యూనిట్

తీగలాగితే... కదిలిన నాలుగు హత్యల డొంక

- పందుల కేసు ఛేదించేందుకు ప్రయత్నించిన పోలీసుల విచారణలో మరో నాలుగు హత్యలు వెలుగు చూశాయి

- ఇవన్నీ పాత హత్యకేసులే... ఇందులో 2004 సంవత్సరంలో జరిగిన హత్య కేసు కూడా ఉంది

- వీటిల్లో రెండు హత్యలకు సంబంధించి కనీసం ఫిర్యాదులు కూడా అందలేదు

- మరో రెండింటిలో ఒకటేమో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని... ఇంకొకటేమో గుర్తుతెలియని శవంగా నమోదయింది

- ఆరుగురు నిందితులు అరెస్ట్ 

అనంతపురంలో మూడ్రోజుల కిందట జరిగిన పందుల దొంగతనం కేసును పోలీసులు చేధించే క్రమంలో నాలుగు హత్య కేసులు వెలుగు చూశాయి. ఇవన్నీ కూడా 2004 నుండి  2010 సంవత్సరం మధ్య జరిగినవే. ఈ నాలుగు హత్య కేసుల్లో రెండు కేసుల్లో కనీసం ఫిర్యాదులు కూడా అందలేదు. మిగతా రెండు కేసుల్లో ఒక కేసు గుర్తుతెలియని వ్యక్తి హత్య అయినట్టు... మరొక ఒక కేసులో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు నమోదయ్యాయి. తీగలాగితే దొంక కదిలిన చందంగా అనంతపురం రూరల్ మరియు టూటౌన్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పందుల దొంగతనం కేసుతో పాటు నాలుగు హత్య కేసులు ఛేదించారు. ప్రస్తుత పందుల కేసుతో పాటు గతంలో జరిగిన కేసుల్లో నిందితులైన ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆరు పందులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అరెస్టయిన వారిలో రౌడీ షీటర్ కూడా ఉన్నాడు. ఇతనిపై ఈ నాలుగు హత్య కేసు లతోపాటు మరో రెండు హత్య కేసులు కూడా ఉన్నాయి. బుధవారం అనంతపురం డీఎస్పీ జి. వీర రాఘవరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.

అరెస్టయిన నిందితుల వివరాలు

1) తొత్తుక సుంకన్న ఆదర్శ నగర్, అనంతపురం.

2) తొత్తుక నాగన్న, ఆదర్శ నగర్, అనంతపురం.

3) వడ్డే నందకిషోర్ @ నందా, వెంకట్ రెడ్డి వీధి, అనంతపురం.

4) జగన్నాథం నాగరాజు, సుగూరు రోడ్డు, హిందూపురం.

5) నాగభూషణం @ బుసి, సూర్య రోడ్డు , హిందూపురం.

6) శివ@  అభిమన్యుడు, మేళాపురం, హిందూపురం.

పందుల దొంగతనం కేసు ఛేదింపు ఇలా...

స్థానిక కక్కల పల్లి కాలనీకి చెందిన సాకే ఆదినారాయణకు చెందిన పది పందులు దొంగతనానికి గురైనట్లు ఈనెల 5 వ తేదీన అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈనేపథ్యంలో ... జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు... అనంతపురం డీఎస్పీ వీర రాఘవ రెడ్డి  పర్యవేక్షణలో అనంతపురం రూరల్ ఇన్స్పెక్టర్ మురళీధర్ రెడ్డి, టూటౌన్  సి.ఐ జాకీర్ హుస్సేన్ ఖాన్ ...ఎస్ ఐ లు రఘు ప్రసాద్, నబి రసూల్, రాఘవరెడ్డి, జయపాల్ రెడ్డి మరియు సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈ ఆరుగురిని బుధవారం స్థానిక కట్టకిందపల్లి సమీపంలో అరెస్టు చేశారు

తీగలాగితే డొంక కదిలిన చందం...

తీగలాగితే డొంక కదిలిన చందంగా పందుల దొంగతనంతో పాటు ఈ ముఠా గతంలో చేసిన నాలుగు హత్యలు బయటపడ్డాయి. ఈ నాలుగు హత్యలను వీరంతా కలిసే చేశారు. పవన్ కుమార్ హత్య కేసులో మాత్రం రాంమోహన్ , నాగరాజు అనే నిందితులను కలుపుకున్నారు. ఈ ఇద్దరూ చనిపోయినారు కూడా... 

1) 2004 సంవత్సరంలో పవన్ కుమార్ హత్య...అనంతపురం నగరం ఆదర్శ నగర్ కు చెందిన పవన్ కుమార్ ను 2004 సంవత్సరంలో ప్రస్తుతం అరెస్టయిన ఆరుగురు మరియు ఇదివరకే మృతి చెందిన రామ్మోహన్ , నాగరాజులతో కలిసి  దారుణంగా చంపారు. రామ్మోహన్ గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నాడనే  నెపంతో పవన్ కుమార్ ను స్థానిక పెద్దన్న కొట్టాల వద్దకు పిలిపించి వేట కొడవళ్లతో దారుణంగా హతమార్చి శవాన్ని అక్కడే పూడ్చి పెట్టారు. ఈ కేసులో కనీసం ఫిర్యాదు కూడా అందలేదు.

2) 2008 సంవత్సరంలో ఎరికల బాటన్న  హత్య...ప్రస్తుతం అరెస్టయిన నిందితుల్లో నాలుగో వాడైన జగన్నాథం నాగరాజు చిన్నాన్న బట్టల వ్యాపారి చిన్న స్వామిని ఎరుకల బాటన్న హత్య చేశాడని అనుమానించి ఈ ఆరుగురు కలిసి 2008 సంవత్సరంలో ఎరికల బాటన్న హత్యకు పథకం వేశారు. ఇందులో భాగంగా... హిందూపురంలోని శ్రీకంఠపురం చెరువులోకి తీసికెళ్లి మద్యం తాగించి ఎరికల బాటన్నను  వేట కొడవలితో నరికి చంపారు. ఆ తర్వాత శవం తల ... మొండెం వేరు చేసి మరియు చేతులను తెగనరికి గుర్తు పట్టని విధంగా  కంపచెట్లలో కాల్చి పారేశారు.

3) 2009 సంవత్సరంలో ఇబ్రహీం @ ట్రాక్టర్ భాష హత్య....అనంతపురం నగరం కళ్యాణదుర్గం రోడ్డులో ఇబ్రహీం @  ట్రాక్టర్ భాష ఒక హోటల్ నిర్వహించేవాడు. ఇతని వద్ద కు ప్రస్తుతం అరెస్టయిన మూడవ నిందితుడైన వడ్డే నంద కిషోర్ @ నంద మరియు జగన్నాథం నాగరాజులు 24-05-2009 న కుష్కా తినేందుకు వెళ్లారు. శేర్వా విషయంలోహోటల్ నిర్వాహకునితో గొడవ పడ్డారు. ఆ సందర్భంగా నిర్వాహకుడు ఇద్దర్ని తిట్ట సాగాడు. ఇది మనసులో ఉంచుకొని మిగతా నలుగురిని చేరదీసి అదే రోజు రాత్రి హోటల్ వద్ద మంచంపై నిద్రిస్తున్న ఇబ్రహీం @ ట్రాక్టర్ భాషను రోకలిబండతో తలపై కొట్టి దారుణంగా చంపారు. ఇతనిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఆ సందర్భంగా ఫిర్యాదు అందడంతో హత్య కేసు నమోదు చేశారు. 

4) 2010 సంవత్సరంలో కల్లుమడి ఎరికల సుంకన్న హత్య...కల్లుమడి ఎరికల సుంకన్న పందులు దొంగతనాలు చేసేవాడు. ప్రస్తుతం అరెస్టయిన ఆరుగురిలో ప్రధాన నిందితుడైన తొత్తుక  సుంకన్న అన్న తొత్తుక నాగరాజుకు సంబంధించిన పందులను పదేపదే ఇతను దొంగతనం చేసేవాడు. దీంతో ... కల్లుమడి ఎరికల సుంకన్నను ఎలాగైన తొలగించుకోవాలని భావించాడు. అతనిని చంపాలని తన తమ్ముడైన తొత్తుక సుంకన్నకు చెప్పాడు. దీంతో అతని హత్యకు పథకం రచించి....2010 సంవత్సరంలో నందకిషోర్ @ నంద మందు తాపిస్తానని కల్లుమడి ఎరికల సుంకన్నను సిండికేట్ నగర్ సమీపంలోని వంకలోకి తీసికెళ్లాడు. అప్పటికే మిగతా ఐదుగురూ సిద్ధంగా ఉన్నారు. మద్యం ఫుల్ గా తాగించి కల్లుమడి ఎరికల సుంకన్నను దారుణంగా వేటకొడవళ్లతో నరికి చంపారు. అంతేకాకుండా... ఆ శవాన్ని హత్య జరిగిన ప్రదేశంలోనే పూడ్చి పెట్టి పరారయ్యారు. ఈ హత్య కేసు విషయంలో కూడా ఫిర్యాదు అందలేదు. 

జిల్లా ఎస్పీ ప్రశంస... పదిహేను సంవత్సరాల కిందట నుండీ జరిగిన నాలుగు హత్య కేసులను ఛేదించిన అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలోని రూరల్ సి.ఐ మురళీధర్ రెడ్డి, టూటౌన్ సి.ఐ జాకీర్ హుస్సేన్ ఖాన్ ... ఎస్ ఐ లు రఘుప్రసాద్, నభీరసూల్, రాఘవరెడ్డి, జయపాల్ రెడ్డీ బృందాలను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అభినందించారు.

వార్తావాహిని