యూనిట్

తాడేపల్లి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభం

రాష్ట్ర రాజధాని అమరావతి ముఖద్వారంగా తాడేపల్లిలో నూతనంగా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుంటూరు అర్బన్‌ ఎస్పీ పి.హెచ్‌.డి రామకష్ణ చేతుల మీదుగా ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించారు. ఎస్‌.పి. మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంతంలో కష్ణా నదికి ఆవలి వైపున గుంటూరుజిల్లాకు ఉత్తర ముఖద్వారంగా ఉన్న రాజధాని ప్రాంతములోని తాడేపల్లిలో రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయం మొదలైన చోట్లకు అనేకమంది వీవీఐపీి/వీఐపీలు వెళ్లడంతో పాటు ముఖ్యమంత్రి గారు, ఇతర ప్రముఖుల నివాసాలు ఈ ప్రాంతములో ఉండటం వల్ల, ముఖ్యమంత్రి గారు, హైకోర్టు జడ్జిలు మొదలైన అతి ముఖ్యుల ప్రోటోకాల్‌ పాటించుటవల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే నూతనంగా ఈ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాడేపల్లి పట్టణము వేగముగా విస్తరించుటవల్ల, 16వ నంబరు జాతీయ రహదారి దగ్గరగా ఉండటంతో వాహనాల రద్దీతో ఈప్రాంతములో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ కష్టముగా మారింది. ప్రస్తుతము అర్బన్‌ పరిధిలోని సిబ్బందిని, అధికారులను ఎప్పటికప్పుడు నియమించి విధుల నిర్వహణ జరుపుతున్నట్లు చెప్పారు. తాడేపల్లి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు మరియు గుంటూరు అర్బన్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల స్థాయి పెంపుదల గురించి గౌరవ డీజీపీ గారికి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన తక్షణమే అనుమతులు మంజూరైనట్లు చెప్పారు. ప్రభుత్వము నుండి ఉత్తర్వులు వచ్చేలోపు ట్రాఫిక్‌ పరమైన ఇబ్బందులను అధిగమించే విధముగా వాహనాల రద్దీని క్రమబద్దీక రించేందుకు, రోడ్డుప్రమాదాలను అరికట్టేందుకు, గౌరవ ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ శ్రీ గౌతమ్‌ సవాంగ్‌ గారి అనుమతితో తాత్కాలికంగా తాడేపల్లి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వీటిలో పోలీస్‌ సబ్‌ కంట్రోల్‌ సెంటరును తాడేపల్లి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌గా మార్చి ఒక సీఐ, ఎస్‌ఐ, సుమారు 40 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎస్‌.పి. తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌.హెచ్‌.ఓ.గా అర్బన్‌ ఇన్స్‌పెక్టర్‌ బి.బ్రహ్మయను నియమించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గుంటూరు అర్బన్‌ అదనపు ఎస్పీలు బి.లక్ష్మీనారాయణ, ఎస్‌.రాఘవ, నార్త్‌ సబ్‌ డివిజన్‌ ఇంచార్జ్‌ డి.ఎస్‌.పి. బి.సీతారామయ్య, సీఐ ఎస్వీ రాజశేఖరరెడ్డి, తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌.హెచ్‌.ఒ. బి.అంకమ్మరావు, తాడేపల్లి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌.హెచ్‌.ఒ.గా నియమించబడిన బి.బ్రహ్మయ్య, ట్రాఫిక్‌ ఆర్‌.ఎస్‌.ఐ. రామకష్ణారెడ్డి, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని