యూనిట్

వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై అర్ధసంవత్సర సమీక్షాసమావేశం

విజయవాడ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గత 6 నెలల కాలంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు చేపట్టిన వినూత్న కార్యక్రమాల అమలు తీరు, పురోగతిపై పోలీస్‌ కమీషనర్‌ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసుశాఖ, జ్యుడీషియరీ, ప్రాసిక్యూషన్‌, సీఐడీ, రెవెన్యూ, మున్సిపల్‌, రవాణాశాఖ, వైద్యఆరోగ్యశాఖ, జైళ్లు, మహిళా శిశు సంక్షేమశాఖ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.  కార్యక్రమంలో పాల్గొన్న మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి చక్రవర్తి మాట్లాడుతూ కేసుల దర్యాప్తు పురోగతి సాధించడానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. డిజిటల్‌ ఎవిడెన్స్‌ను కోర్ట్‌ లో ఏవిధంగా ప్రవేశ పెట్టాలో వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ఇంతియాస్‌ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను పోలీసు, రెవెన్యూ, జలవనరులశాఖలు సంయుక్తంగా చర్యలు తీసుకుని అరికట్టాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలతో ఎదురవుతున్న చిన్నచిన్న లోటుపాట్లను సమావేశంలో సమీక్షించినట్లు విజయవాడ నగర పోలీస్‌ కమీషనర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రధానంగా కేసుల నమోదు, విచారణ, న్యాయస్థానంలో ఛార్జిషీట్లు ఎలా దాఖలు చేయాలి?  తదితర అంశాలను జ్యుడీషియరీ అధికారులతో చర్చించారు. పోక్సో చట్టం, మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టే ముందు ఏం చేయాలో చర్చించారు.'స్పందన' కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు అవకాశం ఉన్న అంశాలను చర్చించారు. మహిళలు మరియు చిన్న పిల్లలపై జరుగుతున్న నేరాలు, పోక్సో చట్టాలు వాటికీ సంబంధించిన శిక్షల గూర్చి చర్చించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్‌ కమీషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, న్యాయమూర్తులు మరియు అదనపు డైరక్టర్‌ అఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ బి.రామకోటేశ్వర రావు, కృష్ణాజిల్లా డిప్యూటీ డైరక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ రాజేంద్రప్రసాద్‌, రీజనల్‌ సి.ఐ.డి అధికారి సి.హెచ్‌.శ్రీనివాసులు, విజయవాడ జైల్‌ సూపరెండెంట్‌ కె.రఘు తదితర అధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని