యూనిట్

మహిళా భద్రతకు ''సైబర్‌ మిత్ర''

స్మార్ట్‌ ఫోన్‌లు వినియోగిస్తున్నప్పుడు వాటి పై పూర్తి స్థాయిలో అవగాహన అవసరమని, లేకుంటే సైబర్‌ నేరగాళ్ళ చేతుల్లో మోసపోతామని ఆంధ్రప్రదేశ్‌ గౌరవ హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారు అన్నారు. 'సైబర్‌ స్పేస్‌లో మహిళల భద్రత' అనే అంశంపై సదస్సును ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. మహిళలు, విద్యార్థులే లక్ష్యంగా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని, స్పైయాప్‌ల ద్వారా సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్ళు సేకరిస్తున్నారన్నారు. స్మార్ట్‌ఫోన్‌లు రిపేరులకు ఇచ్చినప్పుడు వినియోగదారులకు తెలియకుండానే అక్కడివారు సెల్‌ఫోన్లలో స్పైయాప్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తున్నారన్నారు. వీటి ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న సైబర్‌ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అలాగే సామాజిక మాధ్యమాలలో స్నేహాలు పేరిట పరిచయాలు పెంచుకుని అనంతరం చేస్తున్న మోసాలతో చాలా మంది ఆత్మహత్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తపర్చారు. ఇటువంటి సైబర్‌ నేరాల నిరోధానికి ప్రజలలో అవగాహన అవసరం కనుక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపడతామన్నారు. ఈ సందర్భంగా మంత్రి గారు బాలికలు, మహిళా సైబర్‌ బాధితుల భద్రతకు ''సైబర్‌ మిత్ర'' ఫేస్‌బుక్‌ పేజ్‌ను, 9121211100 వాట్సాప్‌ నెంబర్‌ను విడుదల చేశారు. అదే విధంగా మహిళా సంబంధిత నేరాలు, వారి రక్షణ పట్ల అనుసరించాల్సిన విధానాలతో కూడిన హేండ్‌బుక్‌ను ఆవిష్కరించారు. బాలికలు, మహిళలు తమకు జరిగిన అన్యాయాలను, ఇతర వేధింపులను పోలీస్‌ స్టేషన్‌కు రాకుండానే సులభంగా ఇంటి వద్దనుండే పోలీసులకు ఫిర్యాదు చేసి తక్షణ రక్షణ పొందవచ్చన్నారు. స్టేషన్లకు రాకుండానే భాదితులనుండి ఫిర్యాదులు స్వీకరిస్తాం: డిజిపి శ్రీ గౌతమ్‌ సవాంగ్‌ గారు బాలికలు, మహిళల భద్రత, సంరక్షణ విషయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని, వారి కోసం మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారని డీజీపీ శ్రీ డి. గౌెతమ్‌ సవాంగ్‌ తెలిపారు. దానికి అనుగుణంగా మహిళల భద్రతకు భరోసానిచ్చే నూతన విధానాలను ప్రవేశ పెడుతున్నా మన్నారు. ఇందులో భాగంగానే సైబర్‌ నేరాల బాధిత మహిళలు భవిష్యత్తులో పోలీస్‌ స్టేషన్లకు రాకుండా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని డీజీపీ శ్రీ గౌతమ్‌ సవాంగ్‌ గారు అన్నారు. సైబర్‌ నేరాలపై ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా 112, 181, 100కు డయల్‌ చేయవచ్చని సూచించారు. మహిళల రక్షణ కోసం పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నంబర్‌ 91212 11100ను సులభంగా వినియోగించుకొనే అవకాశం వుందన్నారు. బాలికలు, మహిళా చట్టాలకు మరింత పదును పెట్టాలి: స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శ్రీమతి పూనం మాలకొండయ్య బాలికలు, మహిళలను వేధించే సైబర్‌ నేరగాళ్ళను కఠినంగా శిక్షించేలా సైబర్‌ చట్టాలకు మరింతగా సవరణలు చేయాల్సిన అవసరం ఉందని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శ్రీమతి పూనం మాలకొండయ్య అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ మహిళా సంబంధిత సైబర్‌ చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయని, ఆ తరహాలో శిక్షలు అమలు అయినప్పుడు నేరాలు వాటంతట అవే తగ్గుముఖం పడుతాయన్నారు. బాలికలు, మహిళలకు సైబర్‌ సంబంధిత నేరాలు పట్ల విరివిగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారిని ఈ నేరాలకు బాధితులు కాకుండా కాపాడుకొనే అవకాశం ఉందన్నారు. సైబర్‌ సెక్యూరిటీపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి - ఈఎస్‌ఎఫ్‌ ల్యాబ్‌ వ్యవస్థాపకులు అనిశెట్టి అనిల్‌ మారుతున్న కాలంలో పెరుగుతున్న సాంకేతిక అభివృద్ది మనకు ఎన్నో సౌలభ్యా లను సులభంగా అందించడమే కాకుండా మరెన్నో కొత్త సమస్యలను మోసుకొస్తున్నదని ఈ ఎస్‌ఎఫ్‌ ల్యాబ్‌ వ్యవస్థాపకులు అనిశెట్టి అనిల్‌ అన్నారు. అందుచేత ప్రతి ఒక్కరు సైబర్‌ సెక్యూరిటీపై ఎంతో కొంత అవగాహన ఏర్పరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మనం వినియోగించే స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌ టాప్స్‌, ట్యాబ్స్‌ ఇతర సిస్టమ్స్‌లో మెరుగైన యాంటీ వైరస్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకో వాలన్నారు. వాటికి అనుసంధానమై వున్న కెమెరా మన పని పూర్తి అయిన వెంటనే మూసివుండేలా జాగ్రత్తలు పాటించాలని, మనం వినియోగించే పాస్‌ వర్డ్‌లను తరచుగా మార్చుతుండడం, వాటిని గోప్యంగా వుంచడం ద్వారా సైబర్‌ నేరాలకు గురి కాకుండా తప్పించుకోవచ్చని సూచిం చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పుష్పశ్రీవాణి గారు, రాష్ట్ర మంత్రి శ్రీమతి తానేటి వనిత గారు, పలువురు మహిళా ఎమ్మెల్యేలు, విజయవాడ నగర పోలీస్‌ కమీషనర్‌ శ్రీ సి.హెచ్‌. ద్వారకా తిరుమలరావు గారు, పి అండ్‌ ఎల్‌ అదనపు డీజీపీి శ్రీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, ఈఎస్‌ఎఫ్‌ ల్యాబ్‌ వ్యవ స్థాపకుడు శ్రీ అనిశెట్టి అనిల్‌, మహిళా పోలీస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని