహించేది లేదని నెల్లూరు ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం అన్ని సబ్‌ డివిజన్లలో షీటర్లకు ఆయన రౌడీ మేళా నిర్వహించారు. నగరంలోని ఉమే్‌షచంద్ర కాన్ఫరెన్స్‌ హాల్లో నెల్లూరు నగరం, రూరల్‌ సబ్‌ డివిజన్ల పరిధిలోని అన్ని స్టేషన్ల రౌడీ షీటర్లకు మేళా జరిగింది. ఎస్పీ బాస్కర్‌ భూషణ్‌ షీటర్లకు మొదటి వార్నింగ్‌ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ అందుకు లోబడి నడుచుకోవాల్సిందేనన్నారు. ఇప్పటికే రౌడీ షీట్లు ఉన్న వారు తిరిగి తప్పుచేస్తే పీడీ యాక్ట్‌లు ఓపెన్‌ చేస్తామని, అదే జరిగితే బెయిల్‌ కూడా రాకుండా జైలు అనుభవించాల్సి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంచామని, డయల్‌ 100, సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్‌ నెంబర్లపై నిఘా ఉన్నందున షీటర్లు ఎక్కడ ఏ తప్పు చేస్తున్నారనే విషయం ఇట్టే తెలిసిపోతుందన్నారు. సత్ప్రవర్తన కలిగి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉంటే గ్రేడ్లుగా విభజించి షీట్లు తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు జీ శ్రీనివాసులురెడ్డి, కెవీ రాఘవరెడ్డి, ఎన్‌. కోటారెడ్డి, నగర సీఐలు, రూరల్‌ సీఐలు, ఎస్‌బీ సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

వార్తావాహిని