యూనిట్
Flash News
భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా

గత సంచికలో గాజు సాంద్రత
తెలుసుకోవడానికి ఉపయోగించే శాస్త్రీయ విధానాలు ఫ్లోటేషన్, స్థానభ్రంశ
పద్ధతి గురించి, వక్రీభవన
గుణకం మరియు ఎమిషన్ స్పెక్ట్రో గ్రాఫిక్ పరీక్షల గురించి తెలుసుకున్నాం. ఇవేకాక
గాజు సేకరణ మరియు రవాణాకు ఉపయోగించే సామాగ్రి, అందుకు దర్యాప్తు అధికారి తీసుకోవలసిన
జాగ్రత్తలు మరియు మార్గదర్శకాల గురించి చర్చించాం. ఈ సంచికలో ఏయే నేరాలలో మనకు
పెయింట్ భౌతిక సాక్ష్యాధారాలుగా లభిస్తుంది? పెయింట్ అంటే ఏమిటి? అవి
ఎన్నిరకాలుగా మనకు లభ్యమవుతున్నాయి? దానిలో ఏయే రసాయనాలు కలిసి ఉంటాయి? వీటికి
సంబంధించిన సాక్ష్యాధారాలు నేరస్థలంలో, నేరస్థునిపై, అనుమానిత
వాహనంపై, బాధితునిపై
లేదా పరికరాలపై లభించినపుడు దర్యాప్తు అధికారి వీటిని ఏవిధంగా సేకరించాలి అన్న
విషయాలే కాక వీటిపై ఫోరెన్సిక్ భౌతిక శాస్త్ర విభాగంలో ఎటువంటి శాస్త్రీయ పర్షీలు
నిర్వహిస్తారు అన్న విషయాలను చర్చిద్దాం...
పెయింట్: ఇంటి దొంగతనం మరియు దోపిడీ కేసుల్లో, కిటికీలను
తలుపుల తాళాలను పరికరాలతో విరగగొట్టి లోనికి ప్రవేశించిన నేరాల్లో పెయింట్ పొరలు
నేరస్థుడు ఉపయోగించిన పరికరాలు ఉదాహరణకు స్క్రూడ్రైవర్స్, రాడ్లు
మొదలగు వాటిమీద, శరీరంపై, దుస్తులమీద, పాదరక్షల
మీద లభిస్తుంటాయి. వాహనం ఢీకొని పారిపోయిన (హిట్ & రన్ యాక్సిడెంట్) కేసుల్లో ఒక
వాహనానికి సంబంధించిన పెయింటు మరొక వాహనానికి మార్పిడి చెంది ఉంటుంది. అలాగే ఆ నేర
ప్రదేశంలో మరియు బాధితుని మీద కూడా లభిస్తాయి. ఇవి పొరలు, పెళుసులు, పూతలు, మరలు
మొదలైన వివిధ
రూపాల్లో మనకు నేరస్థలంలో లభిస్తుంటాయి. వీటిని దర్యాప్తు అధికారి ఈ క్రింది విషయాల
నిర్థారణ కోరకు ఫోరెన్సిక్
నిపుణులకు పంపుతారు.
. నేరస్థలంలో సేకరించిన శాంపిళ్ళను
అనుమానిత వాహనపు శాంపిళ్ళతో లేదా అనుమానితుని వద్ద లభించిన పరికరాలపై లభించిన శాంపుళ్ళతో
శాస్త్రీయ పరీక్షలు చేసి ఈ రెండు పెయింట్ నమూనాలు ఒకటేనా? కాదా? అన్న
విషయాన్ని నిర్దారిస్తారు.
భౌతికశాస్త్ర విభాగంలో నిర్వహించే
శాస్త్రీయ పరీక్షల గురించి చర్చించే ముందు ఈ పెయింట్ అంటే ఏమిటి? అది
ఎన్నిరకాలుగా లభ్యమౌతుంది?
ఈ
పెయింట్లలో వాడే రసాయనాలేమిటి ? అన్న విషయాలను చర్చిద్దాం.
వాహనాలకు, ఇంటి తలుపులకు, కిటికీలకు, గోడలకు
మరియు ఇతర వస్తువుల అలంకరణ కోసం మరియు రక్షణకు పెయింట్‌ను, వార్నీష్‌ను, పాలీష్
వంటి వాటికి పూతగా ఉపయోగిస్తుంటారు. ఈ పెయింట్ అనునది వర్ణద్రవ్యం (పిగ్‌మెంట్), ద్రావణం
(సాల్వెంట్), బైండర్లు, సంకలిత
పదార్ధాలు (ఆడిటివ్స్) మొదలైన ఆర్గానిక్ (కర్బన) మరియు ఇనార్గానిక్ (కర్బన
రహిత) సమ్మేళనాల మిశ్రమ ద్రవం. ఈ పెయింట్‌ను వాహనాలపై వేయునపుడు మొదట ప్రైమరును
వేసి తరువాత దానిపై పాలిష్టర్ లేదా యురేథేన్స్ వంటి ప్రైమరీ రెజిన్‌ను నునుపుదనం
వచ్చేందుకు పూస్తారు. తర్వాత దానిపై అక్రిలిక్ పెయింట్ కలర్‌ను పూతగా పూస్తారు.
చివరగా దానిపై వాతావరణానికి దెబ్బ తినకుండా పారదర్శకమైన అక్రిలిక్ లేదా
పాలియురేథిన్ ద్రావణాన్ని పూతగా పూస్తారు. ఈవిధంగా పూసిన పెయింట్ నాలుగు పొరలు
పూర్తిగా ఎండిపోయి ఉంటాయి. ప్రయోగశాల పరీక్షల్లో ఈ వర్ణద్రవ్యాన్ని మరియు సమ్మేళన, సంకలిత
పదార్ధాలను, పొరల
సంఖ్యలను కనుగొంటారు.
మనకు మార్కెట్లో దొరికే పెయింట్ మూడు
మాధ్యమాలలో దొరుకుతుంది. అవి 1) ఆరిపోయే గుణమున్న ద్రవరూప ఆయిల్
వంటివి. ఉదా : ఎనామిల్ పెయింట్స్, గోడలకు వేసే ఎక్‌స్టీరియర్ పెయింట్స్
రూపంలో
2) వార్నీష్ మరియు పాలిష్ వంటి ద్రావణాల
రూపంలో మరియు
3) నీటితో కలిపి వేసుకొనే సింథటిక్
ఎమల్షన్, లేటెక్స్
పెయింట్స్ వంటి రూపాలలో దొరుకుతాయి.
వర్ణద్రవ్యం వర్గీకరణ : రంగులలో
సాధారణంగా వాడే వర్ణద్రవ్యాలలో వాటి సంఘటనలు ఈవిధంగా ఉంటాయి.
1)
తెలుపు వర్ణం : కాల్షియం కార్బనేట్, జింక్ ఆక్సైడ్, టైటానియమ్
ఆక్సైడ్, సిలికా, బేరియం
సల్ఫేట్, లెడ్
కార్బనేట్, లెడ్
సల్ఫేట్.
2)
నలుపు వర్ణం : పెళుసైన కార్బన్, గ్రాఫైట్, ఆస్‌ఫాల్ట్, బోన్‌బ్లాక్
మరియు ఐవరీ బ్లాక్.
3)
నీలివర్ణం : ఐరన్ ఫెర్రో ఫెర్రీసైనైడ్, కోబాల్ట్ అల్యూమినేట్, అజురైట్
మరియు ఆల్ట్రా మెరైన్.
4)
ఎరుపు వర్ణం : ఫెర్రిక్ ఆక్సైడ్, ఆంటిమోనీ ట్రైసల్ఫేట్, ట్రైలెడ్
టెట్రాక్సైడ్.
5)
ఆకుపచ్చ వర్ణం : క్రోమిక్ ఆక్సైడ్, కాపర్ బేసిక్ కార్బొనేట్, కాపర్
అసిటో ఆర్సనైట్.
6)
పసుపు వర్ణం : లెడ్ మోనాక్సైడ్, జింక్ క్లోరైడ్, లెడ్
క్రోమేట్, కాడ్మియమ్
సల్ఫేట్, హైడ్రేటెడ్
ఫెర్రిక్ ఆక్సైడ్.
7)
కాఫీ (బ్రౌన్) వర్ణం : వానడ్యక్కే బ్రౌన్, హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ + మాంగనీస్
ఆక్సైడ్ మరియు క్లేల మిశ్రమం.
భౌతికశాస్త్ర విభాగంలో పెయింట్‌పై జరుపు
శాస్త్రీయ పరీక్షలు
:
1. భౌతిక పరీక్షలు
2. భౌతికంగా సరిపోల్చడం
3. సాంద్రత పరీక్షలు
4. వివిధ ద్రావాణాలతో (సాల్వెంట్స్) చర్య
5. పైరాలసిస్ గ్యాస్‌క్రొమటోగ్రఫీ పరీక్షలు
6. ఎమిషన్ స్పెక్ట్రోగ్రఫీ పరీక్షలతో
ములకాల విశ్లేషణ
7. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ పరీక్షలు
1. భౌతిక ధర్మాల పరీక్షలు: పెయింట్
శాంపుల్స్‌కు సంబంధించిన భౌతిక లక్షణాలపై అనగా రంగు, పొరల సంఖ్య, పెయింట్
పొర మందం,
ఉపరితలం టెక్చర్ వంటి వాటిని భూతద్దం, సూక్ష్మదర్శిని
మరియు కంపారిజన్
మైక్రోస్కోప్‌ను ఉపయోగించి పరీక్షీస్తారు. ఒక వేళ పెయింట్ శాంపుల్స్‌లో అనేక
పెయింట్ పొరలు ఉన్నట్లయితే, ఆ పెయింట్ పొరల సంఖ్య, పొరలలోని
వివిధ రంగుల క్రమం, వర్ణకాలు, వర్ణకాల
విస్తరణ
( పిగ్నెంట్ డిస్ట్రిబ్యూషన్) , యువిలైట్
కింద ఫ్లోర్‌సైన్స్
మొదలైన లక్షణాలను
నేరస్థలంలోని శాంపిళ్ళు, అనుమానిత
శాంపిళ్ళు రెండింటిలో కూడా ఒకేవిధంగా ఉన్నాయో, లేదో? పరీక్షించి నిర్ధారిస్తారు. ఒక వేళ
భౌతిక ధర్మాలలో సారుప్యత ఉంటే మిగతా శాస్త్రీయ విధానాలలో పరీక్షించి
నిర్ధ్దారిస్తారు. లేకుంటే ప్రాధమిక దశలోనే పరీక్షల క్రమం నుండి తొలగిస్తారు.
2. భౌతికంగా సరిపోల్చడం: పెయింట్ పొరలు
తగినంతా పెద్దవిగా
ఉన్నట్లయితే, వాటిని దెబ్బతిన్న వాహనాలకి లేదా ఇతర
వస్తుసాక్ష్యాల ఉపరితలాలపై
ఉంచి అక్కడ సరిపోల్చి చూడవచ్చు. తద్వారా ఆ పెయింట్ పొర అనుమానిత వాహనందో? కాదో? అని
చూసి తెలుసుకోవచ్చు. ఈ విధానాన్ని 'ఫిజికల్ మ్యాచింగ్' లేదా
'భౌతికంగా
సరిపోల్చడం' అని
అంటారు.
3. వివిధ ద్రావణాలతో చర్య : వివిధ రకాల
ద్రావణాలతో పెయింట్ చిప్స్‌ను వేసి అది కరుగుతుందా? లేదా? అన్న గుణాన్ని బట్టి కూడా పెయింట్‌ను గుర్తించడం, నిర్దారించడం చేయవచ్చు.
ఆ పెయింట్
ఉత్పత్తిలో ఉపయోగించిన మూల పదార్థాలను
అంటే వర్ణకాలను, ఫిల్లర్లను
ఈ పరీక్షలతో గుర్తించవచ్చు. ఇథనాల్ పరీక్ష : పెయింట్ చిప్‌ను
(బద్ద లేదా పేడు) ఇథనాల్ ద్రావణంలో వేసి పరీక్షించినపుడు ఆ పెయింట్ చిప్ ఏ
మార్పూలేకుండా ఉంటే అది ఆయిల్ పెయింట్ అని, ఒకవేళ చిప్ ముడుచుకు పోయినట్లుగా
మారితే అది అక్రిలిక్ లేదా లేటెక్స్ పెయింట్ అని నిర్ధారిస్తారు.
పొటాషియం హైడ్రాక్సైడ్ పరీక్ష :
పెయింట్ చిప్‌ను 4%
పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో జారవిడిచి పరిశీలించినపుడు దానిలో ఆయిల్
పెయింట్ ఉంటే ఆ ద్రావణం పసుపుపచ్చ వర్ణంలోకి మారుతుంది. ఒకవేళ అలా మారకుండా ఉంటే
అది అక్రిలిక్ లేదా లేటెక్స్ పెయింట్ అని నిర్ధారిస్తారు.
4. పైరాలిసిస్ గ్యాస్ క్రొమటోగ్రఫీ : ఈ విధానంలో పెయింట్‌లో ఉన్న సంయోగాలను, బైండర్లను గుర్తించవచ్చు . ఆక్సిజన్ లేకుండా విపరీతమైన ఉష్ణోగ్రతలకు శాంపిల్స్‌ను గురిచేయడం వల్ల కర్బన సమ్మేళాలు ఆవిరి అయి సరళమైన రసాయన సంయోగాలుగా విభజితమైపోతాయి. ఈ వాయురూపంలోని ఆవిర్లు గ్యాస్ క్రొమోటోగ్రఫీలోని పైపులో ప్రయాణించి నపుడు ఈ పరికరం దానిని విశ్లేషించి ఫలితాలను గ్రాఫ్ రూపంలో ఇస్తుంది. ఇటువంటి క్రొమటోగ్రామ్‌లను నేరప్రదేశంలో సేకరించిన శాంపిల్స్‌కు మరియు అనుమానిత శాంపిల్స్‌కు తీసి, వాటిని పోల్చిచూస్తారు.