యూనిట్
Flash News
పోలీస్ శాఖలో అద్భుత ''స్పందన''
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ''స్పందన'' కార్యక్రమ నిర్వహణలో పోలీస్ శాఖ అద్భుత ప్రగతి కనబరుస్తున్నది. గత నాలుగు వారాలలో వచ్చిన ఫిర్యాదులలో 97 శాతం పరిష్కారం చేసి కార్యక్రమ అమలులో చిత్తశుద్దిని చాటుకుంది. పోలీస్ శాఖకు వస్తున్న వినతులలో ఎక్కువగా సివిల్ వివాదాలు, మహిళలపై వేధింపులు, దాడులకు సంబంధించినవే కావడం గమనార్హం. మొత్తం 10,079 ఫిర్యాదులలో 37.07 శాతం వీటికి సంబంధించినవే వున్నాయి. ప్రతి ఫిర్యాదును గరిష్టంగా 15 రోజలలోపుగా పరిష్కరించాలని నిర్థేశించుకోగా, ఆ గడువులోగా 97 శాతం పరిష్కరించారు. మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర డీజీపీ శ్రీ డి. గౌతమ్ సవాంగ్ గారు ఈ వివరాలు వెల్లడించారు. 288 ఫిర్యాదులు మాత్రమే ప్రస్తుతం పెండింగ్‌లో వుండగా, సమస్యల తీవ్రత దృష్ట్యా 3,082 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కర్నూలు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల నుండి అధికంగా ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెల రోజులలో కంటే, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి తొలి నెలలో నేరాలు తక్కువగా జరిగాయన్నారు. సమాజాన్ని నిర్వీర్యం చేసి, అస్థిరతకు దారి చూపే జూదం, మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం, బెట్టింగ్ వంటి జాఢ్యాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై 107 కేసులు, గుట్కా సరఫరాపై 888 కేసులు, జూదం నిర్వహకులపై 3180 కేసులు, బెట్టింగ్‌లపై 205 కేసులు నమోదు చేసి నిందితులను అదుపులోనికి తీసుకున్నామన్నారు. పోలీసులకు వారాంతపు సెలవులు ఖచ్చితంగా అమలుపరుస్తున్నామని, ఎక్కడైనా అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసుల వారాంతపు సెలవుపై శాంతిభద్రల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ రూపొందించిన నివేదికను ఇతర రాష్ట్రాల విన్నపంపై పంపించడం జరిగిందన్నారు. సామాజిక మాథ్యమాలలో ప్రముఖులపై అనుచితంగా పోస్ట్‌లు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ ద్వారకా తిరుమలరావు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ శ్రీ రవిశంకర్ అయ్యన్నార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.