యూనిట్

అనాథకు ఇన్సూరెన్స్‌... సొమ్ము కోసం హత్య…

అనాథకు ఇన్సూరెన్స్‌... సొమ్ము కోసం హత్య... కర్నూలు జిల్లా బనగానపల్లె అవుకు మిట్ట దగ్గర కర్నూలు సిసియస్‌ డిఎస్పీ వినోద్‌ కుమార్‌ వారి సిబ్బంది వడ్డే సుబ్బరాయుడు హత్య కేసులోని 4 గురు నిందితులు సీజే భాస్కర్‌ రెడ్డి, పెట్టికోట షేక్షావలి, జీనుగ వెంకటకష్ణ, జీనుగ శివశంకర్‌లను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి తెలిపారు. కేసు వివరాలను అయన వెల్లడించారు. గత 20 ఏళ్ళుగా సెగే భాస్కర్‌ రెడ్డి ఇంటిలో సుబ్బయరాయుడు అనే వ్యక్తి వ్యవసాయం, పశువుల కాపరిగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. సుబ్బారాయుడు అనాథ , అతనికి ఎవరు లేరు. సెగే భాస్కర్‌ రెడ్డి త్వరగా సులువుగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో అవుకు షేక్‌ షావలి, హోటల్‌ రమణ, మహేశ్వర రెడ్డి లతో కలిసి పథకం రచించి అనాథ అయిన సుబ్బారాయుడుపై శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లో 2 పాలసీలు (1 లక్ష, 15 లక్షల పాలసీలు) చేయించారు. ఇన్సురెన్సు పాలసీల ద్వారా లాభం పొందాలనుకున్నారు. సెగే భాస్కర్‌ రెడ్డి తన మిత్రులైన చంద్రశేఖర్‌ రెడ్డి, షేక్‌ షావలి, జీనుగా శివ శంకర్‌, జీనుగా వెంకట కష్ణ లతో హత్య కుట్ర పన్ని, సుబ్బరాయుడును హత్య చేసేందుకు పథకం రూపొందించారు. ఈ పథకం ప్రకారం డిసెంబర్‌ 05, 2015 న తెల్ల వారుజామున సుబ్బరాయుడును అవుకు గ్రామం దగ్గర గల మెట్టుపల్లె రోడ్డులోని జమ్మిచెట్టు సమీపంలో గొంతు నులిమి చంపేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించుటకు ట్రాక్టర్‌తో సుబ్బరాయుడు పైకి ఎక్కించి చంపి ఈ హత్యను ట్రాక్టర్‌ ప్రమాదం జరిగినట్టు చిత్రీకరించినారు. అనంతరం శవాన్ని బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అవుకు పోలీసుస్టేషన్‌ లో ట్రాక్టర్‌ ప్రమాదంగా ఫిర్యాదు చేసినారు. ఈ పథకంలో భాగంగా సెగే భాస్కర్‌ రెడ్డి అనే పేరును వడ్డే భాస్కర్‌ గా (తండ్రి పేరు వడ్డె సంజన్న గా) ఓటర్‌ ఐ డి కార్డు సష్టించాడు. వడ్డె సుబ్బారాయుడుకు నామినిగా ఉన్నానని మా తమ్ముడే నని చెప్పి ఇన్సురెన్సు వారికి తెలిపినారు. హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంకు నందు వడ్డే భాస్కర్‌ పేరుతో ఖాతా తెరిచారు. అడ్వకేట్‌ సూచనల మేరకు ఇన్సురెన్సు అధికారుల సహాయ సహాకారాలతో వడ్డె సుబ్బారాయుడు మీద ఉన్న ఇన్సురెన్సు పాలసీలపై వచ్చిన దాదాపు 32 లక్షల రూపాయలను తీసుకొని ముద్దాయిలు బాస్కర్‌ రెడ్డి, షేక్‌ వలి, హోటల్‌ రమణ, అడ్వకేట్‌ మరియు ఇన్సురెన్సు అధికారులు పంచుకున్నారు. ఇంకా చంద్రశేఖర్‌రెడ్డి , కునుకుంట్ల రమణ అలియాస్‌ హోటల్‌ రమణ, లాయర్‌ మహేశ్వరరెడ్డి, మల్లేష్‌, శర్మ లను అరెస్ట్‌ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా పనిచేసి కేసును చేదించిన పోలీసు అధికారులను మరియు సిబ్బందిని కర్నూలు జిల్లా ఎస్పీ ప్రత్యేక అభినందించారు.

వార్తావాహిని