యూనిట్

గత ఏడాదితో పోల్చితే నేరాలు 6 శాతం తగ్గాయి - డిజిపి శ్రీ డి. గౌతం సవాంగ్

  ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అనుసరిస్తున్న సమర్థ విధానాల వలన రాష్ట్రంలో గత ఏడాదితో పోల్చి చూస్తే నేరాలలో 6  శాతం తగ్గుదల వచ్చిందని  డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మంగళగిరి పోలీస్ ప్రధాన  కార్యాలయంలో 2019 వార్షిక నేర నివేదికను ఆయన విడుదల చేసారు. అనంతరం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు మరియు శాంతి భద్రతల అదనపు డిజి  రవిశంకర్ అయ్యన్నార్, టెక్నీకల్ డి ఐ జి పాలరాజులతో కలిసి  ఆయన మాట్లాడారు. పోలీస్ శాఖ విధి విధానాలలో వినూత్న కార్యాలు చేపట్టడంతో పాటు పోలీస్ సంక్షేమంకు విశేషంగా కృషి చేశామన్నారు.  దేశంలోనే తొలిగా పోలీసులకు వీక్లి ఆఫ్ సమర్థవంతంగా అమలు చేశామన్నారు. ఇన్స్యూరెన్స్  భారీగా పెంచమని, అది హోమ్ గార్డ్స్ కు కూడా వర్తించేలా చర్యలు తీసుకున్నామన్నారు. దేశంలోనే తొలిగా మహిళా భద్రతకు దిశా యాక్ట్  2019 రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే జీరో ఎఫ్ ఐ ఆర్ , స్పందన లను సమర్ధవంతంగా అమలు జరుపుతూ ప్రభుత్వం, ప్రజల మన్ననలు అందుకుంటున్నామన్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు లను తొమ్మిదింటిని రాష్ట్ర పోలీస్ శాఖ సొంతం చేసుకుందని , అలాగే డీ ఎస్ సి ఐ, జీ ఫైల్స్ లాంటి జాతీయస్థాయి ఉన్నత పురస్కారాలను సాధించిందని తెలిపారు.

ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తో సహా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు రాష్ట్ర పోలీస్ పనితీరును ప్రశంసించడం రాష్ట్రానికే గర్వ కారణం అన్నారు.

      2018  లో  1 ,19 ,541  కేసులు నమోదు కాగా 2019 1 ,12 ,697 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని, ఇందులో 5 , 080 కేసులు ఎన్నికల సందర్భంగా నమోదు అయినవని, ఇవి లేకుంటే కనీసం పది శాతం నేరాల తగ్గుదల ఉండేదన్నారు. హత్యలు, అత్యాచారాలు , అపహరణ వంటి ప్రధాన నేరాలు గణనీయంగా తగ్గాయని, మావోయిస్టు ప్రభావాన్ని కూడా విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకే పరిమితమయ్యేలా కట్టడి చేశామన్నారు. త్వరలోనే ఆ ప్రభావాన్ని కూడా తుడిచిపెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు.మద్యం బెల్ట్ షాప్ లు, గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలు రవాణా, వినియోగం, కోడిపందాలు, పేకాట వంటి జూదాలపై ఉక్కుపాదం మోపామన్నారు. ఆపరేషన్ ముష్కాన్ లో భాగంగా 5 ,799 మంది బాలలను సంరక్షించి అందులో 5 ,208 మంది తల్లిదండ్రులను గుర్తించి వారికీ అప్పగించడం జరిగిందన్నారు. ''2020 ఉమెన్ సేఫ్టీ'' నినాదంగా ముందుకుసాగానున్నామని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి చేతులు మీదుగా దిశా యాప్ విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

వార్తావాహిని