యూనిట్
Flash News
ఆంధ్రా బ్యాంక్ అప్రయిజరే అసలు దొంగ
అక్టోబర్ 14, 2019న చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్తాన పల్లె ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్‌లో భారీ దొంగతనం జరిగింది. లాకర్‌లోని 18 కేజీల బంగారంతో పాటు, రూ. 2.66 లక్షల నగదు చోరీ చేయడమే కాకుండా సీసీి కెమెరాల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని కూడా ఎత్తుకుపోయారు. జోనల్ మేనేజర్ మురళీకష్ణ ఈ విషయమై పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తక్షణమే స్పందించి చిత్తూరు, మదనపల్లె డీిఎస్పీలు ఈశ్వర్ రెడ్డి, రవి మనోహర ఆచారిలు, చిత్తూరు పశ్చిమ సీఐ లక్ష్మీ కాంత్ రెడ్డి, సీసీఎస్ సీఐలు రమేష్ కుమార్, భాస్కర్‌లతో కూడిన పది దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. దర్యాప్తు బృందం బ్యాంక్ సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను, స్నేహితులను క్షుణ్ణంగా విచారించారు. బ్యాంక్ అప్రయిజర్ రమేష్ ప్రవర్తన కొంత అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిపై ప్రత్యేక నిఘా పెట్టారు. వీరి అనుమానాన్ని నిజం చేస్తూ అక్టోబర్ 29న చిత్తూరు చావడి వీధిలో కరిగించిన బంగారాన్ని అమ్ముటకు వచ్చిన రమేష్ పోలీసుల చేతికి చిక్కాడు.
పోలీస్ విచారణలో రమేష్ వెల్లడించిన నిజాలు సినిమా సన్నివేశాలను తలదన్నే రీతిలో ఆశ్చర్యపరిచాయి. ఎంతో నమ్మకస్తుడిలా ఇటు బ్యాంక్ వారిని, అటు ఖాతాదారులను నమ్మించిన రమేష్ 2017 నుండి ఖాతాదారుల పేరిట నకిలీ బంగారు వస్తువులను బ్యాంక్‌లోనే తాకట్టు పెట్టి, వారికి తెలియకుండా రూ. 1.30 కోట్ల నగదును కాజేశాడు.ఈ విషయం రెండో కంటికి తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అలా సంపాదించిన డబ్బును షేర్ మార్కెట్లో పెట్టి పోగొట్టుకున్నాడు. దీనితో ఒక్కసారిగా భారీ మొత్తంలో బ్యాంక్ నుండి కాజేయడానికి పథకం సిద్ధం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంక్ మేనేజర్ సెలవుపై వెళుతూ బ్యాంక్ తాళాలు ఇంచార్జి మేనేజర్‌కు ఇవ్వమని రమేష్‌కు ఇవ్వగా, ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న రమేష్ వాటిని వేలూరు తీసుకుపోయి నకిలీ తాళాలు తయారు చేయించుకొచ్చాడు. కొద్దిరోజుల కిందట క్యాషియర్ భోజన సమయంలో టేబుల్‌పై పెట్టిన మాస్టర్ కీస్‌ను చాకచక్యంగా అచ్చు తీసుకొని వాటికీ నకిలీ చేయించాడు. ఇటీవల బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ పని మీద మెయిన్ బ్రాంచ్‌కు వెళ్ళినప్పుడు వాటిని ఉపయోగించి సఫలం కావడంతో అప్పటినుండి అదనుకోసం కాచుకున్నాడు. ఈలోపు బంగారం కరిగించే మిషన్‌తో పాటు, మరికొన్ని పనిముట్లు కొనుగోలు చేసి మిట్టూరులో ఒక షాప్ తెరిచాడు. అక్టోబర్ 12 ,13 తేదీలు రెండో శనివారం, ఆదివారం కావడంతో తన పథకాన్ని అమలు చేయడానికి సిద్ధపడ్డాడు.13న మధ్యాహ్నం బ్యాంక్ వద్ద ఎవరు లేని సమయంలో తన వద్ద ఉన్న నకిలీ తాళాలతో బ్యాంక్ తెరచి, లోపలికి వెళ్లి మాస్టర్ కీ తో లాకర్లు కూడా తెరిచి వాటిలోని మొత్తం బంగారు నగలు, రూ. 2.66 లక్షల నగదు దోచుకుని మళ్ళీ యధావిధిగా తాళాలు వేసి వెళ్ళిపోయాడు.
అదే రోజు సాయంత్రం ఆ నగలను షాప్‌కు తీసుకుని వెళ్లి ముద్దలుగా కరిగించాడు. నకిలీ నగలను మూట కట్టి మురికి కాలువలో పడేశాడు. సోమవారం ఏమి తెలియనట్టే నటిస్తూ పోలీస్ స్టేషన్‌కు కూడా మిగతా సిబ్బందిలానే వెళ్లి దొంగతనం గురించి ఫిర్యాదు ఇచ్చి, యథాలాపంగా తన పని చేసుకుంటున్నాడు. ఆశకు పోయి బంగారాన్ని అమ్ముదామనుకున్నంతలో అప్పటికే ఒక కన్నేసి ఉంచిన పోలీసులు అదుపులోకి తీసుకొని నిజం కక్కించారు. అతని వద్ద నుండి బ్యాంక్‌లో దొంగిలించిన 11 1/2 కేజీలు బంగారం, 7 కేజీలు నకిలీ నగలు రూ. 2,66,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఖాతాదారుల పేరిట బ్యాంక్‌ను మోసగించి తీసుకున్న 1,30,00,000లలో 10,20,000 విలువ గల సొత్తు, నగదుతో పాటు ఒక కారు, రెండు మోటార్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ చోరీ కేసును అత్యంత ప్రతిభావంతంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్ కుమార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డ్స్ అందజేశారు.