యూనిట్
Flash News
వరుస హత్యలు, దోపిడీల కరడుగట్టిన నేరస్థుడు అరెస్ట్
వరుస హత్యలు, దోపిడీల కరడుగట్టిన నేరస్థుడు అరెస్ట్ యథాలాపంగా ఒక వృద్దురాలి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ బృందానికి ఆ కేసులో తాము అదుపులోకి తీసుకున్న ప్రధాన నేరస్థుడు విచారణలో వెల్లడించిన వాస్తవాలు పోలీసులనే దిగ్భ్రాంతి పరిచాయి. తమిళనాడులో జరిగిన పలు దోపిడీలు, హత్య కేసులలో ఎటువంటి ఆధారాలు చిక్కకుండా చేసి, దర్జాగా తిరుగుతున్న కరడు గట్టిన నేరస్థుడు అతనే అని నిర్ధారించుకున్నారు. జూన్ 24 వ తేదీ చిత్తూరు జిల్లా నగరిలోని ఎం ఎన్ కండ్రిగకు చెందిన సరోజమ్మ (65) అనే వృద్దురాలి హత్యకేసులో ప్రమేయం నిరూపణ అయిన మీదట భర్త గోపాల్ రెడ్డి, కుమారుడు నరసింహులుతోపాటు తమిళనాడుకులోని అరక్కోణంకు చెందిన ఆర్. ఆనంద్, సి. మన్నన్ లను పోలీసులు అరెస్ట్ చేసారు. భార్య ప్రవర్తన మీద అనుమానం వున్న భర్త గోపాల్ రెడ్డి కిరాయి హంతకులకు డబ్బు ఇచ్చి దోపిడీ దొంగల వ్యవహారం అనుకొనేలా హత్య చేయించాడు. దీనికి కుమారుడు కూడా సహకరించాడు. సరోజమ్మ తలపై కర్రతో కొట్టి హత్య చేసిన అనంతరం ఆమె ఒంటిపై నగలు దోచుకొని పోయారు. ఇటీవల ఇదే తరహాలో పిచ్చాటూరు మండలం గోవర్థనగిరిలో ఒక మహిళ హత్యకు గురి కాబడడంతో పోలీసులు సునిశితంగా విచారణ జరుపగా ఆ హత్య కూడా ఆనంద్ చేసినట్లుగా నిర్థారణ అయ్యింది. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపగా ఆనంద్ తను చేసిన ఘోరాలు చిట్టా విప్పేటప్పటికి విస్తుపోవడం పోలీసుల వంతైంది.తమిళనాడులోని అరక్కోణం తాలూకా చిన్నకైనూరు గ్రామానికి చెందిన టైలర్ నిర్మలను చంపమని మరో మహిళ సుపారీ ఇవ్వగా నిర్మలను హత్య చేసాడు. ఈ విషయం పోలీసులకు తెలుస్తుందని సుపారీ ఇచ్చిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. 2015లో అరక్కోణంకు చెందిన శంకర్ అనే వ్యక్తిపై కక్షతో అతని కుమారుడు భరత్ (8) ను కిడ్నాప్ చేసి గొంతు కోసి హత్య చేసాడు. ఒక రైల్వే కల్వర్ట్ దగ్గర శవాన్ని పూడ్చిపెట్టినట్టుగా ప్రదేశాన్ని చూపగా అక్కడ తవ్విన పోలీసులకు భరత్ పుర్రె, ఎముకలు లభించాయి. మూడేళ్ల క్రిందట తమిళనాడులోని తిరుళ్లవూరులో ఆరు బయట నిద్రిస్తున్న తిలగవతి అనే మహిళ తలపై బండరాయితో కొట్టి,నగలు దోచుకున్నది కూడా ఆనంద్‌గా నిర్థారణ చేసుకున్నారు. గత ఏడాది తమిళనాడులోని శాంత మంగళం వద్ద మరో మహిళను తలపై కర్రతో కొట్టి నగలు ఎత్తుకెళ్ళిన కేసులో కూడా తానే ముద్దాయినని ఆనంద్ ఒప్పుకున్నాడు. ఈ విధంగా ఒక హత్య కేసుతోపాటు మరిన్ని అపరిష్కృత నేరాలను ఛేదించినందుకుగాను దర్యాప్తు బృందాన్ని చిత్తూరు ఎస్పీ కట అప్పల నాయుడు, డీఎస్పీ మురళీధర్ అభినందించి రివార్డ్‌లు అందించారు.