యూనిట్
Flash News
దక్షిణాది రాష్ట్రాల పోలీస్ మధ్య సమన్వయము అవసరం
కేంద్ర
హోమ్ శాఖ ఆదేశానుసారం హైద్రాబాద్ లో దక్షిణాది రాష్ట్ర డీజీపీల సమావేశం
జరిగింది. మన రాష్ట్ర డిజిపి శ్రీ డి. గౌతమ్ సవాంగ్ తోపాటు తెలంగాణ డిజిపి శ్రీ
మహేందర్ రెడ్డి,తెలంగాణ
హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, తమిళనాడు
డిజిపి శ్రీ జె కె త్రిపాఠి, కేరళ డిజిపి శ్రీ లోకనాథ్
బెహరా, కర్ణాటక డిజిపి శ్రీ నీలమణి రాజు, పుదుచ్చేరి డిఐజి శ్రీ ఈశ్వర్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దక్షిణాది రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన మహారాష్ట్ర డిజిపి శ్రీ సుబోద్ కుమార్
జైస్వాల్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. దేశ అంతర్గత భద్రత పటిష్టత కోసం
దక్షిణాది రాష్ట్రాలు కలిసి కట్టుగా పరస్పర సహకారం, సమన్వయంలతో
ముందుకు సాగవలసిన ఆవశ్యకతపై కూలంకషంగా చర్చించారు. ఉగ్రవాదం,తీవ్రవాదం, మాదక ద్రవ్యాల రవాణా, సైబర్ నేరాల కట్టడికి అనుసరించవలసిన వినూత్న విధానాల గురించి ఆలోచనలను
పంచుకున్నారు. నేరస్తులు రాష్ట్ర , ప్రాంత పరిమితులు
లేకుండా నేరాలకు పాల్పడుతుంటే, దర్యాప్తుకు మాత్రం
రాష్ట్రాల వారీగా ఉన్న నిబంధనలు అవరోధంగా నిలుస్తున్నాయని భాగస్వామ్య పక్షాలు
అభిప్రాయ పడ్డాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రతి రాష్ట్రానికి ప్రాధాన్యత
కలిగివున్న నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని ఏకాభిప్రాయం
వ్యక్తమైంది. నేరగాళ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాష్ట్రాలు పరస్పర
సహకారంతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో మావోయిస్టులను కట్టడి చేయుటకు
అనుసరిస్తున్న విధానాలను, విశాల సాగర తీర పరిరక్షణకు
చేపడుతున్న రక్షణ చర్యలను డిజిపి శ్రీ డి. గౌతమ్ సవాంగ్ తెలియజేసారు. అంతకంతకు
విస్తరిస్తున్న సైబర్ నేరాలను అదుపు చేయడానికి చేపడుతున్న చర్యలను సమావేశంలో
వివరించారు.