యూనిట్

ఓర్పు

రామన్నకి చాలా ఓర్పు వుంది. అంతా ఇంతా కాదు - చాలా ఓపికగా ఉంది. అంతే కాదు, తొందరపాటు లేనివాడు. ఎంత కష్టం వొచ్చినా సరే. ఇతరులకి బాధ కలగకుండా, కోపం తెచ్చుకోకుండా వుండేవాడు. అందుకే రామన్న అంటే ఊళ్ళో అందరికీ చాలా ఇష్టం. రామన్న ఒంటరివాడు, సాధువూ గనుక ఎవరైనా పిలిచి అన్నం పెడితే తింటాడు. అతను అన్నీ తెలిసిన పెద్ద అని ఊళ్ళో అందరూ గౌరవించేవారు, పిలిచి భోజనం పెట్టేవారు. ఒక రోజు తనకి ఎవరు అన్నం పెడతారో అని చూస్తూ నడుస్తున్నాడు. అప్పుడతనికి ఊళ్ళో వున్న పెద్ద వజ్రాల వ్యాపారి ఎదురుపడ్డాడు. భోజనం చేసి వెళ్ళమని అడిగి, రామన్నని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అది మామూలు ఇల్లు కాదు - పేద్ద భవనం. రామన్నని ఒక బల్లమీద కూర్చోమన్నాడు వ్యాపారి. వంట పిండి వడ్డించడానికి కొంతసేపు పట్టేలా వుందని, తన వ్యాపారం, వజ్రాల సంగతీ చెప్పాడు. తనని దీవించమని కూడా కోరాడు వ్యాపారి. అంతేకాదు, తన సంచిలో వున్న కొన్ని చిన్న చిన్న వజ్రాలను చూపెట్టి, అవెంత ఖరీదయినవో చెప్పాడు. రామన్న మాత్రం వజ్రాల సంగతి, వ్యాపారం సంగతీ తనకు తెలియదని చెప్పి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఐనా ఆ వ్యాపారి వింటేగా వజ్రాలు ఎలా మెరుస్తాయో చూడమంటూ రామన్న పక్కనే బల్లమీద పది చిన్న వజ్రాలు వరసన పెట్టాడు. ఇంతలో ఎవరో ఆయన కోసం వచ్చారు. పనివాళ్ళని అవతలకి పంపించేసి రామన్నకి వజ్రాల జాగ్రత్త చెప్పి తన కోసం వచ్చిన ఆయనతో మాట్లాడేందుకు వెళ్ళాడు. రామన్న ఇదేమీ పట్టించుకోలేదు. అన్నం వడించేవారి కోసం ఎదురుచూస్తున్నాడు. ఎదురుగా ఓ పేద్ద కొంగ వచ్చి నిలబడింది. మనిషి ఎత్తుగల కొంగ. అది ఆ వ్యాపారి పెంచుకుంటున్న కొంగ. ఎంత తెల్లగా అందంగా మెరిసిపోతోందో! అని సంతోషంగా దానికేసి చూస్తున్నాడు రామన్న. కొంగ పెద్ద మనిషిలాగ అటూ ఇటూ తన పొడవాటి కాళ్ళతో పచార్లు చేస్తోంది. తమాషాగా తన పొడవాటి ముక్కు అటూ ఇటూ తిప్పుతూ హఠాత్తుగా బల్లమీద వున్న ఒక చిన్న వజ్రాన్ని ముక్కుతో అందుకుని గుటుక్కున మింగేసింది! అదేదో గింజ అనుకుంది. అనుకోకుండా అలా జరిగేసరికి రామన్న భయపడ్డాడు. కంగారు పడ్డాడు. కొంగకి ఏమవుతుందో, దాని పొట్ట చీరుకుపోతుందో ఏమో, ఎలాగ రా బాబు అని జాలి వేసింది. ఈలోగా వ్యాపారి అక్కడికి వచ్చి, భోజనానికి లేవండి అని రామన్నని పిలుస్తూ వజ్రాల దగ్గరికి వచ్చాడు. ఇంకేముంది - పది వజ్రాల్లో ఒకటి లేదు. రామన్న కేసి చూస్తూ ఒక వజ్రం ఏమయిందని అడిగేడు. నిజం చెప్పలేక, అబద్దం చెప్పలేక రామన్న ఏమీ చెప్పలేదు. వ్యాపారికి వెంటనే కోపం వచ్చింది. అక్కడ వేరే ఎవరూ లేదు. పైగా ఏం అడిగినా రామన్న సమాధానం చెప్పడం లేదు. వ్యాపారికి అనుమానం వచ్చేసింది. వెర్రికోపం వచ్చింది. రామన్నమీద అరిచి కేకలు పెట్టాడు. రామన్న శాంతంగా నిలబడి వున్నాడు. లాభం లేదనుకుని వ్యాపారి పనివాళ్ళని పిలిచాడు. వజ్రం ఎలా మాయం చేసేడో చెప్పమంటూ వాళ్ళు రామన్నని చితకబాదారు. కట్టిపడేసి కొరడాలతో కొట్టాడు. ఏడుపొచ్చినా, దెబ్బలు తగిలినా రామన్న భరించాడు. ఏమీ అనలేదు. నీరసంగా పడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి కొంగ వచ్చింది - ఏమయిందో ఏమో అది అరుస్తూ రెక్కలు కొట్టుకుంటూ, నోరు బాగా తెరిచి కక్కేసింది. దాని నోట్లోంచి వజ్రం నేలమీద పడింది. కొంగ ఊపిరి తీసుకుంది. వ్యాపారి, పనివారూ 'అమ్మయ్య' అనుకున్నారు. రామన్న తేరుకు న్నాడు. ''తిట్టి కొట్టినా నోరెందుకు మెదపలేదయ్యా వెర్రివాడా'' అని వ్యాపారి రామన్నని అడిగాడు. ''అయ్యా ఒట్టి అనుమానంతోనే నన్ను చావ గొట్టారు - వజ్రం కొంగ మింగిందని తెలిస్తే దాని పొట్ట చీల్చి మరీ వజ్రం తీసుకునేవారు గదా - అమాయక పక్షి అన్యాయంగా చచ్చేది కదా- అందుకనే ఎంత బాధయినా భరించాను'' అని రామన్న చెప్పాడు. వ్యాపారి తప్పు చేసినందుకు క్షమించమన్నాడు. కొంగ సంతోషంగా రెక్కలు ఆడించింది. కథ కంచికి - మనం ఇంటికీనూ.

వార్తావాహిని