యూనిట్
Flash News
రాజాంలో హైటెక్ క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆటకట్టు
ప్రత్యేక యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను రాజాం పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాజాం పరిధి బాబానగర్‌లోని ఒక ఇంట్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్ క్రికెట్ సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్బంగా బెట్టింగ్ జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు తెలిసింది. రాజాం సీఐ జి. సోమశేఖర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం మెరుపుదాడి చేయగా మొత్తం 10 మంది బెట్టింగ్ రాయుళ్ళకుగాను 5 గురు పట్టుబడగా మిగతా 5 గురు తప్పించుకున్నారు.వారి వద్ద నుండి రూ. 2.65 లక్షల నగదు, సెల్‌ఫోన్స్ వశపర్చుకున్నారు. తప్పించుకుపోయిన జూదగాళ్ళ కోసం తీవ్రంగా గాలించి ఎట్టకేలకు పట్టుకుని, వారి వద్దనుండి రూ. 2.40 లక్షల నగదు, ఆరు సెల్‌ఫోన్‌లు, క్రికెట్ స్కోర్ లెక్కించే పరికరాలు స్వాధీనపరుచుకున్నారు. వీరు క్రికెట్ బెట్టింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారని, దీని ద్వారా గణాంకాలు చేసి ఏ జట్టు గెలిచే అవకాశం వుందో చెబుతూ పందెం రాయుళ్ళను ప్రోత్సహిస్తారని ఎస్పీ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కట్టడిపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామని, ఈ వ్యవహారాలలో ఎంతటి వారు వున్నా ఉపేక్షించేది లేదని, కఠిన శిక్షలు పడేలా చేసి దీన్ని రూపుమాపుతామని స్పష్టం చేశారు.