యూనిట్
Flash News
జనజీవన స్రవంతిలో కలవండి
వివిధ కారణాలతో ఆయుధాన్ని చేపట్టి హింసా పథాన్ని ఎంచుకున్న మావోయిస్టులు వారి సానుభూతిపరులు జనజీవన స్రవంతిలో కలిసిపోయి సమాజ శాంతికి తోడ్పాటునందించాలని విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు వెంకట రంగారావు మావోయిస్టులకు పిలుపునిచ్చారు. జిల్లాకు చెందిన ఏడుగురు మావోయిస్టులు జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఐజీ కాళిదాసు వెంకట రంగారావు, ఎస్పీ అట్టాడ బాబూజీల సమక్షంలో స్వఛ్ఛందంగా లొంగిపోయారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ మెంబర్ (ఏసీఎం)లు, ఒకరు దళం సభ్యుడని మరో నలుగురు హార్డ్‌కోర్ మిలీషియా సభ్యులు వున్నారని తెలిపారు. వీరిలో ఏసిఎం లైన పొంగి తల్సో( లింబో)పై 13 కేసులున్నాయని,వంతల మంగమ్మ ( జానకి) పై 9 కేసులున్నాయని, బలిమెల ఘటనతో సహా పలు ఘటనలలో వీరి ప్రమేయం వుందని, వీరిద్దరిపై 4 లక్షల రివార్ట్ కూడా వుందన్నారు. హార్డ్ కోర్ మిలీషియా సభ్యులైన పంతల బాబూరావుపై 5 కేసులు, కొర్రశివ, కొర్ర సుబ్బాలిపై ( అలకనంద) ఒక కేసు వున్నట్లు చెప్పారు. మరో సభ్యుడు భూటారి నూకరాజు 2013 నుంచి 2019 వరకు పెదబయలు మిలీషియా మెంబర్‌గా ఉద్యమంలో వున్నాడని, మాడుగుల మండలం రపరాయి వద్ద జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో కూడా పాల్గొన్నాడని వివరించారు. ఇదే స్ఫూర్తితో మావోయిస్టులందరూ స్వఛ్చందంగా జన జీవన స్రవంతిలో భాగస్వాములవ్వాలని, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. లొంగిపోయిన ఏడుగురు మావోయిస్టులకు పునరావాసం కల్పించి, ప్రభుత్వపరంగా అందాల్సిన అన్ని సౌకర్యాలను వెంటనే అందిస్తామన్నారు. అదే విదంగా వారిపై వున్న రివార్డ్‌లను కూడా రెండు నెలల్లో అందేలా చూస్తామన్నారు. మావోయిస్టుల నుండి ఎటువంటి హాని వారికి జరుగకుండా పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బి. కృష్ణారావు, నర్సీపట్నం ఏఎస్పీ కె. ఆరిఫ్ హఫీజ్, 198 బెటాలియన్ కమాండెంట్‌లు కె.కె. చాంద్, సరాంగ్, 234 బెటాలియన్ కమాండెంట్ కసమ్ ఖాన్, డీఎస్‌బీ డీఎస్‌పి ఎస్. అప్పలనాయుడు, ఇన్‌స్పెక్టర్ ఎ. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.