యూనిట్
Flash News
మహిళలపై జరిగే నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి
మహిళలపై జరిగే నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారు అన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ మైదానంలో 2018 బ్యాచ్‌కు చెందిన 25 మంది డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తిచేసుకుని విధుల్లో చేరుతున్న ట్రైనీల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్ర డీజీపీ శ్రీ డి.గౌతమ్ సవాంగ్ గారితో కలిసి ప్రత్యేక పరేడ్ పరిశీలన వాహనంలో వెళ్ళి ఆమె ప్లటూన్లను నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాంతాలవారీగా భిన్న సమస్యలు ఉన్నాయని, అంతర్గత భద్రతా సవాళ్లను ఎదుర్కోనేందుకు పోలీసు సిబ్బంది, అధికారులు ఎప్పుడూ సిద్దంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర జనాభాలో 70 శాతం గ్రామాల్లోనే ఉన్నారని, కొత్తగా బాధ్యతలు చేపట్టే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. అనంతరం రాష్ట్ర డీజీపీ శ్రీ డి.గౌతమ్ సవాంగ్ గారు మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ కుటుంబంలోనికి కొత్తగా చేరుతున్న అధికారులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం వున్న పోలీస్ శాఖపై మక్కువతో అధికారులుగా ఎంపికైనందుకు అభినందనలు తెలియజేశారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణలో పోలీసు పాత్ర కీలకమైనదని ఎల్లప్పుడూ ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడాల్సిన అవసరం వుందన్నారు. కనుల విందుగా సాగిన పరేడ్‌కు కమాండర్‌గా చిత్తురు జిల్లాకు చెందిన జెస్సీ ప్రశాంతి వ్యవహరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన డిఎస్పీలకు, విధుల్లో అత్యుత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి పతకాలను హోంశాఖ మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారు అందించారు. కార్యక్రమంలో అగ్నిమాపక మరియు విపత్తుల నిర్వహణ శాఖ డీజీపీ శ్రీమతి ఏ.ఆర్. అనురాధ, డీజీపీ శ్రీ ఎన్.వి. సురేంద్రబాబు, రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీ కె.ఆర్.ఎమ్. కిషోర్ కుమార్, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ శ్రీ సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, శాంతి భద్రతల అదనపు డీజీపీ శ్రీ రవిశంకర్ అయ్యన్నార్, సి.ఐ.డి ఛీప్ మరియు పోలీస్ హౌసింగ్ బోర్డు ఎండి అండ్ వైస్ ఛైర్మెన్ శ్రీ పి.వి. సునీల్ కుమార్, ఏపీ పోలీస్ అకాడమీ ఇన్‌చార్జి డైరెక్టర్ ఎన్. సంజయ్, సౌత్ కోస్టల్ ఐజిపి శ్రీ వినీత్ బ్రిజ్‌లాల్, బెటాలియన్స్ ఐజిపి శ్రీ బి. శ్రీనివాసులు, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ ఐజి శ్రీ కె. సత్యనారాయణ, మరియు డి.ఐ.జిలు శ్రీ సి.హెచ్. శ్రీకాంత్, శ్రీ కాంతి రాణా టాటా, శ్రీ జి. విజయ్ కుమార్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతిభావంతులకు పురస్కారాలు : శిక్షణలో ప్రతిభ చూపించిన డిఎస్పీలకు పతకాలతో సత్కరించారు. ఉత్తమ ఆల్ రౌండర్ - బి. రవికిరణ్, పరేడ్ కమాండర్ జెస్సీ ప్రశాంతి, ఉత్తమ ఇండోర్ - టీడీ యశ్వంత్, ఉత్తమ ఔట్ డోర్ మరియు షూటింగ్ విభాగాలలో - వీఎన్‌కే చైతన్యలు విజేతలుగా నిలిచారు. ప్రత్యేక అవార్డులు: ప్రత్యేక విభాగాలలో శిక్షణ ఇచ్చిన అధి కారులకు కూడా అవార్డులను ప్రకటించారు. మౌంటెనీరింగ్ - శ్రీమతి జీ.ఆర్. రాధిక (ఎస్పీ, ఆక్టోపస్), యోగ - శ్రీమతి టి. కళ్యాణి (సీఐ, సీఐడి), ఈత - తులసి చైతన్య (హెడ్ కానిస్టేబుల్, విజయవాడ) లకు ప్రత్యేక అవార్డులను అందించారు.