యూనిట్

నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా

గత సంచికలో దర్యాప్తు అధికారి అబ్జర్వేషన్‌ నోట్స్‌లో ప్రమాదం గురించి వ్రాసుకోవాల్సిన విషయాలు, నేరస్థలాన్ని స్కెచ్‌ మెథడ్‌ పద్ధతిలో ఏ విధంగా రికార్డు చేయాలి? అన్న విషయాలతోపాటు హిట్‌ అండ్‌ రన్‌ యాక్సిడెంట్‌ స్థలాల్లో ముఖ్యంగా దొరికే సూక్ష్మ భౌతిక సాక్ష్యాధారాల గురించి చర్చించాం. ఈ సంచికలో వాహనం ఢీకొని పారిపోయిన నేరాలలో దర్యాప్తు అధికారి ఏయే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి? మరియు జారుడుగుర్తుల పొడవును ఏ విధంగా గణనలోకి తీసుకోవాలి? డ్రాగ్‌ ఫ్యాక్టర్‌ మరియు బ్రేకింగ్‌ ఎఫీషియన్సి అంటే ఏమిటి? ప్రమాదస్థలంలో దొరికే స్కిడ్‌ మార్కులు మరియు ఇతర అంశాల ఆధారంగా ఏ విధంగా నేరవాహనపు వేగాన్ని లెక్కించవచ్చో? తెలుపుతూ అందుకు ఉపయోగించే వివిధ సూత్రాలను ఉదాహరణలతో ఈ సంచికలో చర్చిద్దాం...

ఫోరెన్సిక్‌ భౌతిక శాస్త్ర విభాగం

వాహనం ఢీకొని పారిపోయిన నేరాల్లో (హిట్‌ అండ్‌ రన్‌ యాక్సిడెంట్లలో) ప్రాణ నష్టం లేదా ఆస్థి నష్టం సంభవించినపుడు దర్యాప్తు అధికారి ఆ కేసును ఏయే కోణాల్లో పరిశీలిస్తే నిజానిజాలు వెల్లడవుతాయో? ఆయా విషయాలపై అవగాహన కోసం గత సంచికలో జారుడు గుర్తులు (స్కిడ్‌ మార్కులు) అనే అంశంతో కొంచెం విపులంగా వివరించడం జరిగింది. ఈ హిట్‌ అండ్‌ రన్‌ నేరాల్లో ప్రత్యక్ష సాక్షులు అరుదుగా ఉంటారు. వాహనం ఢీకొని దొరికితే కేసు అవుతుందని లేదా ఒక వేళ ఎవరినైనా ఢీకొని ప్రాణాపాయం కల్పిస్తే జనాలు కొడతారని డ్రైవర్‌ ప్రాణభయంతో పారిపోతాడు. ఈ సందర్భంలో సంఘటనా స్థలంలో లేదా బాధితునిపై ఉన్న భౌతిక సాక్ష్యాధారాలు మాత్రమే నేరాన్ని నిరూపించడానికి ఉపయోగపడతాయి. కావున సంఘటనా స్థలంలోని భౌతిక సాక్ష్యాధారాల గుర్తింపు, పరిరక్షణ, సేకరణ, రవాణా మరియు ఫోరెన్సిక్‌ పరీక్షలు ముఖ్యభూమికను పోషిస్తాయి. ఏదైనా వాహనం పాదచారిని లేదా వాహనాన్ని ఢీకొని పారిపోయిన కేసును హిట్‌ అండ్‌ రన్‌ యాక్సిడెంట్‌ అంటారు.  ఇటువంటి నేరాల్లో నేర వాహనం లేదా  దాని డ్రైవర్‌ సంఘటనకు బాధ్యులు అవునా?కాదా? అని తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారి ఎంతో జాగురూకతతో వ్యవహరించి భౌతిక సాక్ష్యాధారాలు సేకరించవలసి ఉంటుంది. 

నేరం రిపోర్టు అయిన తర్వాత దర్యాప్తు అధికారి చేయవలసిన విధులు:

1.              సంఘటనా స్థలంలో ఎవరైనా బాధితులకు గాయాలైతే వారిని ప్రాధమిక చికిత్స జరిపి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

2.             నేరస్థలాన్ని పరిరక్షించేందుకు సంఘటనా స్థలం చుట్టూ క్రైం సీన్‌ ప్రొటెక్షన్‌ టేపును కట్టాలి. ఒక గార్డును నియమించి ఎవరూ సంఘటనా స్థలానికి రాకుండా చూడాలి.

3.             క్లూస్‌ టీం లేదా ప్రొఫెషనల్‌ ఫోటో గ్రాఫర్‌ మరియు వీడియో గ్రాఫర్‌తో నేర స్థలాన్ని అన్నిదిశల నుంచి లాంగ్‌, మీడియం మరియు క్లోజప్‌ ఫోటోలు తీయించాలి. ముఖ్యమైన భౌతిక సాక్ష్యాలను క్లోజప్‌ తీసేటపుడు ప్రక్కన స్కేలును ఉంచి ఫోటోలు తీయాలి.

4.             నేర స్థలాన్ని అబ్జర్వేషన్‌ నోట్స్‌ మరియు క్రైం సీన్‌ రఫ్‌ స్కెచ్‌ విధానంలో స్థలాన్ని కొలతలతో పాటు రికార్డు చేసుకోవాలి.

5.             సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏయే భౌతిక సాక్ష్యాధారాలు నేర నిరూపణకు పనికి వస్తాయో వాటిని గుర్తించాలి. వాటిని ఫోటో గ్రాఫర్‌ రికార్డు చేసేలా చూసుకోవాలి.

6.             వాహనాలకైన నష్టాన్ని (పాయింట్‌ ఆఫ్‌ ఇంపాక్ట్‌)ని, మనుషులకయిన గాయాలని, మృతులైతే వారి మృతికి కారణమైన గాయాలను, వాహనం యొక్క స్కిడ్‌ మార్కులు, దిశ వంటి అంశాలను పరిశీలించి రికార్డు చేసుకోవాలి.

7.             వాహనానికి వేరొక వాహనంతో ఘాతం జరిగినప్పుడు, ఆ ఘాతం పడిన ఇరు వాహనపు ఉపరితలాలపై మరియు సంఘటనాస్థలంలో నేరవాహనపు సూక్ష్మ ఆధారాలు కోసం వెతకాలి.

8.             డాక్టరు వద్ద నుంచి బాధితులకు, మృతులకు తగిలిన గాయాలకు సంబంధించిన సర్టిఫికెేేట్లు మరియు చనిపోతే పోస్టుమార్టం సర్టిపకేేట్లు, మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రిపోర్టు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టులను సేకరించుకోవాలి.

స్కిడ్‌ మార్క్స్‌ లేదా జారుడు గుర్తుల ఆధారంగా వాహన వేగాన్ని లెక్కించడం:

ప్రమాద స్థలంలో లభించిన ఈ వాహనపు టైర్ల జారుడు గుర్తుల పొడవును బట్టి నేర వాహనం యొక్క వేగాన్ని లెక్కించడం దర్యాప్తులో ప్రాధమిక విధి. వాహన చోదకుడు వాహనానికి ఆకస్మాత్తుగా గట్టిగా బ్రేకు వేయటంతో వాహనం యొక్క చక్రాలు తిరగకుండా సంపూర్ణ ప్రతిష్ఠంబన జరిగి వాహనం అదే వేగంతో మొదలై సున్నా వేగానికి వచ్చి ఆగిపోతుంది. ఈ సందర్భంలో టైర్లకు రోడ్డుకు మధ్య రాపిడి జరిగి రుద్దుకుంటూ ఆగిపోతాయి. అపుడు రోడ్డు మీద టైర్ల జారుడు గుర్తులు పొడవైన గీతలవలే ఏర్పడతాయి. ఈ వాహనపు జారుడు గుర్తులను పరిశీలించినట్లయితే, జారుడు గుర్తు ముందు భాగం నల్లని లేతరంగులో ఉండి ముదురు నలుపు రంగుతో ముగుస్తుంది. ఈ జారుడు గుర్తులు పొడవు ఎంత వుంటుంది? అనేది వేగం మీదే కాక రోడ్డుస్థితి, టైర్లు, వాహనంయొక్క బరువు, బ్రేకుల సామర్థ్యం మొదలైన అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. 

అంశం

పొడవైన జారుడు గుర్తులు

చిన్న జారుడు గుర్తులు

వేగం                        

ఎక్కువ

తక్కువ

రోడ్డు

నునుపుదేలిన

గురుకైన

టైర్లు

పాతవి

క్రొత్తవి

వాహనం బరువు

తక్కువ

ఎక్కువ     

బ్రేకుల సామర్ధ్యం

బాగా లేదు

బాగుంది

జారుడు గుర్తులు పొడవును లెక్కించడం: ఈ జారుడు గుర్తులు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే వాటిని మొత్తం కూడి సరాసరి తీసుకోవాలి.

డ్రాగ్‌ ఫ్యాక్టర్‌: జారుడు గుర్తులు రోడ్డు పరిస్థితి మీద కూడా ఆధారపడి ఉంటాయి. వాహన వేగాన్ని, జారుడిని, రోడ్డు యొక్క గరుకుదనం  నియంత్రిస్తుంది. దీన్నే 'డ్రాగ్‌ ఫ్యాక్టర్‌' అని అంటారు. ఈ విలువలు వేగం లెక్కింపులో ఉపయోగపడతాయి.

సిమెంట్‌ రోడ్డు:0.55-1.20, తారు రోడ్డు:0.50-0.90,

మట్టి రోడ్డు:0.40-0.80, స్నో: 0.0-0.55

బ్రేకింగ్‌ ఎఫిషీయన్సీ: వేగంగా ఉన్న వాహనానికి బ్రేక్‌ వేసినప్పుడు అది ప్రతి చక్రంమీద కొంత ప్రభావం చూపుతుంది. దీనిని 'బ్రేక్‌ ఎఫిషియన్సీ' అని అంటారు. వాహనానికి బ్రేకు వేసినప్పుడు దాని టైర్లు సమాన పొడవుగల స్కిడ్‌ మార్కులు ఏర్పరిస్తే 100% లేదా 1.00గా దాని విలువను తీసుకుంటారు. సాధారణంగా ముందు చక్రాలకు 30% చొప్పున వెనుక చక్రాలకు 20% చొప్పున బ్రేక్‌ ఎఫిషీయన్సీని లెక్కగడతారు. వెనుక చక్రాలు బ్రేకులు పనిచేయకుంటే 60% లేదా 0.60గా లెక్కిస్తారు.

వార్తావాహిని