యూనిట్
Flash News
కళామతల్లి ముద్దుబిడ్డలకు పురస్కారాలు
పొగడ్తలు, పురస్కారాలకు ఆశించకుండా సుదీర్ఘకాలంగా తమ
రంగాల్లో నిస్వార్ధంగా అంకితభావంతో సేవలందిస్తున్న వారిని పొట్టిశ్రీరాములు తెలుగు
విశ్వవిద్యాలయం గుర్తించి వారిని ప్రతిభా పురస్కారాలతో అలంకరించడమన్నది ఎంతో గొప్ప
విషయమని శాంతా బయోటిక్స్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ శ్రీ డా.
కె.ఐ. వరప్రసాద్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు
విశ్వవిద్యాలయం 2017 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో తమ
వంతు విశేష కృషి చేసిన 12 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి
వారికి ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో జరిగిన
ఈ పురస్కార ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన వరప్రసాద్ రెడ్డి పాల్గొని
మాట్లాడారు. విశ్వవిద్యాలయం మొదటి నుండి నిబద్ధతకు కట్టుబడి ఈ పురస్కారాలను అందిస్తుందన్నారు.
పురస్కార గ్రహీత అదనపు డిజిపి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్
విసి మరియు ఎండి, సురక్ష సంపాదకులు శ్రీ పి.వి. సునీల్
కుమార్ మాట్లాడుతూ తాను ఈ రోజు సాంఘికంగా, సాహిత్యపరంగా
ఉన్నత స్థానంలో వుండడానికి శ్రీ డా.బి.ఆర్. అంబేడ్కర్ అందించిన ఫలాలు మాత్రమే కారణమన్నారు.
తానెప్పుడు పురస్కారాల కోసం తాపత్రయ పడలేదని, తనకున్న
సాహిత్య అభిరుచికి సామాజిక స్పృహ జోడించి రచనా వ్యాసాంగాన్ని కొనసాగించానన్నారు.
శ్రీ డా. ద్వానా శాస్త్రి, శ్రీ దేవులపల్లి అమర్ వంటి ఇతర
రంగాల్లో ప్రముఖులతో ఈ పురస్కారాన్ని స్వీకరించడం ఎంతో అదృష్టంగా
భావిస్తున్నానన్నారు. కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన వి.సి ఎస్వీ సత్యనారాయణ
మాట్లాడుతూ తమతమ రంగాల్లో ఎటువంటి ఆశలు, స్వార్ధాలకు తావు
లేకుండా తమ పని తాము చేసుకుంటూ గౌరవప్రదంగా జీవించే ఎంతో మందిని విశ్వవిద్యాలయం
గుర్తించి సత్కరించుకుంటుందని అన్నారు. విశిష్ట అతిధి సీనియర్ పాత్రికేయలు శ్రీ
ఎం.వి.ఆర్.శాస్త్రీ, ఇతర పురస్కార గ్రహీతలు మాట్లాడారు.
కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య శ్రీమతి అలేఖ్య పుంజాల, విశ్వవిద్యాలయ
సిబ్బంది, పురస్కార గ్రహీతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.