యూనిట్

నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా

 గత సంచికలో  ధనార్జనే ధ్యేయంగా కొంతమంది సంఘవిద్రోహులు కల్తీలకు పాల్పడి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ పర్యావరణాన్ని దెబ్బతీస్తూ సమాజానికి చీడలా దాపురించారు. ఇటువంటి అక్రమార్కుల ఆట కట్టించడానికి దర్యాప్తు అధికారికి కావల్సిన కనీస పరిజ్ఞానం కోసం నకిలీ వస్తువులపై పరీక్షలు, చట్టాలు, సేకరణా మరియు రవాణా గురించి చర్చించాం. ఈ సంచికలో   దొంగనోట్ల చలామణిని దర్యాప్తు అధికారి అడ్డుకోవడానికి కావలసిన కనీస పరిజ్ఞానం కోసం.. రూపాయి ఎలా పుట్టింది? దీని చరిత్ర ఏమిటి? అసలైన కరెన్సీ నోట్లలో ఉండే భద్రతాపరమైన అంశాలు ఏమిటి? మరియు దొంగనోట్లు పట్టుకున్నప్పుడు దానికి వర్తించే చట్టం గురించి ఈసంచికలో  తెలుసుకుందాం..

ఫోరెన్సిక్‌ భౌతిక శాస్త్ర విభాగం

నకిలీ నోట్లు - పరీక్షలు -చట్టాలు

ఇటీవల కాలంలో తరచూ పోలీసులు దొంగనోట్ల ముఠా గుట్టురట్టు చేశారంటూ వస్తున్న వార్తలను మనం చూస్తూనే    ఉన్నాం. అంతేకాదు భారత దేశంలో దొంగనోట్లు ముద్రించే వారి సంఖ్య కూడా ఎక్కువే. దీంతో అసలు ఏది? నకిలీ ఏది? అనేది తెలుసుకోవటం సామాన్యుడికి కష్టతరంగా మారింది. నకిలీ నోట్ల కేసుల్లో దర్యాప్తు అధికారి కేసులు నమోదు చేసి నోట్లను ఫోరెన్సిక్‌ భౌతికశాస్త్ర విభాగానికి పంపుతారు. వాటికి వారు వివిధ శాస్త్రీయ పరీక్షలు నిర్వహించి తమ నివేదికలను ఇస్తారు. కావున దర్యాప్తు అదికారికి ఈ బ్యాంకు నోట్ల గురించి అవగాహన కోసం ఈ సంచికలో రిజర్వుబ్యాంకు నోట్ల భద్రతా అంశాల గురించి చర్చించడమైనది.

భారతదేశంలో కరెన్సీనోటు అనునది రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ సంతకంతో జారీచేయబడిన ఒక ప్రామిసరి నోటు. ఈ నోటును వివిధ విలువలతో (డినామినేషన్స్‌) సెంట్రల్‌ గవర్నమెంట్‌ విడుదల చేస్తుంది. ఈ నోట్లకు దేశద్రోహులు,     ఉగ్రవాదులు నకిలీలను సృష్టించి, చలామణి చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నవనాడులు కృంగిపోయి పురోభివృద్ధి కుంటుబడుతుంది. ఈ కంప్యూటర్‌ యుగంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఆసరాతో ఫొటోగ్రఫీ పద్ధతులు, ఆధునిక కంప్యూటర్‌ కలర్‌ స్కానర్‌లు, లిథోగ్రాఫిక్‌ ప్రిింటింగ్‌ పద్ధతులు చౌకగా అందుబాటులోకి రావటంతో, ఈ దొంగనోట్ల తయారీ సమాజానికి ఒక సవాలుగా మారింది. ఈ అక్రమాన్ని ఆపడానికి ప్రతిదేశం నోట్లను క్రమంగా భద్రతా అంశాలతో ఆధునీకరించి, కొత్త నోట్లను ప్రవేశపెడుతుండాలి. ఈ క్రమంలో వచ్చినవే కొత్త రూ.500 మరియు  2000 రూపాయల నోట్లు. 

రూపాయి చరిత్ర

'రూపాయి' అనే పదం సంస్కృతంలోని 'రూప్యకమ్‌' లేదా  'రూపయా' అనే పదం నుండి  ఉత్పన్నమైనది. రూపయా అనగా 'వెండినాణెము' అని అర్థం. చంద్రగుప్తమౌర్యుని వద్ద (మౌర్య సామ్రాజ్య ప్రధానమంత్రిగా పనిచేసిన చాణుక్యుడు తను రచించిన అర్థశాస్త్రంలో (340-290 బిసి), వెండి నాణేలను  'రూపయా రూప', బంగారు నాణేలను 'సువర్ణ రూప', రాగినాణేలను 'తామ్ర రూప' మరియు సీసం నాణేలను 'సీసరూప' అని ప్రస్తావించాడు. 15వ శతాబ్దంలో షేర్‌షా సూరి (1540-1545) 11.53 గ్రాముల వెండి రూపాయలను ప్రవేశపెట్టి వాటికి 'రూపియా' అని నామకరణం చేశాడు. ఈ నాణేలు మొగలులు, మరాఠా మరియు బ్రిటీషువారి కాలంలో కూడా అమలులో      ఉన్నాయి. తర్వాత 17-18వ శతాబ్దపు మధ్య కాలంలో బ్యాంక్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ (1770-1832), జనరల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌ మరియు బీహార్‌ (1773- 75) మరియు బెంగాల్‌ బ్యాంక్‌ (1784-91) కాగితంతో తయారుచేసిన రూపాయలను వాడుకలోకి తెచ్చా యి. 1957లో రూపాయిని 100 నయాపైసలుగా విభజించారు. హిందీలో 'నయా' అనగా 'క్రొత్త' అని అర్థం. 1964లో 'నయా' అనే పదాన్ని తొలగించారు. తర్వాత 1,2,3,5,10,20,25,50 పైసల నాణేలను మరియు 1,2,5,10, రూపాయల నాణేలను ముద్రించారు ఇదీ మన రూపాయల చరిత్ర.

1996లో భారతీయ రిజర్వుబ్యాంకు మహాత్మాగాంధీ సిరీస్‌  5,10,20,50,100,500 మరియు 1000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది.నవంబర్‌ 8, 2016లో రూ.500, రూ.1000లను రద్దుచేసి కొత్త రూ.500 రూ.2000ల నోట్లను ప్రవేశపెట్టింది. వీటిలో ఉండే భద్రతా అంశాలు దొంగనోట్లను గుర్తించేందుకు ఉపయోగపడతాయి.

భారతీయ రిజర్వు బ్యాంకు నోట్లలోని భద్రతా అంశాలు:

కరెన్సీ నోట్లలో ఉండే భద్రతా అంశాలు రెండు రకాలు. ఒకటి కంటికి కనిపించే భద్రతా అంశాలు, రెండవది భూతద్దం, అతి నీలలోహిత కిరణాలు, పరారుణ కిరణాల  వంటివాటిని ఉపయోగించి పరిశీలింపబడేవి.

1. కాగితపు నాణ్యత: మనం రోజూ వాడే కాగితాలకు ఈ బ్యాంకు నోట్లు ముద్రించిన కాగితానికి ఎంతో తేడా ఉంటుంది. శుద్ధి చేయబడిన దూది మరియు దూది పీలికలతో రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన వాటర్‌ మార్కు కాగితంపై ఈ కరెన్సీ నోటు ముద్రింపబడుతుంది. అందువల్ల ఈ నోటు ఒక ప్రత్యేకమైన పెళసరిశబ్దాన్ని కలుగజేస్తుంది.

2. వివిధ విలువలు గల నోట్ల పరిమాణం, ప్రతినోటుకు ఉన్న తెల్లని మార్జిన్‌ మరియు ప్రింట్‌ చేయబడిన డిజైన్‌, పరిణామాలు ప్రతినోటుకు స్థిరంగా ఉంటుంది.

3. భద్రతా కవచంలా ఉండే మెరుపుదారం (సెక్యూరిటి త్రెడ్‌):

3 మి. మీ.ల వెడల్పు  ఉండే ఒక భద్రతా పరమైన దారాన్ని ప్రత్యేకమైన పరికరాల సహాయంతో కరెన్సీ నోట్లుగా ముద్రించకముందే పేపరులో పొందుపరుస్తారు. దానిమీద సూక్ష్మముద్రణలో 'భారత్‌' అని హిందీలో, 'ఆర్‌బిఐ' అని ఇంగ్లీషులో వ్రాయబడి వివిధ కోణాల్లో         ఆ దారాన్ని చూసినప్పుడు ఆకుపచ్చనుండి నీలం రంగుకు మారుతూ కనిపిస్తుంది. లైటుకు ఎదురుగా వెనుకభాగంనుండి చూసినప్పుడు ఈ దారంలాంటి గీతపైనుంచి క్రిందివరకు నిలువుగా ఒకే గీతలాగా కనిపిస్తుంది.

4. గ్రేడియంట్‌ రంగులు: కరెన్సీ నోటుపై కొన్ని ముద్రణలకు ఈ గ్రేడియంట్‌ రంగులను వాడుతారు. దానివల్ల నోటును కాపీయంత్రాలతో కాపీచేసినప్పుడు లేదా స్కాన్‌ చేసినప్పుడు దానిపై ముద్రించిన సన్నని గీతలు, అసలు రంగు రికార్డు కాదు.

5. చిక్కగా, ఉబ్బెత్తుగా ఉండే ముద్రణ (ఇంటాగ్లియో ప్రింటింగ్‌): 'ఇంటాగ్లియో' అనగా 'ఉబ్బెత్తు' అని అర్థం. మహాత్మాగాంధీ బొమ్మ, భారతీయ రిజర్వుబ్యాంకుసీలు, గ్యారంటీ మరియు వాగ్ధానపు అంశాలు, అశోక స్థంభం చిహ్నం. ఆర్‌బిఐ గవర్నరు గారి సంతకం ఉబ్బెత్తుగా ఉండి, చేతితో తాకితే గుర్తించే వీలుండేలా ఉంటుంది. పై అంశాలను ముద్రణలో 60 సార్లు ఒకేస్థానంలో మళ్ళీమళ్ళీ ముద్రించడం వలన ఇవి ఉబ్బెత్తుగా తయారవుతాయి.

6. ఫ్లోర్‌సెన్స్‌: నోటుపై ఉన్న నోట్‌ సీరియల్‌ నంబర్‌, డినామినేషన్‌, సెక్యూరిటీ త్రెడ్‌ అతినీలలోహిత కిరణాల (యువిలైెట్‌) క్రింద  మెరుస్త్తుంటాయి. నోటులో అక్కడక్కడా ఆప్టికల్‌ పైబర్లు, రెడ్‌, గ్రీన్‌, బ్లూ కలర్‌లలో మెరుస్తూ దర్శనమిస్తాయి. ఈ ఫైబర్లు కాగితం తయారీ అప్పుడే అందులో కలుపుతారు. ఫ్లొర్‌్‌సెంట్‌ రంగులు వాడినందువలన ఇవి మెరుస్తూ కనిపిస్తాయి.

వార్తావాహిని