యూనిట్
Flash News
బుర్రలేని ఎలుగుబంటి
ఒక రైతు ఒంటరిగా పొలంలో పనిచేసుకుంటున్నాడు. సాయంత్రం అయింది. అక్కడికి హఠాత్తుగా ఓ ఎలుగుబంటి వచ్చింది. ఆ సమయంలో రైతు దగ్గర కొడవలిగాని, కర్రగానీ ఏదీ లేదు. ''నాకు చాలా ఆకలిగా వుంది. నేను నిన్ను చంపి తింటాను'' అన్నది ఎలుగుబంటి. ముందు రైతు భయపడ్డాడు. కానీ వెంటనే తెలివి తెచ్చుకుని ''నేను ఇక్కడ వేరుశనగ విత్తనాలు నాటుతున్నాను. బోలెడు పంట వస్తుంది. అప్పుడు వేర్లన్నీ నాకు వదిలేసి పంట నువ్వు తిందువుగాని'' అన్నాడు రైతు. ఎలుగుబంటి ఓ క్షణం ఆలోచించి ''సరే పంట అంతా తినేస్తా - కానీ మోసం చేశావనుకో - నిన్ను మింగేస్తా'' అన్నది. ఒక మనిషి కంటే పంటే ఎక్కువ గదా అని అనుకుని ఎలుగుబంటి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి పంట బాగా పండింది. అది చూసి పంట కోసే వేళకి ఎలుగుబంటి వచ్చింది. తన భాగం తనకు ఇమ్మంది. రైతు వేరుశనగ వేళ్ళన్నీ కాయలతో సహా బండ్లు ఎక్కించాడు. పంట ఆకులు, వేర్ల భాగం ఎలుగుబంటి రుచి చూసింది. అవి చప్పగా రుచి లేకుండా వుంది. అక్కడక్కడ మిగిలిన వేరుశనగ కాయలు తిని చూసింది. అవేమో చాలా రుచిగా వున్నాయి. ''నన్ను మోసం చేశావు - నా వాటా పంటకి రుచీ పచీ లేదు. నిన్ను చంపేస్తా'' అన్నది ఎలుగు. ''ఇదేం న్యాయం? నువ్వు ఒప్పుకున్న భాగం పంట నీకు ఇచ్చాను. నా తప్పు ఏముంది?'' అని రైతు వాదించాడు. అప్పుడు అక్కడికి వచ్చి నక్కను ఎలుగుబంటి న్యాయం అడిగింది. నక్క కూడా రైతు తప్పు ఏం లేదన్నది. ''సరే ఈ సారి పంట వేర్లన్నీ నావే - జాగ్రత్త'' అని ఎలుగుబంటి హెచ్చరించి, నక్క సాక్ష్యం తీసుకుని, నక్కతో సహా అది వెళ్ళిపోయింది. ఈసారి రైతు పంట మార్చాడు - అవసరాన్ని బట్టి మొక్కజొన్న విత్తనాలు నాటాడు. ఈసారి కూడా పంట బాగా పండింది. మొత్తం జొన్నపంట అంతా బండ్లు ఎక్కించి ఇంటికి పంపించాడు రైతు. అప్పుడు గబగబా ఎలుగుబంటి వచ్చింది. ''హమ్మయ్య వేర్లన్నీ వుంచాడు'' అని సంతోషించి తీరికగా వేర్లన్నీ తీసి కుప్ప పోసి తిన్నది. మొక్కజొన్న వేర్లకు రుచి ఏముంది? చప్పగా వుంది. అప్పటికే రైతు పొలం దాటి ఇంటికి చేరాడు. ఎలుగుబంటి నెత్తి కొట్టుకుంది తన తెలివి తక్కువదనానికి. మళ్ళీ పైరు, పంటల కన్నా అడవే నయం అనుకున్నది.