యూనిట్

జలదిగ్భందంలో ఉన్న గ్రామప్రజలను రక్షించిన అనంతపురం పోలీసులు

అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో జల దిగ్బంధంలో చిక్కుకున్న మూడు కాలనీల వాసులను జిల్లా పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఎస్పీ భూసారపు  సత్య ఏసుబాబు స్వయాన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గత రెండ్రోజులుగా కురుస్తున్న వానలతో యాడికి, పరిసర ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుంటలు, చెక్‌ డ్యాంలు నిండి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 24న ఉదయం యాడికి మండలంలోని పిన్నేపల్లి చెరువు పొంగి పొర్లి ఆ నీరు యాడికి మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలైన హాస్పిటల్‌ కాలనీ, లాలెప్ప కాలనీ, చెన్నకేశవ కాలనీలు జల దిగ్బంధమయ్యాయి. వరద ఉధ్రుతి కూడా తీవ్రమయ్యింది. ఈ మూడు కాలనీల వాసులు జల దిగ్బంధంలో చిక్కుకుని ఇళ్ల నుండీ బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈసమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు తక్షణమే స్పందించారు. హుటాహుటిన యాడికి మండల కేంద్రానికి చేరుకున్నారు. తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు ఆధ్వర్యంలో తాడిపత్రి సబ్‌ డివిజన్‌ సి.ఐలు, ఎస్‌.ఐలు, సిబ్బంది మరియు జిల్లా స్పెషల్‌ పార్టీ, ఏ.ఆర్‌ విభాగం అధికారులు, సిబ్బంది జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో సహాయక చర్యలు చేపట్టారు. జలదిగ్బంధంలో చిక్కుకుని వరద ఉధ్రుతి బయటికి రాలేక దిక్కుతోచని స్థితిలో ఇళ్లల్లో, మిద్దెలపై ప్రాణాలుతో బిక్కుబిక్కుమంటున్న కాలనీల వాసులను సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. రోప్‌ ద్వారా పోలీసు సిబ్బంది వరద ప్రవాహంలో నిలుచుకుని స్థానికులను సురక్షితం చేశారు. జె.సి.బి ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 400 నుండి 500 కుటుంబాలను రక్షించారు. దీంతోపాటు సుమారు మూడు నుండి నాలుగు వేల మందికి పోలీసులు భోజన వసతి కల్పించారు.

వార్తావాహిని