యూనిట్
Flash News
కిడ్నాప్‌కు గురైన జషిత్ సురక్షితంగా ఇంటికి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన నాలుగేళ్ల బాలుడు జషిత్ కిడ్నాప్ కథ సుఖాంతమై కన్నవారి చెంతకు సురక్షితంగా చేరాడు. మండపేట పట్నంలోని తన అపార్ట్‌మెంట్ వద్ద ఆడుకుంటున్న జషిత్‌ను, బాలుడి నానమ్మ చూస్తుండగానే ఇద్దరు అగంతకులు అపహరించుకు పోయారు. సీసీ కెమెరాలలో అగంతకులను గుర్తించిన పోలీసులు 17 బృందాలుగా విడిపోయి జిల్లా వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలోను బాలుని కిడ్నాప్ వైరల్ అయింది. ఆగంతకుల రూపాలు సీసీి కెమెరాలలో దొరికిపోవడం, పోలీసుల గాలింపు ముమ్మరం కావడం మరియు బాలుని ఫోటో మీడియాలో ప్రసారం కావడంతో భయపడిన నిందితులు జషిత్‌ను వదిలిపెట్టారు. అనపర్తి మండలం కుతుకులూరు - రాయవరం రహదారిలోని చింతాల రోడ్డులో జనావాసం లేని ప్రదేశంలో ఓ ఇటుకల బట్టీ వద్ద బాబుని బైక్ పై వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బట్టీలో పనిచేసే ఏసు అనే కూలీకి జషిత్ కనిపించగా తనతో ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కూలీల ద్వారా సమాచారం ఇటుక బట్టీ యజమాని కర్రి కృష్ణారెడ్డికి తెలిసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిన ఆయన బాబుని గుర్తించి జషిత్ తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందజేశాడు. వెంటనే ఆయన ఈ విషయాన్ని మండపేట పోలీసులకు తెలియజేశాడు. బాలుడిని పికప్ చేసుకున్న జిల్లా ఎస్పీ నయీం అస్మి స్వయంగా బాబును తీసుకుని తన వాహనంలో తల్లిదండ్రుల వద్దకు చేరుకుని అప్పగించారు. కిడ్నాప్‌కు గురైన జషిత్ విషయంలో పోలీసులు తీసుకున్న చర్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు.