యూనిట్
Flash News
నిజం దాచి మృతి చెందిన బాధితుడు... మిస్టరీని చేధించిన పోలీసులు
విజయవాడ
ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి చనిపోయినట్లు ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌కు
డెత్ ఇంటిమేషన్ వచ్చింది. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు వెంటనే ప్రభుత్వ
హాస్పటల్‌కు చేరుకుని మృతునికి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
మృతి చెందిన వ్యక్తిని గన్నవరం ప్రభుత్వ హాస్పటల్ నుండి మెరుగైన వైద్యం నిమిత్తం
విజయవాడ ప్రభుత్వ హాస్పటల్‌లో చేర్పించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మృతుని తల్లి
మేకల పుల్లమ్మ ఫిర్యాదుచేసింది. మృతి చెందిన వ్యక్తి పేరు మేకల వెంకటేశ్వరరావు అని, తమది పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగి. అవివాహితుడైన తన కుమారుడు 2 నెలల
నుండి హనుమాన్ జంక్షన్ మరియు తేలప్రోలు మధ్య కోమటిగుంటలో ఉన్న ఒక నూనె
కర్మాగారంలో పని చేస్తున్నాడు. ఇంటి నుండి టివిఎస్ స్కూటర్‌పై పనినిమిత్తం
బయలుదేరి వెళ్లిన తన కుమారుడు ఆ రోజు ఇంటికి రాలేదని, నా
కుమారుడు దెబ్బలు తగిలి గన్నవరం ప్రభుత్వ హాస్పటల్ ఉన్నట్టు తన పెదకుమార్తె
నాగలక్ష్మికి ఫోన్ చేసి హాస్పటల్ సిబ్బంది తెలియజేశారు. నా కుమారుడి స్నేహితుడైన
వినయ్ ఫోన్ చేసి విజయవాడ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించినట్లు తెలియజేశాడు. తన
కుమార్తెతో కలసి విజయవాడ ప్రభుత్వ హస్పటల్‌కు చేరుకుని తన కుమారుడిని ఏమి
జరిగిందని అడగ్గా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పొట్టిపాడు టోల్‌గేట్ వద్ద
తనను లిఫ్ట్ అడిగి బండిపై ఎక్కి కొంత దూరం వెళ్ళిన తరువాత మోటారు బైక్‌ను ఆపి
తనపై విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేసి తన వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్ లాక్కోవడంతో పాటు బట్టలు కూడా తీసుకెళ్ళినట్లు, విజయ వాడలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు ఆత్కూరు పోలీసులు.
మిస్టరీగా మారిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తులో భాగంగా నేరం
జరిగినట్లు చెప్పిన ప్రదేశంలో విచారించడం జరిగింది. గాయాలతో వీరవల్లిలో ఉన్న
వెంకటేశ్వరరావును వీరవల్లి పోలీసులు గన్నవరం హాస్పిటల్‌లో చేర్పించారని తెలిసింది.
వారిని సంప్రదించగా వీరవల్లిలోని ఒక హోటల్ వద్ద గాయాలపాలై కట్‌డ్రాయర్‌తో పడిపోయి
ఉన్నట్లు హోటల్ యజమాని ఇచ్చిన సమాచారంపై అక్కడికి వెళ్ళి వెంకటేశ్వరరావును 108 అంబులెన్స్‌లో తరలించామని తెలిపారు. పోలీసులకు లభించిన సమాచారం
అనుమానాస్పదంగా ఉండడంతో అనేక కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు పని
చేస్తున్న కంపెనీలో విచారించగా మృతుడికి వినయ్ అనే స్నేహితుడున్నాడని తెలిసింది.
అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా పలు విషయాలు తెలిపాడు. ఆయిల్
కంపెనీలో స్వీపర్‌గా పని చేసే జ్యోతి అనే మహిళ ద్వారా ఝాన్సీ రాణి అలియాస్
చిన్నారి అనే మహిళ ఫోన్ నంబరును వెంకటేశ్వరరావు తీసుకుని ఈ మధ్య కాలంలో తరచూ
ఆమెతో ఫోన్లో మాట్లాడుతున్నాడని వినయ్ చెప్పాడు. అనంతరం జ్యోతిని విచారించగా
ఝాన్సీరాణి అనే మహిళ తన స్నేహితురాలని, తన వద్ద
ఝాన్సీరాణి ఫోన్ నంబరు తీసుకుని తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతున్నాడని
తెలియజేసింది. ఝాన్సీరాణి అలియాస్ చిన్నారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో
నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఝాన్సీరాణికి తోమండ్రు రవీంద్రకుమార్‌తో వివాహేతర
సంబంధం ఉండేది. ఝాన్సీరాణి ఇంటికి సమీపంలో నివాసం ఉండే కరుటూరి రాజు మరియు
వెంకటేశ్వరమ్మలతో రవీంద్రకుమార్‌కు పరిచయం అయింది. ఆ పరిచయంతో రవీంద్రకుమార్,
ఝాన్సీరాణి, రాజు మరియు వెంకటేశ్వరమ్మలు
కుటుంబ విషయాలు మాట్లాడుకునే వాళ్ళు. ఒక రోజు ఇంట్లో ఫోన్ మర్చిపోయి బయటకు వెళ్ళిపోయిన
రాజు తిరిగి తన నంబరుకు ఫోన్ చేయగా ఎంగేజ్ వచ్చింది. ఇంటికి వచ్చిన రాజు ఫోన్
ఎందుకు ఎంగేజ్ వచ్చిందని వెంకటేశ్వరమ్మను గట్టిగా నిలదీయడంతో ఫోన్ నుండి
వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో ఝాన్సీరాణి మాట్లాడిందని తెలియజేసింది. ఝాన్సీరాణి
మరో వ్యక్తితో మాట్లాడుతుందని తెలుసుకున్న రాజు ఈ విషయాన్ని రవీంద్రకు చేరవేశాడు.
ఈ విషయంపై ఝాన్సీరాణితో రవీంద్రకుమార్ గొడవపడటం జరిగింది. రవీంద్ర కుమార్ మృతుడు
పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళి వెంకటేశ్వరరావును కొట్టి ఇకపై ఝాన్సీరాణికి ఫోన్
చేసి మాట్లాడితే చంపేస్తానని బెదిరించాడు. తర్వాత కూడా ఝాన్సీరాణితో మృతుడు
మాట్లాడుతున్నాడని రవీంద్రకు తెలిసింది. తనకు ఝాన్సీరాణికి అడ్డుగోడలా ఉన్న
మృతుడిని ఏదో రకంగా పిలిపించి అతన్ని ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న రవీంద్రకుమార్
ఈ విషయాన్ని ఝాన్సీరాణితో చెప్పగా ఇందుకు ఆమె అంగీకరించడం జరిగింది. ఐతే వెంకటేశ్వరరావుపై
దాడి చేయాలంటే వీరిద్దరి వల్ల కాదని రాజు మరియు వెంకటేశ్వరమ్మలను సంప్రదించి వారి
సహాయం కోరగా ఇందుకు వారు కూడా అంగీకరించారు. రవీంద్రకుమార్, ఝాన్సీరాణి, రాజు మరియు వెంకటేశ్వరమ్మ నలుగురు
కలసి రెండు కర్రలు తీసుకుని కోమటిగుంట రైల్వే గేటు వద్ద రోడ్డుకు ఒక వైపు నీరులేని
వాగు వద్ద కాపుకాసారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం రాత్రి సమయంలో
వెంకటేశ్వరరావుకు ఝాన్సీరాణి ఫోన్ చేసి తాను కోమటిగుంట చర్చి వద్ద ఉన్నానని,
అక్కడకు రమ్మని చెప్పగా అనుకున్న విధంగానే వెంకటేశ్వరరావు చర్చి
వద్దకు వచ్చాడు. ఝాన్సీరాణి వెంకటేశ్వరరావు బైక్ ఎక్కి రవీంద్ర, రాజు మరియు వెంకటేశ్వరమ్మలు కాపు కాసిన ప్రదేశానికి తీసుకువచ్చింది.
అక్కడ శారీరకంగా కలుద్దామని చెప్పి కట్ డ్రాయర్ మినహా వెంకటేశ్వరరావుతో బట్టలు
మొత్తం ఝాన్సీరాణి తీయించింది. అదే అదనుగా భావించిన రవీంద్ర మరియు రాజులు చీకట్లో
అకస్మాత్తుగా వచ్చి వెంకటేశ్వరరావుపై విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేయగా
ఝాన్సీరాణి మరియు వెంకటేశ్వరమ్మలు దాడికి సహకరించారు. దెబ్బలు తాళలేక
వెంకటేశ్వరరావు క్రింద పడిపోవడంతో అతను చనిపోయాడని అనుకుని దాడి చేసిన కర్రలను
సంఘటన జరిగిన ప్రదేశంలో మరియు వెంకటేశ్వరరావు బట్టలను ప్రక్కనే ఉన్న ఫామాయిల్
తోటలో పడేసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. సంఘటన జరిగిన కొంత సమయానికి తేరుకున్న
వెంకటేశ్వరరావు తన బైక్‌పై వీరవల్లిలోని ఒక హోటల్ దాకా వచ్చి అక్కడ పడిపోవడం
జరిగింది. మృతుడు అసలు విషయం దాచి కేసును పక్కదారిన పట్టించినప్పటికీ పోలీసు బృందం
శాస్త్రీయ పరిశోధనతో నిందుతుల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన
దర్యాప్తు బృందానికి సిపి ద్వారకా తిరుమలరావు అభినందించి రివార్డులతో సత్కరించారు.