యూనిట్

అనుమానంతో భార్యను చంపిన భర్త అరెస్టు

      అనంతపురం జిల్లా  పుట్లూరు మండలం మడుగుపల్లిలో వారం కిందట భార్యను చంపిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. అనుమానంతో కట్టుకున్న వాడే హత్య చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. సోమవారం తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు.  నార్పల మండలం దుగుమర్రి గ్రామానికి చెందిన గుణశేఖర్ ను తాడిపత్రి రూరల్ సి.ఐ బి.దేవేంద్రకుమార్ , పుట్లూరు ఎస్ ఐ వెంకట ప్రసాద్ మరియు సిబ్బంది కలసి అరెస్టు చేశారు. ఈనెల16 వ తేదీన పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామంలో వెంకటలక్ష్మిని భార్య అని చూడకుండా దారుణంగా ఇతను చంపాడు. గుణశేఖర్ , వెంకటలక్ష్మిలకు 9 సంవత్సరాల కిందట వివాహమయ్యింది. వీరికి మూడవ తరగతి చదివే బాబు ఉన్నాడు. భార్యభర్తలిద్దరూ గొడవపడటం భార్యను భర్త కొట్టడం తరుచూ జరిగేవి. ఈ వేధింపులు భరించలేక వెంకటలక్ష్మి 9 నెలల కిందట భర్తతో  విభేదించి పుట్టింటికి చేరి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. గుణశేఖర్ తరుచూ మడుగుపల్లికి వచ్చి వెళ్లే వాడు. కానీ ఆమెపై భర్తకు అనుమానం ఉండేది. ఈక్రమంలో ... ఈనెల 16 వ తేదీ సాయంత్రం తన భార్యను చంపేయాలని పథకం పన్నుకుని వెంట కొడవలి తీసుకుని ద్విచక్ర వాహనంపై మడుగుపల్లికి వెళ్లాడు. పుట్టింట్లో ఉన్న భార్యను కొడవలితో దాడికి యత్నించాడు. ఆమె తండ్రి నడిపి బయ్యన్న అడ్డుకుని కొడవలి లాకున్నాడు. అంతటితో ఆగకుండా సమీపంలో ఉన్న పౌత్రాన్ని ( రోలుపై రుబ్బే రాయి సాధనం)తీసుకుని ఆమెపై దాడి చేసి విచక్షణారహితంగా గుణశేఖర్ చంపాడు.  

వార్తావాహిని