యూనిట్
Flash News
అరచేతిలోనే మహిళల తక్షణ రక్షణ 'మహిళా మిత్ర'

యువతులు, బాలికలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని,
అవమానాలను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక తమలోనే దాచుకుని మానసిక
వేదన పడే పరిస్థితులకు చరమగీతం పలుకుతున్నామని రాష్ట్ర హోమ్ మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారు అన్నారు.
విశాఖ బీచ్ రోడ్‌లోని ఏయు కన్వెన్సన్ హాలులో నిర్వహించిన ''ఉమెన్ సెఫ్టీ ఇన్ సైబర్ స్పెస్''
అవగాహన సదస్సులో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి
వనిత, డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ గారు పాల్గొన్నారు. ఈ
కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 'మహిళా మిత్ర', 'సైబర్ మిత్ర'లకు శ్రీకారం చుట్టారు.
ఇదివరకటిలా కాకుండా మహిళలు, బాలికలు తమ సమస్యలను ఎటువంటి
సంకోచం లేకుండా అతి సులువుగా, సురక్షితంగా తమకు
అందుబాటులో ఉన్న సాంకేతికత సహాయంతో పోలీస్ వారికీ తెలియజేసి తక్షణ రక్షణ
పొందవచ్చని ఆమె తెలిపారు. మహిళల భద్రత కోసం ''మహిళా మిత్ర'',
''సైబర్ మిత్ర'' ప్రారంభించామని,
వీటిలో భాగంగా వాట్సాప్, ఫేసు బుక్‌లతోపాటు
పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 181, 100లు నిరంతరం
అందుబాటులో ఉంటాయని వివరించారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు
మహిళల రక్షణ, సంక్షేమం గురించి ప్రత్యేక శ్రద్ద
తీసుకుంటారని, మహిళ, బాలికల
చట్టాలకు మరింత పదును చేకూర్చి అమలు చేస్తున్నామని చెప్పారు. మారుతున్న కాలానికి
అనుగుణంగా సాంకేతికాభివద్ధిపాటు అనేక రూపాలలో అనర్థాలు కూడా తరుముకొస్తున్నాయని
అన్నారు. స్మార్ట్ ఫోన్స్ లోని సమాచారాన్ని మనకు తెలియకుండా దొంగిలించి బ్లాక్
మెయిల్ చేయడం, పిల్లలు విశంఖలా వీడియోలను చూసి చెడుదారిలో
పయనించడం, సైబర్ మోసగాళ్లకు చిక్కి నగదు పోగొట్టుకోవడం
అధికంగా జరుగుతున్నాయన్నారు. తమకు జరిగే భౌతిక, సైబర్
వేధింపుల గూర్చి ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనితగారు మాట్లాడుతు మహిళలు,
విద్యార్థులు, యువతులు అతిగా స్మార్ట్
ఫోన్స్ వాడకం వలన జరిగే అనర్థాలను గుర్తించి అప్రమత్తంగా మెలగాలన్నారు.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సెల్‌ఫోన్స్ ఎందుకు వినియోగిస్తున్నారు
గమనిస్తుండాలన్నారు. అనర్థాలు జరిగిన తరువాత బాధపడే కంటే ముందుగానే నియంత్రణలో
ఉంచడం ఉత్తమమని సలహానిచ్చారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు
మహిళలు, బాలికలు భద్రత విషయంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధతో
ఉన్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగానే 'మహిళా మిత్ర', 'సైబర్ మిత్ర' వంటి నూతన రక్షణ విధానాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇకపై మహిళలు
తమకు ఎదురౌతున్న ఏ సమస్యలు, వేధింపులనైనా పోలీస్ స్టేషన్‌కు
రాకుండానే ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి వెంటనే తగు రక్షణ పొందవచ్చన్నారు. విశాఖ నగర
కమిషనర్ శ్రీ ఆర్‌కె మీనా ప్రసంగిస్తూ సెల్‌ఫోన్ వాడకంలో అజాగ్రత్తల వలన
వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరి ఎన్నో అనర్థాలకు దారి తీస్తున్నాయని అన్నారు.
మహిళలు తమకు అపరిచిత ఫోన్ నెంబర్స్ ద్వారా తరచుగా కాల్స్ వస్తే వెంటనే
పోలీసులను సంప్రదించి తదుపరి అనర్థాలు జరుగకుండా జాగ్రత్త పడాలని విజ్ఞప్తి
చేశారు. ఏయువిసి ప్రసాద రెడ్డి విద్యార్థులకు సైబర్ సేఫ్టీ అంశంపై దిశానిర్థేశం
చేశారు. ప్రస్తుతం విరివిగా జరుగుతున్నా సైబర్ నేరాల తీరుతెన్నులపై వీడియోలు
ప్రదర్శించారు. అనంతరం మహిళా మిత్ర పుస్తక ఆవిష్కరణ చేసారు.ఈ కార్యక్రమంలో విశాఖ
రేంజ్ డిఐజి రంగారావు, విశాఖ జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ,
విజయనగరం ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి, శ్రీకాకుళం
ఎస్పీ అమ్మిరెడ్డి, ఈఎస్‌ఎఫ్ ల్యాబ్స్ ఫౌండర్
అనిసెట్టి అనిల్, డిసిపి-1
అమ్మిరెడ్డి, ఎయు ప్రొఫెసర్ వల్లికుమారి, అనకాపల్లి ఎస్ డిపిఓ శ్రావణి, గౌతమిశాలి
(ఐపీఎస్) పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.