యూనిట్

శ్రీసిటీ సెజ్‌లో భారీ దొంగతనం... కంజర్‌ భట్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌

ఓ రోజు రాత్రి శ్రీ సిటీ సెజ్‌ నుండి కోల్‌కతాకు జియోమీ రెడ్‌ మీ సెల్‌ ఫోన్‌ల లోడుతో వెళ్తున్న ఐచర్‌ కంటైనర్‌ ను జాతీయ రహదారి - 16 పై దగదర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు. డ్రైవర్‌ను కొట్టి సెల్‌ లోడ్‌లారీని, అందలి సెల్‌ఫోన్స్‌ లోడును బలవంతంగా ఎత్తుకొని పోయి, అందులోని సుమారు 4.80 కోట్ల విలువ కలిగిన సెల్‌ ఫోన్‌లను ఎక్కడో అన్‌లోడ్‌ చేసి, ఖాళీ లారీని కావలి పరిధిలోని గౌరవరం వద్ద వదిలి వెళ్లిపోయారు. సదరు ఐచర్‌ను పోలీసులు స్వాధీన పరుచుకొని హైవే డెకాయిటీగా కేసు నమోదు చేసుకొని ముమ్మర దర్యాప్తు సాగించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ప్రత్యక్షపర్యవేక్షణలో పది ప్రత్యేక పోలీస్‌ బందాలను రంగంలోకి దించారు. నెల్లూరు నుండి హైదరాబాద్‌ మీదుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వరకు ఉపయోగించిన లారీలను ట్రాక్‌ చేశారు. ఈ క్రమంలో కొన్ని వేల గంటలపాటు అన్ని టోల్‌ గేట్ల వద్ద గల సిసి ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. వీటి ఆధారంగా నెంబర్‌ ప్లేట్‌ లేని కొత్త హ్యుందాయ్‌ క్రెటా కారు రెక్కీ చేయడమే కాకుండా ఐచర్‌ వెహికల్‌కు పైలెట్‌గా వ్యవహరించినట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా 8 రాష్ట్రాల క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోల నుండి వేలిముద్రల డేటా సేకరించారు. అదేవిధంగా మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాలలో కంజర్‌ భట్‌ గ్యాంగ్‌ల నేర చరిత్ర సేకరించారు. దీనితో ఈ నేరంలో కంజర్‌ భట్‌ గ్యాంగ్‌ ప్రమేయం నిర్ధారణ కావడంతో మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లాకు చెందిన సుఖేష్‌ హడా, సంతోష్‌ కంజర్‌ భట్‌లను అరెస్ట్‌ చేశారు. వీరిని క్షుణ్ణంగా విచారించిన మీదట వారు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌ మాల్డాకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్‌ షేక్‌ హామీదుజ్జమం, మధ్యప్రదేశ్‌ దేవాస్‌కు చెందిన అంకిత్‌ శ్రీ వాత్సవ్‌, పవన్‌ చౌదరిలను, మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన ప్రదీప్‌ మాధవన్‌ను అదుపులోనికి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 70 లక్షల చోరీ సొత్తు, ఐచర్‌ లారీ, ఒక మహీంద్రా ఎక్స్‌ యూవీ కారు, 8 సెల్‌ ఫోన్స్‌ స్వాధీనపర్చు కున్నారు. కంజర్‌ భట్‌ దొంగిలించిన ఈ సెల్‌ ఫోన్స్‌ను మధ్యప్రదేశ్‌కు చెందిన రిసీవర్‌కు అమ్మగా, అక్కడి నుండి అవి పశ్చిమ బెంగాల్‌కు చెందిన రిసీవర్‌కు చేరాయి. అక్కడి నుండి దేశ సరిహద్దు మీదుగా బంగ్లాదేశ్‌ తరలించారు. ఈ కేసు పరిశోధనలో భాగంగా పోలీస్‌ బందాలు 7 రాష్ట్రాలలో లక్షకు పైగా పని గంటలు తీవ్రంగా శ్రమించారు. ఈ ముఠా మన రాష్ట్రంలో ఈ డెకాయిటీ చేయాడానికి ముందు రోజే తమిళనాడులో ఇదే తరహా డెకాయిటీ చేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా గంగవరం పోలీస్‌ స్టేషన్‌, అనంతపురం జిల్లా కనగానపల్లి పోలీస్‌ స్టేషన్‌ కేసులలో ఇలాంటి నేరాలకే ప్రయత్నం చేసి కుదరక డ్రైవర్లను చంపేశారు. ఎంతో క్లిష్టమైన ఈ కేసును పరిష్కరించిన బందంలో పీ. అక్కేశ్వర రావ్‌ (ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌, సిసిఎస్‌, నెల్లూరు), బి. సురేష్‌ బాబు (ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌, బుచ్చిరెడ్డి పాలెం సర్కిల్‌), షేక్‌ బాజీ జాన్‌ సైదా (ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌, సిసిఎస్‌, నెల్లూరు), బి. ప్రసాద్‌ (ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌, సిసిఎస్‌, నెల్లూరు), షేక్‌ ఫిరోజ్‌ (ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌, పొదలకూరు మాజీ ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌), షేక్‌ హుస్సేన్‌, (ఎస్సై చిల్లకూరు పీఎస్‌), జి. సుబ్బారావ్‌ (ఎస్సై దగదర్తి పీఎస్‌), ఎం. బాబీ (ఎస్సై, హెడ్‌ క్వార్ట్రర్స్‌, నెల్లూరు), జెపీ శ్రీనివాసులు రెడ్డి, (ఎస్సై సిసిఎస్‌, నెల్లూరు), జి. అంకమ్మ, (ఎస్సై సిసిఎస్‌, నెల్లూరు), ఏ. సురేష్‌ బాబు (ఎస్సై, సైబర్‌ క్రైమ్‌, నెల్లూరు), ఎన్‌. శ్రీనివాసులు రెడ్డి, (ఏఎస్‌ఐ, దగదర్తి పీఎస్‌), ఆర్‌ వెంకటేశ్వర రాజు, (హెడ్‌ కానిస్టేబుల్‌, గూడూరు రూరల్‌ పీఎస్‌), పీ. ఆదినారాయణ (కానిస్టేబుల్‌, గూడూరు పీఎస్‌), పీ. చిన్న కేశవ (కానిస్టేబుల్‌ దగదర్తి పీఎస్‌), కె. జయచంద్ర (కానిస్టేబుల్‌, బుచ్చిరెడ్డిపాలెం పీఎస్‌), డి. నవీన్‌ విజయ కష్ణ, (కానిస్టేబుల్‌, సైబర్‌ క్రైమ్‌), ప్రసాద్‌, వంశీ (డ్రైవర్స్‌, బుచ్చిరెడ్డి పాలెం సర్కిల్‌), అనిల్‌, వెంకటేశ్వర్లు, (కానిస్టేబుల్స్‌, బుచ్చిరెడ్డిపాలెం పీఎస్‌), హరిబాబు (కానిస్టేబుల్‌, సంగం పీఎస్‌)లు వున్నారు. వీరిని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అభినందించి రివార్డ్స్‌ అందజేశారు.

వార్తావాహిని