యూనిట్

బోటు ప్రమాదంపై డీజీపీ గారి సమీక్ష

మృత దేహాలు వెలికితీతకు యాభై పడవల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, నేవీ బృందాలు గాలింపు చేపడుతున్నారని రాష్ట్ర డిజిపి శ్రీ డీ గౌతం సవాంగ్‌ గారు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్‌ విశిష్ట లాంచీ బాధితులను అయన పరామర్శించారు. అనంతరం రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో గోదావరిలో మునిగిన లాంచీ, అందులోని ప్రయాణికులు, సహాయక చర్యలపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. అనంతరం అయన మాట్లాడుతూ నదిలో 100 అడుగులలోపు ఉన్న వాటినే గుర్తించే సాంకేతిక నైపుణ్యమే ప్రస్తుతం ఉందన్నారు. నదిలో మునిగిన లాంచీ 315 అడుగుల లోతున ఉందన్నారు. ఇతర రాష్ట్రాలలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. బెలూన్‌ టెక్నాలజీ, సోలార్‌ టెక్నాలజీలకు కొన్ని పరిమితులు ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన పూర్తిస్థాయి సాంకేతిక నైపుణ్యం విదేశాల్లో లభ్యమవుతుందని తెలిసిందన్నారు. బోటులో చిక్కుకుని ప్రాణాలతో ఉన్నవారిని, అలాగే మ తులను గుర్తించేందుకు గాలింపు చర్యలను వేగవంతం చేశామన్నారు. వరద ఉన్న సమయంలో లాంచీని నడపడంపై విచారణ జరుగుతోందన్నారు. ప్రమాదం ఎలా జరిగింది, బోటు డిజైన్‌, దానిని ఎక్కడ, ఎవరు తయారు చేశారనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ ఘటనపై అధ్యయనం చేసి భవిష్యత్‌లో బోటు ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్పారు. ఘటనకు ముందే దేవీపట్నం ఎస్సై లాంచీని ఆపి తనిఖీ చేశారని, అపుడు ప్రయాణికులంతా లైఫ్‌ జాకెట్లు వేసుకుని ఉన్నట్లు ఫొటో కూడా తీశారన్నారు. లాంచీలో మొత్తం 64 మంది ప్రయాణికులు ఉండగా, ఆరుగురు క్రూ సిబ్బంది, ముగ్గురు డ్యాన్సర్లు ఉన్నట్లు తెలిపారు. లాంచీ ప్రమాదంలో ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు.

వార్తావాహిని