యూనిట్

మహిళలు, బాలికల భద్రత పట్ల ప్రభుత్వ భరోసా

మహిళలు, బాలికల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని రాష్ట్ర హోంశాఖమంత్రి శ్రీమతి మేకతోటి సుచరితగారు అన్నారు. కర్నూలు పట్టణంలోని  వెంకటరమణ కాలనీలో సిఐడి శాఖ నూతనంగా నిర్మించిన నేర పరిశోధన శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని హోంశాఖమంత్రి, ఆర్థికమంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథరెడ్డిగారు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రిగారు మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా మిత్రలను ఏర్పాటు చేశామన్నారు. వారి భద్రతకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన్నారు. సంచలనాత్మక నేరాలు చేధించడంలో సిఐడి విభాగం అహర్నిశలు పనిచేస్తున్నదని, ఆర్థిక, సైబర్‌ నేరాలు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టాయన్నారు. రాష్ట్రంలో గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, కర్నూలులలో సిఐడి ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నెల్లూరు, విజయవాడ, తిరుపతిలలో త్వరలో సిఐడి భవనాల నిర్మాణం పూర్తవుతుందన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు, సైబర్‌ నేరాల నియంత్రణకు సిఐడి పరిధిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మహిళలు పోలీస్‌స్టేషన్లకు వెళ్ళి ఇబ్బంది పడకుండా మహిళా మిత్రలను ఏర్పాటు చేయడంతోపాటు సైబర్‌క్రైయిమ్‌ వెబ్‌సైట్‌, 9121211100 వాట్సాప్‌ నెంబర్‌కు సమాచారం ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకునేలా కృషిచేస్తోందని అన్నారు. డయల్‌ 100, 181 నెంబర్లకు ఫోన్‌చేసి జరుగుతున్న నేరాలపై సమాచారం ఇచ్చిన సత్వరమే తగు చర్యలు తీసుకుంటారన్నారు. పోలీసులు బాధ్యతాయుతంగా, అవినీతి రహితంగా, పారదర్శకంగా పనిచేసి శాంతిభద్రతలను పర్యవేక్షించడంతోపాటు సైబర్‌ నేరాలు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిందన్నారు. కార్యక్రమంలో సిఐడి చీఫ్‌ అమిత్‌గార్గ్‌, డిఐజి వెంకట్రామిరెడ్డి, కర్నూలు జిల్లా ఎస్‌.పి. ఫక్కీరప్ప, ఎస్‌.పి. అశోక్‌కుమార్‌, ఇతర సీనియర్‌ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని