యూనిట్

స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వ సిద్ధంగా ఉండాలి - ఎస్పీ బి. రాజకుమారి

విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి, ఐ.పి.ఎస్., మాసాంతర నేర సమీక్గా సమావేశాన్ని జనవరి 9, 2020, గురువారం నాడు విజయనగరం జిల్లా ఆర్మ్డ్ రిజర్వు సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ బి. రాజకుమారి, ఐ.పి.ఎస్., నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మాట్లాడుతూ - ఎ డిపిఎస్ కేసుల్లో గంజాయిని, గుట్కాలు మరియు నాటుసారాను అక్రమ రవాణా చేసే వ్యక్తులతో పాటు, వాటిని సరఫరా చేసే వ్యక్తులును గుర్తించాలని, ఎవరికి, ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయాలపై లోతైన విశ్లేషణ చెయ్యాలని, ఈ అంశాలపై ప్రత్యేక దృష్టితో దర్యాప్తు చెయ్యాలని, అక్రమ రవాణాను నియంత్రించేందుకు పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలన్నారు. పోక్సో, ఎ డిపిఎస్, మానభంగం, వైట్ కాలర్ మోసాలకు పాల్పడే నిందితులపై 2019లో క్రొత్తగా తెరిచిన 184 హిస్టరీ షీటులలో, నిందితుల పూర్తి సమాచారం, ఫోటోలు, వేలిముద్రలు ఉండాలన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఔట్ ఆఫ్ వ్యూ (ఓ.వి.)లో ఉన్న పాత నేరస్థుల ఆచూకీ కని పెట్టేందుకు  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చెయ్యాలని, వారి ఆచూకీ కనుగొని, సంబంధిత పోలీసులకు సమాచారాన్ని అందించాలన్నారు. వైఎస్ఆర్ భీమా లబ్దిదారులకు సకాలంలో భీమా సొమ్ము అందించేందుకు పోలీసుశాఖ నుండి ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. తీవ్రమైన నేరాల్లో నిందితులు తప్పించుకోకుండా శిక్షలు పడే విధంగా నేరం చేసేందుకుగల కారణాలను పొందుపర్చాలని, సాక్ష్యాలను తప్పనిసరిగా సేకరించి, అభియోగ పత్రాల్లో నిక్షిప్తం చెయ్యాలన్నారు.

సంస్థాగత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించి, గ్రామ సభలు నిర్వహించి, ఎటువంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముందస్తు సమాచారాన్ని సేకరించాలని, సమస్యాత్మక గ్రామాలను సందర్శించాలని, సమస్యలు సృష్టించే వ్యక్తులను గుర్తించి, వారిని మంచి ప్రవర్తనకు బైండోవరు చేయాలన్నారు. అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తరుచూ పరిశీలించాలని, వాహనాల తనిఖీలు నిర్వహించే అన్ని ప్రాంతాలు కనబడే విధంగా సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలన్నారు. గ్రామంలోని ముఖ్య నాయకులు, వ్యక్తుల ఫోను నంబర్లును ముందుగా సేకరించి, గ్రామం లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తియ్యాలన్నారు. శాంతియుతంగా సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసేందుకు జి.ఎం.ఎస్.కె. మరియు డబ్ల్యుఎం. ఎస్.కె. సేవలను వినియోగించుకోవాలన్నారు.

విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని మరియు కమ్యూనిటీ పోలీసింగులో భాగంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన ప్రజలకు చేరవ అవుతున్న సిబ్బందిని ప్రోత్సహిస్తూ జిల్లా ఎస్పీ సర్టిఫికేట్లును, నగదు బహుమతులను అందజేసారు. గత మాసంలో నమోదై  దర్యాప్తులో ఉన్న కేసులను, తీవ్రమైన నేరాలుగా పరిగణించిన కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తును పర్యవేక్షించి, పెండింగులో ఉండేందుకుగల కారణాలను అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన సూచనలను, సలహాలను ఇచ్చి అధికారులకు జిల్లా ఎస్పీ బి. రాజకుమారి దిశా నిర్దేశం చేసారు.

ఈ నేర సమీక్షా సమావేశంలో ఓఎస్డీ  జె. రామమోహన రావు, విజయనగరం డిఎస్పీ పి. వీరాంజనేయ రెడ్డి, ఎస్బీ డిఎస్పీ సి.ఎం. నాయుడు, సిసిఎస్ డిఎస్పీ జె. పాపారావు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ బి. మోహన రావు, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, న్యాయ సలహాదారులు పరశురాం, పలువురు సి.ఐలు, ఎస్. ఐ.లు పాల్గొన్నారు.

వార్తావాహిని