యూనిట్
Flash News
నేరస్థల పరిశోధనలోభౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా
గత సంచికలో వివిధ ఉపరితలాలపై
ఉన్న అక్షరాల పునరుద్దరణకు గల సాధ్యా సాధ్యాలు మరియు ఎటువంటి ద్రావణాలను
పునరుద్ధరణకు ఉపయోగిస్తారో తెలుపుతూ, దర్యాప్తు
అధికారి గుర్తుంచుకోవాల్సిన విషయాలను మరియు కొన్ని కేసులను ఉదాహరణలతో
వివరించడమైనది. ఈ సంచికలో ధనార్జనే ధ్యేయంగా కొంతమంది సంఘవిద్రోహులు కల్తీలకు
పాల్పడి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ, పర్యావరణాన్ని
దెబ్బతీస్తూ సమాజానికి చీడలా దాపురించారు. ఈ సంచికలో ఇటువంటి అక్రమార్కుల ఆట
కట్టించడానికి దర్యాప్తు అధికారికి కావల్సిన కనీస పరిజ్ఞానం కోసం ఈ సంచికలో నకిలీ
వస్తువులపై పరీక్షలు, చట్టాలు, సేకరణ మరియు రవాణ గురించి చర్చించడం జరిగింది.
ఫోరెన్సిక్ భౌతిక శాస్త్ర
విభాగం
ట్రేడ్ మార్కు ఉల్లంఘన
చట్టం-నకిలీ వస్తువుల పరీక్షలు
అక్రమార్జన కోసం వ్యాపారులు
చట్టాలను ఉల్లంగించి నకిలీ వస్తువులు తయారు చేయటం రోజు రోజుకు పెరిగిపోతున్నది.
మార్కెట్లన్ని నకిలీ వస్తువులతోను, నాణ్యతలేని వస్తువులతోనూ నిండిపోతున్నాయి.
పెన్నులు మొదలు కొని యంత్రాల వరకు అనేకానేక వస్తువులకు నకిలీలు తయారవుతున్నాయి. గత
దశాబ్ద కాలంలో సబ్బులు, టాల్కమ్
పౌడర్లు, డిటర్జెంట్లు, తల
నొప్పి మందులు, తూనికలు కొలతలు, ఆటోమొబైల్
స్పేర్ పార్టులు, ఇంజన్
ఆయిల్స్, పెయింట్లు, గృ¬పకరణ వస్తువులు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, గుట్కాప్యాకెట్లు, విత్తనాలు, సీళ్ళు, లేబుళ్ళు, ముద్రించిన
పుస్తకాలు, కోర్టు స్టాంపులు, ఇంజను విడిభాగాలు, జ్యువెలరీ మొదలైన పలు వస్తువులకు నకిలీలు
తయారవుతున్నాయి. ఈ చవక బారు వస్తువులకు పేరు పొందిన వస్తువుల బ్రాండ్లను తగిలించి
మార్కెట్ చేస్తుంటారు. లేదా ప్రఖ్యాతి గాంచిన వస్తువులను పోలినటువంటి నకిలీలను అచ్చం
అదే మాదిరిగా చేసి మోసం చేస్తుంటారు. సాధారణంగా ఈ నకిలీ వస్తువులు చాలా
నాసిరకమైనవిగా ఉంటాయి. వాటిమీద లేబుళ్ళ నాణ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది. అసలైన
వస్తువులతో పోల్చిచూడడం వలన అతి తేలికగా వీటిని గుర్తించ వచ్చును. ఇలాంటి కేసుల్లో
అసలు వస్తువులను, నకిలీ
వస్తువులను దర్యాప్తు అధికారి సేకరించి పరీక్షలకై పంపుతారు.
నకిలీ వస్తువులు - చట్టాలు
చట్టప్రకారం నమోదుకాని
ట్రేడ్‌మార్కులతో, తప్పుడు
వ్యాపార చిహ్నాలను ఉపయోగించి వస్తువులను విక్రయించడం 'భారత వ్యాపార చిహ్న చట్టం
(ఇండియన్ ట్రేడ్ మార్క్ యాక్టు) 1999' ప్రకారం నేరం. సాహిత్యాన్ని, నాటకం, సంగీతం
మరియు కళారచనలను కాపీ కొట్టటం, పైరసీలు
చేయటం 'కాపీ రైట్ చట్టం 1957' ప్రకారం
నేరం. చలనచిత్ర మరియు సౌండ్ రికార్డింగు నిర్మాతలకు కాపీ మరియు పైరసీలతో నష్టం
వాటిల్లకుండా ఎన్నో హక్కులతో ఈ చట్టం రక్షణ కల్పించింది. ఈ చట్టాన్ని 2012 సంవత్సరములో
సవరించినారు. కళాత్మక సంబంధమైన సంగీత సాహిత్యాలలోని ఆవిష్కరణలు, కొత్తగా ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టడం వంటి
తెలివితో కూడిన ఆవిష్కరణలను తస్కరించడం వంటి నేరాలు మేథో సంపత్తి హక్కుల చట్టం
(ఇంటలెక్టువల్ ప్రాపర్టీ రైట్స్) కిందకు వస్తాయి.
సాధారణంగా పేటెంట్లు, కాపీరైట్, వ్యాపార
చిహ్నాలు, పారిశ్రామిక డిజైన్ హక్కులు, వ్యాపార రహస్యాలు మొదలైనవన్నీ కూడా మేధోసంపత్తి
హక్కుల చట్టం కిందికి వస్తాయి. ఇటువంటి చట్టాలను ఉల్లంగించి సంఘవిద్రోహులు
నకిలీలను తయారు చేసి, నాసిరకం
వస్తువులను ప్రజలకు అంటగట్టి, వారి
ధన, మాన, ప్రాణాలకు
హాని కలిగిస్తున్నారు. ఇటువంటి వారిపై విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ వారు లేదా ఆయా కంపెనీ
ప్రతినిధులు లేదా పోలీసులు దాడులు నిర్వహించి, పంచుల
సమక్షంలో నమూనాలు సేకరిస్తారు. వాటిని ఫోరెన్సిక్ సైన్సు ప్రయోగశాలకు పరీక్షలకై
పంపి ఫోరెన్సిక్ నిపుణుల నివేదికను, వస్తువులను
కోర్టుకు సమర్పిస్తారు. వీటిననుసరించి న్యాయస్థానాలు నిందితులకు శిక్ష లేదా
జరిమానాలు విధిస్తారు.
నకిలీ వస్తువులు - పరీక్షలు
ఫోరెన్సిక్ భౌతిక శాస్త్ర
విభాగంలో, భౌతిక పరమైన పరీక్షలు మరియు శాస్త్రీయ
పరికరాలతో ఇతర పరీక్షలు చేస్తుంటారు. ముఖ్యంగా వీటిని అధ్యయనం చేయడానికి భౌతిక
లక్షణాలైన బరువు, సాంద్రత, పొడవు, వెడల్పు, ఎత్తు, మందం, ఆకారం, పరిమాణం, డిజైన్‌పాటర్న్ మొదలైన అంశాలను మైక్రోస్కోపిక్, అల్ట్రావైలెట్ మరియు ఇన్‌ఫ్రారెడ్ కిరణాల
సహాయంతో పరీక్షలు జరుపుతారు.సాధారణంగా ఈ వస్తువులపై వున్న ప్యాకింగ్, కంటైనర్లు పైన ఉండే డిజైన్ మరియు ప్రింటింగ్, మెటిరియల్స్‌లో కొట్టవచ్చేటట్టు కనుపించే తేడాల
ద్వారా చాలా వరకు నేర నిర్థారణ సాధ్యమవుతుంది. నకిలీ ఇంజన్ ఆయిల్, పెట్రోల్, డీజిల్
వంటి ద్రవ పదార్థాలను కిరోసిన్, నాప్తా, రసినేట్, హెచ్‌ఎస్‌డి
వంటి చౌకద్రావణాలతో కల్తీ చేస్తారు. ఈ కేసుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు
శాఖ వారు దాడులు చేసి సాంద్రత సాధారణంగా కంటే +-0.003 తేడా
ఉంటే శాంపుల్‌ను ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపుతారు. వారు వాటి ప్యాకింగ్‌కు ఉన్న
డిజైన్, ప్రింటింగ్ నాణ్యతల తేడాలను సాంద్రతను, భాష్పీభవన ఉష్ణోగ్రత, స్నిగ్ధత (విస్కాసిటీ), ప్లాష్ పాయింట్ వంటి భౌతిక ధర్మాలను కూడా
పరీక్షించి అది కల్తీదా? కాదా? అని ఈ భౌతిక శాస్త్ర విభాగంలో నిర్ధారిస్తారు.
దీనిలో ఏ కల్తీ పదార్థాన్ని కలిపారాన్న విషయాన్ని కెమిస్ట్రీ విభాగం పరీక్షించి
నివేదికను ఇస్తుంది.
భౌతిక సాక్ష్యాలు సేకరణ -
రవాణా:
1. ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు
పంపవలసిన నకీలీల శాంపిల్స్‌ను సెల్ఫ్ లాక్ ప్లాస్టిక్ కవర్లలలోగాని, గట్టి పేపర్ కవర్లలలోగాని ప్యాక్ చేసి
అట్టడబ్బాలలో ఉంచి రవాణాలో ఏమాత్రం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకొని పంపాలి.
2. పెట్రోలు, డిజిల్ వంటి ద్రవపదార్థాలను ప్లాస్టిక్
బాటిళ్లలో సేకరించ రాదు. వీటిని గాజు సీసాలలో గాలి చొరబడకుండా మూతను గట్టిగా
పెట్టి సీలు చేయాలి.
3. పెట్రోలు, డీజిల్, సిమెంటు
మొదలైన వాటికి స్టాండడ్స్ అవసరంలేదు. కానీ, మిగతా
అన్ని నకిలీలకు స్టాండడ్స్ సేకరించాలి.
4. ఇన్నర్
లేబుల్ మరియు ఔటర్ లేబుళ్ళపై శాంపిల్ వివరాలను క్లుప్తంగా రాయాలి.
5. దర్యాప్తు
అధికారి విజ్ఞతతో ఎలా ప్యాక్ చేస్తే శాంపిల్స్ రవాణాలో దెబ్బతినదని అనిపిస్తే
అలా ప్యాక్ చేసుకోవచ్చు.
6. పంచుల
సమక్షంలో శాంపిళ్ల సేకరణ మరియు చైన్‌ఆఫ్ కస్టడీ తప్పకుండా చూసుకోవాలి.
7. నాణ్యత
లేని నకిలీ వస్తువులను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపునపుడు వాటితోపాటు కంట్రోలు
నమూనాగా అదే సైజు, బ్యాచ్, తయారు చేసిన తేదీతో కూడిన అసలు వస్తువులను
తయారీదారుని వద్ద నుంచి సేకరించి దానికి తగిన ధృవీకరణ పత్రంతో పాటు పంపవలెను.
8. నేర
నిరూపణకు పనికి వచ్చే ప్రతి శాంపుల్స్‌ను దర్యాప్తు అధికారి సేకరించి దానిని
ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలి.
9. ఆహార
సంబంధమైన పప్పులు, నూనెలు
ఇతర తినుబండారాల కల్తీనుగుర్తించే పరీక్షలకు శాంపిల్స్‌ను ఫుడ్ ల్యాబరేటరీకి
పంపాలి. వీటిని ఫోరెన్సిక్ ప్రయోగ శాలలో పరీక్షించరు.
10. వ్యాపార
రహస్యాలు, డిజైన్లు, లేబుళ్లు
మొదలగున్నవి కంప్యూటర్‌లో సాఫ్ట్ కాపీ రూపంలో ఉన్నప్పుడు అవి నేర నిరూపణకు
పనికివస్తాయి. కావున, వాటిని
కూడా సేకరించి పంపినప్పుడు, వాటిని
ఫోరెన్సిక్ కంప్యూటర్ విభాగం వారు పరీక్షించి, నివేదికను
ఇస్తారు.
11. నకిలీ
వస్తువులను ప్యాక్ చేసిన కంటైనర్, డిజైనర్, లేబుల్స్, ప్రింటిగ్‌లకు
భౌతిక పరీక్షలు ఈ విభాగంలో నిర్వహిస్తే, ఫోర్సెనిక్
రసాయన శాస్త్ర విభాగంలో దానిలోని పదార్థాన్ని పరీక్షించి దాని రసాయనిక సంఘటనను
తెలియజేస్తారు.