యూనిట్
Flash News
నేర పరిశోధనలో అత్యుత్తమ పనితీరుకు 'ఎబిసిడి'తో సత్కారం
ఎబిసిడి'తో సత్కారం రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రతి మూడు నెలలకు ఒకసారి నేర పరిశోధనలో అత్యుత్తమ పనితీరు కనబర్చి క్లిష్టమైన కేసులను ఛేదించే పోలీస్ దర్యాప్తు బృందాలను 'ఏబీసీడీ' అవార్డులతో డీజీపీ గారు సత్కరించడం ఆనవాయితీ. దీనిలో భాగంగానే రెండో త్రైమాసికంలో అత్యంత క్లిష్టమైన కేసులను ఛేదించిన దర్యాప్తు బృందాలను డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు ప్రశంసించారు. వారి ప్రతిభకు గుర్తింపుగా ''అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ)'' పురస్కారాలను అందించారు. మంగళగిరిలోని ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీటిని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పోలీస్ కమీషనర్ సి.హెచ్. ద్వారకా తిరుమల రావు గారు, శాంతి భద్రతల విభాగం డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ అడిషనల్ డీజీపీ శ్రీ ఎన్. శ్రీధర్ రావు, బెటాలియన్స్ ఐజీపీ బి. శ్రీనివాసులు, లీగల్ ఐజీపీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకులుగా నమ్మించి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల నుంచి నగదును దోచుకున్న ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన విశాఖ సైబర్ పోలీసు స్టేషన్ బందం రాష్ట్రంలో ఏబీసీడీ (అవార్డు ఫ్రం బెస్ట్ క్రైం డిటెక్షన్)లో మొదటిస్థానంలో నిలిచి అవార్డు సాధించింది. సైబర్ పోలీసుస్టేషన్ సి.ఐ. గోపినాథ్ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను పట్టుకున్నారు. నిందితులు అంతర్జాతీయ వాట్సాప్ కాల్స్ ద్వారా మొబైల్స్‌కు దొరక్కుండా స్పూఫింగ్ కాల్స్‌తో బాధితులను మోసగించారు. విశాఖతోపాటు హైదరాబాద్, ఇతర జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులను ఈవిధంగా మోసం చేశారు. ఈ కేసును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను అదుపులోకి తీసుకోవటంలో సైబర్ పోలీసులు విజయవంతమయ్యారు. అవార్డులను రాష్ట్ర డీజీపి శ్రీ గౌతమ్ సవాంగ్ గారు మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రధానం చేశారు. అవార్డులను సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ సి.ఐ. గోపినాథ్, ఎస్.ఐ. ఎన్.రవికుమార్, కానిస్టేబుళ్లు బి.వి.సతీష్‌కుమార్ (పిసి - 3559), పి.మురళీ (పిసి - 3313), పి. సూర్యచంద్రరావు (ఎఆర్‌పిసి - 589), హెచ్.జి - 557 బి.వి.రాంబాబులు అందుకున్నారు. సీసీ పుటేజీలతో కేసు ఛేదన... విజయనగరంలో సుమారు 13 లక్షల విలువైన పేపరు లారీలో లోడ్ చేసుకుని బెంగళూరు గమ్యస్థానానికి చేరాల్సి వుంది. బెంగళూరుకు పేపర్ లోడ్ చేరకపోవడంతో పేపర్ యజమాని విజయవాడకు చెందిన వినయ్ ప్రతాప్‌సింగ్ విజయనగరం వన్ ట్‌న్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న తర్వాత సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీఎస్ డీఎస్పీ జె. పాపారావు ఆధ్వర్యంలోని పోలీస్ బృందం దర్యాప్తును ముమ్మరం చేశారు. టోల్ ప్లాజాల వద్దగల సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి లోడ్‌తో వెళ్లిన లారీని పశ్చిమబంగాలోని పనుసుకురా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారంద పసుపురా వద్ద పార్కింగ్‌లో వుండడాన్ని గుర్తించారు. సీసీఎస్ సిబ్బంది లారీ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా లారీ డ్రైవర్‌తో కలిసి పేపర్‌ను విక్రయించినట్లు తేలింది. ఎటువంటి ఆధారం లేని కేసును కేవలం టోల్ గేట్ సీసీ కెమెరా పుటేజీల అధారంగా ఛేదించిన నందుకుగాను సీసీఎస్ పోలీసులను ఏబీసీడీ అవార్డుకు డీజీపీ గారు ఎంపిక చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఈ అవార్డులను సీసీఎస్ డీఎస్పీ జె. పాపారావు, సీఐ పి. శోభన్ బాబు, ఎస్‌ఐ ఎస్. జియాద్దీన్, ఏఎస్‌ఐ ఆరి, హెచ్‌సీ డి. శంకరరావులకు డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు అందజేసి అభినందించారు. కాబోయే భార్యే హంతకురాలు... కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణం రంగనాయకులపేటకు చెందిన అబ్దుల్‌ఖాదర్ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీరుగా పనిచేసేవాడు. జూన్ 23న ఖాదర్‌కు అత్తకూతురితో వివాహం జరగాల్సి ఉంది. రంజాన్ పండుగ కోసం జూన్ 5న సొంత ఊరికి వచ్చేందుకు రైల్వేకోడూరులో బస్సు దిగి ఇంటికి వెళుతుండగా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు పది రోజుల్లోనే ఈ మిస్టరీని ఛేదించారు. పెండ్లికూతురిగా పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి తన ప్రియుడితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సీఐ బాలయ్య, ఆయన సిబ్బంది సీసీ ఫుటేజీలను పరిశీలించగా అబ్దుల్‌ఖాదర్‌ను హత్య చేసింది తమిళనాడు ముఠా అని గుర్తించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడులో ఉంటున్న ఖాదర్ మేనత్త కూతురు సబ్నకు ఖాదర్‌తో జూన్ 23న వివాహం నిశ్చయించారు. కానీ సబ్న మాత్రం ప్రిన్స్ అనే యువకుడిని ప్రేమించడం, ప్రియుడితోనే ఉండాలని, అత్త కొడుకు ఖాదర్‌ను హతమార్చాలని ప్రణాళికలు రచించారు. రంజాన్ పండుగ కావడంతో బెంగుళూరు నుంచి బస్సు దిగి ఇంటికి వెళుతున్న ఖాదర్‌ను మాటు వేసి కిరాతకంగా నరికి చంపారు. అక్కడున్న సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి పది రోజుల్లోనే అరెస్టు చేసి రిమాండుకు పంపారు. పది రోజుల్లోనే హత్య మిస్టరీ ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో విజయం సాధించిన కోడూరు పోలీసులకు రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు ఎబిసిడి అవార్డుతో సత్కరించారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన అప్పటి రైల్వే కోడూరు, ప్రస్తుత చిత్తూరు జిల్లా ఈస్ట్ సి.ఐ కె.బాలయ్య, కోడూరు ఎస్సై పి.వెంకటేశ్వర్లు, ఓబులవారిపల్లి ఎస్సై ఆర్.మోహన్, కోడూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు ఓ.నరసింహులు (పిసి - 2637), వి.బ్రహ్మాండ రెడ్డి (పిసి - 2679), పి.అనిల్ కుమార్ (పిసి - 848) అవార్డులను అందుకున్నారు.