యూనిట్

డయల్‌ -100 కాల్స్‌కు సత్వర సేవలందించిన అనంతపురం జిల్లా పోలీసులు

డయల్‌ -100 విభాగాన్ని నెలకొల్పిన సంకల్పాన్ని నెరవేరుస్తూ ఆపదలో చిక్కుకున్న బాధిత మహిళలకు అనంతపురం జిల్లాలో పోలీసులు ఆపన్న హస్తం అందిస్తున్నారు. డయల్‌ -100 కాల్స్‌కు వచ్చిన సమాచారంతో మెరుగైన సత్వర సేవలందించిన తాడిపత్రి పట్టణ, అనంతపురం నాలుగవ పట్టణ, చిలమత్తూరు పోలీసులను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అభినందించారు. మూడు వేర్వేరు సందర్భాలలో ఆయా పోలీసులు అందించిన సేవల వివరాలు.... 

పోలీసులు సత్వరమే స్పందించి సేవలందించిన ఘటనలు...

గర్భిణీ మహిళను ఆదుకున్న తాడిపత్రి పట్టణ పోలీసులు...

డిసెంబరు నెల 9 ఉదయం కడప నుండి కర్నూలుకు రైలులో ప్రయాణిస్తున్న గర్భిణీ వరలక్ష్మి పురిటి నొప్పులతో బాధపడుతోంది. అది గమనించిన సాటి ప్రయాణీకురాలు డయల్‌ -100కు సమాచారం చేర వేయడంతో పది నిముషాల్లో అంబులెన్స్‌ వాహనం, డాక్టర్‌తో పాటు తాడిపత్రి పట్టణ పోలీసులు రైల్వే స్టేషన్‌లో సిద్ధంగా ఉన్నారు. తాడిపత్రి డీఎస్పీ ఏ. శ్రీనివాసుల పర్యవేక్షణలో పట్టణ సి.ఐ తేజోముర్తి, ఎస్‌ఐలు ప్రదీప్‌ కుమార్‌, శ్రీమతి వెంకటలక్ష్మిల బందం ఆ గర్భిణీని అంబులెన్స్‌ వాహనంలోకి తీసుకొచ్చి ప్రాథమిక వైద్య సేవలు చేయించారు. అనంతరం...ఓ ప్రయివేట్‌ క్లినిక్‌లో చేర్పించి గైనకాలజిస్ట్‌ దగ్గర వైద్య సేవలు అందించారు. సుఖప్రసవమై మగబిడ్డకు జన్మనిచ్చింది. పోలీసులు పురిటి బిడ్డకు దుస్తులు... బాలింతరాలుకు పండ్లు, మిఠాయిలు అందజేశారు. 

అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తిపై చర్యలు తీసుకున్న అనంతపురం 4వ పట్టణ పోలీసులు

 హైదరాబాద్‌ చెందిన ఓ యువతి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. డిసెంబర్‌ 3న రాత్రి హైదరాబాద్‌ నుంచి వోల్వో బస్సులో బెంగళూరుకు బయలుదేరారు. 4న తెల్లవారుజామున 3 గంటల సమయంలో బస్సు గుత్తికి చేరుకుంది. గుత్తిలో అప్పటి దాకా బస్సును నడిపిన డ్రైవర్‌ రెస్ట్‌ కోసం దిగారు. మరోడ్రైవర్‌ విధుల్లో చేరారు. రెస్ట్‌ కోసం వచ్చిన బెంగళూరుకు చెందిన నూర్‌ మహమ్మద్‌ అనే డ్రైవర్‌ కన్ను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుపై పడింది. నిద్రలో ఉన్న యువతిని తాకుతూ వెళ్లాడు. పొరుపాటున జరిగి ఉంటుందని ఆ యువతి సర్దుకుంది. మళ్లీ ఇంకోసారి అలానే తాకడంతో ఆమె గట్టిగా అరిచింది. దీంతో తోటి ప్రయాణీకులంతా అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. డ్రైవర్‌ వెనక్కు సీట్లోకి వెళ్లి దాక్కున్నాడు. అతన్ని అందరూ కలసి పట్టుకుని డైయిల్‌ 100కాల్‌ చేయగా.. అనంతపురం 4వ పట్టణ పోలీసులు, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది వేగంగా స్పందించారు. అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి ఆదేశాలు మేరకు... 4వ పట్టణ సి.ఐ జి.రాజశేఖర్‌ పర్యవేక్షణలో ఎస్‌.ఐ. వెంకటరమణ, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది ప్రకాష్‌, నాగరాజులు స్థానిక తపోవనం కూడళికి చేరుకున్నారు. గుత్తి నుంచి అనంతపురం వస్తున్న అక్కడికి రాగానే ఎస్‌.ఐ. వెంకటరమణ బందం బస్సును ఆపి.. ముందుగా నూర్‌ మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యువతి నుంచి రోడ్డుపైనే ఫిర్యాదు స్వీకరించారు. అక్కడిక్కడే డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఆ యువతిని స్టేషన్‌ రావాల్సిన అవసరం లేదని.. ఫిర్యాదు ఇస్తే చాలని ఆమెను అదే బస్సులో బెంగళూరుకు పంపారు. బస్సు బెంగళూరుకు చేరుకుని ఆ యువతి తన ఇంటికి చేరుకునేలోపు నూర్‌ మహ్మమద్‌ను కోర్టులో హాజరు పరిచి.. జైలుకు పంపారు.

గుండెపోటుతో విలవిలలాడుతున్న వ్యక్తిని తక్షణమే ఆసుపత్రికి తరలింపు....


అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు తోపు బీసీ కాలనీకి చెందిన చాంద్‌ బాషా ఏ ఢిల్లీ సాబ్‌ డిసెంబర్‌ 12న రాత్రి గుండెపోటుతో బాధపడుతున్నాడు. బాగా పొద్దుపోయింది. ఏమి చేయాలో కుటుంబ సభ్యులకు దిక్కుతోచలేదు. ఆ సమయంలో డయల్‌ -100కు సమాచారం అందించారు. వెంటనే...చిలమత్తూరు ఎస్‌.ఐ వెంకటేశ్వర్లు స్పందించారు. కోడూరు తోపుకు దగ్గరగా ఉన్న కొడికొండ స్టాటిక్‌ చెక్‌ పోస్టు సిబ్బందిలో ఇద్దరు కానిస్టేబుళ్లు రాజకుమార్‌, జగదీష్‌లను అక్కడికి పంపించారు. ఎస్‌.ఐ. హుటాహుటిన వెళ్లారు. అప్పటికే 108 విభాగానికి ఫోన్‌ చేసి ఆ వాహనాన్ని రప్పించి చాంద్‌ బాషాను తక్షణమే అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించి జాయిన్‌ చేయించారు. డాక్టర్లు సకాలంలో వైద్య సేవలు చేయడంతో చాంద్‌ బాషా ప్రాణాలు సేఫ్‌ అయ్యాయి. మొన్న బస్సులో అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తిని అరెస్టు చేసి బాధితురాలికి అక్కడికక్కడే న్యాయం...నిన్న రైలులో ప్రయాణిస్తూ పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆసుపత్రిలో చేర్పించి సుఖ ప్రసవవమయ్యేలా సేవలు చేయించడం... నేడు గుండె పోటుతో బాధపడుతున్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడటం... ఇలా జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పందిస్తున్న తీరు, అందిస్తున్న సేవలుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

వార్తావాహిని