యూనిట్

అన్వేషణ భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా

 భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా

గత సంచికలో వివిధ రూపాల్లో నేరస్థలంలో లభించే పెయింట్‌కు, అనుమానిత వాహనపు పెయింట్‌కు ఎటువంటి శాస్త్రీయ పరీక్షలు నిర్వహిస్తారు? అందుకు ఉపయోగించే శాస్త్రీయ పరికరాలు ఏమిటి? ఈ పరీక్షలను ఉపయోగించి ఏయే విషయాలు నిపుణులు తెలుసుకొని దర్యాప్తుకు తోడ్పడుతారు? పెయింట్‌ సేకరణ, రవాణాకు కావలసిన సామగ్రి గురించి, ఈ శాంపిళ్ళ సేకరణ మరియు రవాణాలో దర్యాప్తు అధికారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాలు తెలుసుకున్నాం. ఈ సంచికలో పాదముద్రలు, పాదరక్షల ముద్రలు అంటే ఏమిటి? వివిధ నేరాల్లో లభించే ఈ పాదముద్రలను ఏవిధంగా వర్గీకరిస్తారు? వీటిని గురించి చర్చించడానికి మరియు అర్ధం చేసుకోవడానికి దర్యాప్తు అధికారికి కావలసిన కనీస పరిజ్ఞానం కోసం

ఉపోద్ఘాతంలో పాదముద్రల ప్రాధాన్యత, పాదం యొక్క నిర్మాణం, వివిధరకాలైన పాదముద్రల గురించి క్లుప్తంగా ఈ సంచికలో చర్చిద్దాం...

''పాదముద్ర అంటే నేలమీద ఆ పాదం వల్ల ఏర్పడిన ముద్ర అనే కాదు, ఆ పాదం నేలమీద వ్యక్తీకరించే ఒత్తిడి అని అర్ధం''. పాదముద్రల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'ఇక్నాలజీ' (Iషష్ట్రఅశీశ్రీశీస్త్రవ) అని అంటారు. గ్రీక్‌లో 'ఇక్నాస్‌' అనగా 'ట్రాక్‌' (మార్గం) అని అర్ధం. ఉదాహరణకు ఏదైనా దొంగతనానికి పాల్పడేవాడు తన ఉనికిని తెలియకుండా, శబ్దం రాకుండా నడిచేందుకు కాలికి చెప్పులు లేదా బూట్లు లేకుండా గోడలు దుమికి శబ్దం రాకుండా తాళం కప్పకు బట్టను పెట్టి, గునపం వంటి సాధనంతో తాళం కప్పను పగులగొట్టి, బీరువా తాళాల కోసం గదంతా వెతికి, అదీ దొరకకుంటే  పలుచని మొనగల రాడ్‌తో బీరువాను తెరిచి విలువైన వస్తువులను దొంగిలిస్తాడు. ఇటువంటి నేరాల్లో గోడ దుమికిన దగ్గర నుంచీ బీరువాలోని సొమ్ములు దొంగిలించేంత వరకు నేరస్థుడు తనని వేలిముద్రల ద్వారా గుర్తించకుండా ఉండేందుకు చేతులకు గ్లోవ్స్‌ ధరించి జాగ్రత్త పడవచ్చు, లేదా తాకిన ప్రదేశాల్లో తడిచిన బట్టతో తుడిచేయవచ్చు. కానీ పాదముద్రలు లేదా పాదరక్షల ముద్రలు పడకుండా జాగ్రత్త పడలేడు.  అందుకే నేరస్థలంలో దొరికే వివిధ సాక్ష్యాధారాలలో పాదముద్రల అధ్యయనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆకాశం హద్దులను దాటి మానవుడు చంద్రమండలం మీద కూడా కాలుమోపాడు అనడానికి అక్కడున్న మానవుడి పాదముద్రలే అసలైన సాక్ష్యాధారాలు. (చిత్రం - 1)

ఎంతో విలువైన ఈ సాక్ష్యాధారాలు నేరస్థుని ఆచూకీ తెలుసుకోవడానికి  ఎంతగానో ఉపయోగపడతాయి. దోపిడీ, దొంగతనం, హత్య, ఆత్మహత్య, మానభంగం మొదలగు వివిధ నేరాల్లో పాదముద్రలు తరచుగా మనకు కనిపిస్తుంటాయి. 

వీటిని బట్టి నేరంలో పాలు పంచుకున్న వ్యక్తుల సంఖ్యను, ప్రవేశ మార్గాన్ని, నిష్క్రమణ మార్గాన్ని, వారి స్థానాలను, నేరస్థలంలో వారు నేరం ఎలా చేశారన్న విషయాలను ఈ పాదముద్రల ద్వారా పునర్‌ నిర్మాణం గావించి అంచనా వేయవచ్చు. వీటినిబట్టి ప్రయాణ దిశను, వయస్సును, స్త్రీ పురుష లింగబేధాన్ని, పొడుగువారా? లేక పొట్టివారా? పరిగెడుతున్నాడా?, నడుస్తున్నాడా? లేక ఏదైనా బరువును మోస్తున్నాడా? అన్న విషయాలను తెలుసుకోవచ్చు. వివిధ నేరాలలో దొరికిన పాదముద్రలకు సారూప్యత ఉంటే ఫలానా నేరస్థుడని కూడా అవగాహన కుదరవచ్చు. వేలి ముద్రలవలే ఏ ఇద్దరి వ్యక్తుల పాదముద్రలు కూడా ఒకటిగా ఉండవు. అందుకే ఇవి వ్యక్తిని గుర్తించడంలో ఎంతో దోహదం చేస్తాయి.

నేరాన్ని రుజువుచేసే ఈ పాదముద్రల గురించి కొంచెం విపులంగా తెలుసుకుందాం. ఈ ప్రపంచంలోని జీవరాశుల పాదాల ఆకారాలను పరిశీలిస్తే మానవుల పాదముద్ర ఆకారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. (చిత్రం-2) జీవరాశుల పాదముద్రల్లో మానవుల పాద ముద్రలను సులభంగా గుర్తించవచ్చు. మానవుని పాదంలో 28 ఎముకలు ఉంటాయి. అవి 7 - టార్సల్‌ ఎముకలు, 5 - మెటా టార్సల్‌ ఎముకలు, 14 - ఫలాన్జస్‌, 2 - సిస్మాయిడ్‌ ఎముకలు. శరీర బరువును మోయడానికి టార్సల్‌ మరియు మడమలు ఉపయోగపడతాయి. (చిత్రం-3) నడవడానికి, పరుగెత్తడానికి మెటా టార్సల్‌ మరియు ఫలాన్జస్‌ ఎముకలు ఉపయోగ పడతాయి. వీటి అమరికలలో తేడాల వల్ల పాదముద్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి.

పాదముద్రలు వాటి  ఆకారాన్ని బట్టి ఈ క్రింది విధంగా వర్గీకరించ వచ్చును.

1. సాధారణ పాదముద్రలు

2. విల్లు/ధనస్సు ఆకారం పాదముద్రలు

3. చదునైన (ఫ్లాట్‌) పాదముద్రలు

4. విరిగిన వంతెన (బ్రోకెన్‌ బ్రిడ్జి) ఆకారం పాదముద్రలు

5. యాక్సిడెంటల్‌ లేదా అసాధారణ పాదముద్రలు.

వివిధ రకాల పాదాలు మరియు ముద్రలు:

సాధారణ పాదముద్రలు:

విల్లు/ధనస్సు ఆకారం పాదముద్రలు

చదునైన (ఫ్లాట్‌) పాదముద్రలు

విరిగిన వంతెన (బ్రోకెన్‌ బ్రిడ్జి) ఆకారం పాదముద్రలు

యాక్సిడెంటల్‌ లేదా అసాధారణ పాదముద్రలు

నేరస్థలంలో దొరికే పాదముద్రలు ఏ ఆకారానికి సంబంధించినదో నిర్ణయించి వాటి యందు వున్న లక్షణాలు, అవలక్షణాలు, ఆకారం సైజు మరియు ఇతర కొలతలు నిందితుని గుర్తించడంలో ఉపయోగపడతాయి.

వార్తావాహిని