యూనిట్
Flash News
చిన్నారి వర్షిత హత్యకేసు నిందితుడి అరెస్ట్
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన చిన్నారి వర్షిత హత్యకేసు మిస్టరీని చిత్తూరు జిల్లా పోలీసులు చేధించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నవంబర్ 7,2109న రాత్రి 7.30 ని.ల సమయంలో ఒక కళ్యాణమండపము వద్ద అపహరణకు గురైన వర్షిత, మరుసటి రోజు ఉదయం అదే మండపం వెనుక చనిపోయి ఉండటం ఎంతో విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్ కుమార్ ప్రత్యేక పర్యవేక్షణలో మదనపల్లి డిఎస్‌పి రవి మనోహరాచారి ఆధ్వర్యంలో మదనపల్లి రూరల్ సిఐ అశోక్ కుమార్, పీలేరు అర్బన్ సిఐ సాథిక్ అలీ, మొలకల చెరువు సిఐ సురేష్ కుమార్, ఎస్.ఐ.లు దిలీప్ కుమార్, సుకుమార్, సునీల్‌లతో బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నవంబర్ 7, 2019న రాత్రి సుమారు 7.30ని.సమయంలో వర్షిత తన తల్లిదండ్రులతో కలసి అంగళ్లు మదనపల్లిరోడ్డులోని కేఎన్ కళ్యాణ మండపములో జరుగుతున్న బంధువుల పెళ్లి వేడుకకు వెళ్ళింది. భోజనాలు అయిన తదుపరి తిరిగి ఉదయం ముహూర్తంకు రావచ్చని కారు వద్దకు వెళ్లి చూసుకున్న తల్లిదండ్రులకు చిన్నారి వర్షిత కనిపించకపోవడంతో కంగారుపడి చుట్టు ప్రక్కలవెతికినప్పటికి ఆచూకి తెలియలేదు. మరుసటి రోజు ఉదయం అదే కళ్యాణమండపం వెనుక హర్షిత శవంగా మారి ఉండడం తీవ్ర కలకలం సష్టించింది. వర్షిత తల్లిదండ్రులతో విభేదాలు ఉన్నవారెవరైనా ఈ దారుణానికి ఒడిగట్టి ఉండ వచ్చన్న కోణంలో కూడా పోలీసులు దష్టి సారించారు.
ముందుగా కళ్యాణమండపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా, సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వయసుగల గుర్తు తెలియని యువకుడు వర్షితను తన సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీస్తూ , వర్షితను మండపం వెనుకకు తీసుకువెళుతున్నట్లుగా గుర్తించారు. దీని ఆధారంగా అనుమానితుడి ఫోటో ప్రింట్స్ తీయించి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలలో విస్తతంగా ప్రచారం చేయించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సదరు అనుమానితుడు కురబాల కోట మండలం అంగళ్లు గ్రామం మొలకలవరిపల్లికి చెందినలారీ క్లీనర్ పఠాన్ మొహమ్మద్ రఫీ అలియాస్ గిడ్డుగా నిర్దారణకు వచ్చారు. ముందుగా వేసుకున్న పకడ్భందీ పథకం ప్రకారం నవంబర్ 16, 2019 ఉదయం 9 గంటల సమయంలో అనుమానితుడు రఫీని అదుపులోనికి తీసుకున్నారు. ముందుగా తనకు తెలియదని బుకాయించినా, స్పష్టమైన ఆధారాలతో పోలీసులు ప్రశ్నించే టప్పటికి తాను చేసిన దారుణం చెప్పక తప్పలేదు.
రఫీ బాల్యం నుండి నేర మనస్తత్వంతో అఘాయిత్యాలకు పాల్పడిన చరిత్ర కలవాడు. 10 సంవత్సరాల క్రితం 6 వ తరగతి చదువుతున్నప్పుడే 5 సంవత్సరాల బాలికపై అత్యాచార ప్రయత్నం చేశాడు. దానిపై మదనపల్లి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టి జువెనల్ హోంకు తరలించడం జరిగింది. అదే విధంగా సంవత్సరంన్నర క్రితం ఒక వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న సమయంలో పక్కనే
ఉన్న నర్సరీలో పనిచేస్తున్న ఆమె మైనర్ కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు దేహశుద్ది చేసి పంపించి వేశారు. ఇలాంటి దుశ్చర్యలు మరిన్ని చేసినా ఫిర్యాదిదారులు ముందుకు రాకపోవడంతో వెలుగు చూడలేదు. రఫీ నుండి ఒక సెల్ ఫోన్, రూ. 3,870 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌లో వర్షిత ఫోటోలు కూడా లభించాయి. కేసును అత్యంత చాకచక్యంతో పరిశోధించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న దర్యాప్తు బందాన్ని జిల్లాఎస్పీ ఎస్.సెంథిల్ కుమార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డ్స్ అందజేశారు.