యూనిట్

హోంగార్డులు, పోలీసులకు బీమా

విధినిర్వహణలో తీరిక లేని సమయాన్ని గడుపుతూ... ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న పోలీసు వెతలను మన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిగారు గుర్తించారు. విధినిర్వహణలో ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారు. ఇలాంటి వారిని తప్పకుండా గుర్తుంచుకోవాలనే సత్సంకల్పంతో అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారిని గుర్తుచేసుకుంటూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా హోంగార్డులు, పోలీసులకు బీమా పథకాన్ని తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రమాదాలు, హింసాత్మక చర్యల ద్వారా అకాలమరణం పొందినా, లేక శాశ్వతంగా గాయపడిన పోలీసు సిబ్బందికి రూ.30 లక్షలు, ఉగ్రవాదం వల్ల మరణిస్తే రూ.10 లక్షలు కలిపి రూ.40 లక్షలు మాసివ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజితో పాటు పదవీ విరమణ తర్వాత కూడా ఇదే ప్రయోజనాన్ని కొనసాగించేందుకు అంకురార్పణ జరిగింది. ప్రమాదవశాత్తు హోంగార్డులు మరణిస్తే రూ.30 లక్షలు, ఉగ్రవాద చర్యల వల్ల మృతిచెందితే మరో రూ.10 లక్షలు కవరేజి ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా డిజిపి ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర డిజిపి శ్రీ డి.గౌతమ్‌ సవాంగ్‌ ఆధ్వర్యంలో ప్రమాద బీమాను యాక్సిస్‌ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలను డిజిపిగారు, యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతినిధులు మార్చుకున్నారు. ఇందులో జీరో బ్యాలెన్స్‌ వ్యక్తిగత శాలరీ ఖాతా, ఎటిఎం, డెబిట్‌ కార్డులు, చెక్‌బుక్‌ సౌకర్యంతోపాటు అపరిమిత ఏటిఎం లావాదేవీలు, ఇతర బ్యాంకులు ఎటిఎంల ద్వారా కూడా సౌకర్యం ఉంటుందని బ్యాంకు ప్రతినిధులు డిజిపిగారికి తెలిపారు. ఉచిత వ్యక్తిగత బీమా భద్రత, వైద్య భీమా భద్రత, కుటుంబ సభ్యులకు కూడా వ్యక్తిగత బీమా భద్రత రూ.15 లక్షల వరకు, వేతన ఖాతాను పెన్షన్‌ ఖాతాగా కూడా మార్చుకోవచ్చని బ్యాంక్‌ ప్రతినిధులు డిజిపిగారి సమావేశంలో తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని