యూనిట్
Flash News
ఎస్‌ఐ రాత పరీక్ష తుది ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి గారు
కొద్ది కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఐ రాత పరీక్షా ఫలితాలను అసెంబ్లీ ఛాంబర్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కొంత కాలంగా పెండింగ్‌లో వున్న ఈ రాత ఫలితాల ప్రక్రియపై పోలీస్ శాఖ దృష్టిసారించి కొలిక్కి తెచ్చింది. ఫలితాల సీడీని హోం శాఖా మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారు, డీజీపీ శ్రీ డి. గౌతమ్ సవాంగ్ గారు, స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్ కుమార్ విశ్వజిత్‌గారు ముఖ్యమంత్రిగారికి అందజేశారు. మొత్తంగా 333 సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్), రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్, ఏపీఎస్‌పీ), డిప్యూటీ జైలర్లు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు పోస్ట్‌లకు గాను 1,35,414 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులో ప్రిలిమినరీ, ఫిజికల్ పరీక్షలు అనంతరం తుది రాత పరీక్షకు 32,745 మంది అర్హత పొందారు. 149 సివిల్ ఎస్‌ఐ, 75 రిజర్వ్ ఎస్‌ఐ, 75 ఏపీఎస్‌పీ ఎస్‌ఐ, 10 డిప్యూటీ జైలర్ (పురుషులు), 4 డిప్యూటీ జైలర్ (మహిళలు), 20 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్ట్‌లకు వీరు పోటీ పడ్డారు. ఈ తుది ఫలితాల ద్వారా ఎంపిక సాధించిన విజేతలకు ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు. దిగ్విజయంగా శిక్షణ పూర్తి చేసుకొని, చేపట్టే బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. నెల్లూరుకు చెందిన పరుచూరు మహేష్, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్, పాలెం రవికిషోర్‌లు 255 మార్కులు సాధించి పురుషులలో టాపర్స్‌గా నిలిచారు. 15,775 మంది మహిళా అభ్యర్థినులు పోటీపడగా, వీరిలో 61 మంది ఎంపిక అయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన ప్రజ్ఞ 224 సాధించి మహిళలలో టాపర్‌గా నిలిచింది. ఇదే విధంగా పెండింగ్ లో వున్న కానిస్టేబుల్ ఫలితాల ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించి నట్లు హోం మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారు, డీజీపీ శ్రీ డి. గౌతం సవాంగ్ గారు తెలిపారు. పోలీస్ శాఖలో ఖాళీగా వున్న 17 శాతం పోస్ట్‌లను కూడా భర్తీ చేసే అంశాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తదుపరి ఆదేశాలను పాటిస్తామన్నారు.