యూనిట్

నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ

రవాణాఫోరెన్సిక్‌ భౌతిక శాస్త్ర విభాగం

వాహనం ఢీకొని పారిపోయిన నేరాలలో దర్యాప్తు అధికారి ఏయే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి? మరియు జారుడుగుర్తుల పొడవును ఏ విధంగా గణనలోకి తీసుకోవాలి? డ్రాగ్‌ ఫ్యాక్టర్‌ మరియు బ్రేకింగ్‌ ఎఫీషియన్సి అంటే ఏమిటి? ప్రమాదస్థలంలో దొరికే స్కిడ్‌ మార్కులు మరియు ఇతర అంశాల ఆధారంగా ఏ విధంగా నేరవాహనపు వేగాన్ని లెక్కించవచ్చో? తెలుపుతూ అందుకు ఉపయోగించే వివిధ సూత్రాలను ఉదాహరణలతో గత సంచికలో చర్చించాం. ఈ సంచికలో దొంగలించబడిన వాహనానికి ఉన్న వెహికల్‌ ఐడెంటిటీ నెంబర్‌ (చాసీస్‌ నెంబర్‌)ను మార్చివేసినప్పుడు దాని అసలు నెంబర్‌ను తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారి దానిని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలోని భౌతికశాస్త్ర నిపుణునికి పంపుతారు. అప్పుడు దానిపై ఉన్న అక్షరాలు మరియు నంబర్లను రసాయనప్రక్రియకు గురిచేసి అసలు నంబరును వెలికితీస్తారు. ఇందుకు దర్యాప్తు అధికారికి కావాల్సిన కనీస పరిజ్ఞానం కొరకు చర్చిద్దాం...

ఫోరెన్సిక్‌ భౌతిక శాస్త్ర విభాగం

చెరిపి వేసిన నంబర్లను పునరుద్దరించడం 

('రెస్టోరేషన్‌ ఆఫ్‌ ఎరేస్‌డ్‌ నంబర్స్‌')

మనం వాడే ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు, టీవీలు, నీటి మోటర్లు, తుపాకులు, ఆభరణాలు మొదలగువాటిని గుర్తించడం కొరకు వాటిపై తయారీ తేదీ, సంవత్సరం, సీరియల్‌ నంబర్లు, ఇంజన్లపై ఛాసిస్‌ నంబర్లు, బ్రాండ్‌ గుర్తులు, చిహ్నాలు, ఎంబ్లమ్‌లు లేదా ట్రేడ్‌ మార్కులను ఆయా కంపెనీలు వాటిపై ముద్రిస్తాయి. సాధారణంగా ఇవన్నీ లోహాలతో తయారు చేసిన ఇంజనుమీద, ఛాసీస్‌మీద లేక బాడీమీద లేదా లోహపు ప్లేట్ల మీద చాలా కట్టు దిట్టంగా ముద్రించి ఉంటాయి...

ఇట్టి వాహనాలను, ఇంజన్లు మొదలైన వాటిని దొంగిలించి, అవి దొంగ వస్తువులు అని ఎవరు గుర్తుపట్టకుండా వాటిపై ఉన్న నంబర్లను గుర్తింపు చిహ్నాలను మార్కులను ఆకురాయి లేదా ఇతర యంత్రపరికరాలను లేదా వెల్డింగ్‌ పద్ధతులను ఉపయోగించి నంబర్లను కొట్టివేయడం, చెరిపివేయడం, చెక్కివేయడం లేదా మరేవిధంగానైనా రూపుమాపి దానిమీద వేరే నంబర్లను ముద్రించి అమ్మేస్తుంటారు. ఈ దొంగ సామాగ్రిని దర్యాప్తు అధికారి పట్టుకొని వాటి అసలు నెంబర్ల కోసం ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలోని భౌతికశాస్త్ర విభాగానికి పంపుతారు. అపుడు వారు చెరిపివేసిన నంబర్ల పునరుద్దరణగావించి దాని అసలు నంబరేదో  విశ్లేషించి తమ నివేదికలో ఇస్తారు. ఈ ప్రక్రియని 'రెస్టోరేషన్‌ ఆఫ్‌ ఎరేస్‌డ్‌ నంబర్స్‌' అని పిలుస్తారు. 

నంబర్లు, అక్షరాలు, చిహ్నాలు ముద్రించే వివిధ పద్ధతులు: 1. కాస్టింగ్‌ విధానం, 2. తొలచుట (ఎన్‌గ్రేవ్‌), 3. పంచ్‌ చేయటం.

1. కాస్టింగ్‌ విధానం:  కొన్ని లోహపు వస్తువులపై అంకెలు, అక్షరాలు ఉబ్బినట్లుగా 

ఉపరితలంపైకి లేదా ఉపరితలం కంటే లోపలకు ఉన్నటువంటివి చూస్తుంటాం. అందుకు అక్షరాలు, అంకెలు కావల్సిన విధానంలో వచ్చేలా మోల్డ్‌ను తయారుచేస్తారు. దానిలో ఆ వస్తువును అచ్చుతీసినపుడు నంబర్లు ఉబ్బెత్తుగా లేదా గుంటగా ఏర్పడుతాయి. ఇట్టి ఉబ్బెత్తుగా ఉన్న అంకెలను, అక్షరాలను చెరిపివేసినపుడు వాటి పునరుద్దరించడం చాలా కష్టం. అయితే పూర్తిగా చెరపి వేయని పక్షంలో ఏటవాలు కాంతిలో మార్పులు గమనించవచ్చు.

2. తొలచుట (ఎన్‌గ్రేవ్‌): 1. ఎలక్ట్రానిక్‌ ఎన్‌గ్రేవర్‌ పరికరం ద్వారా చెక్కబడిన  పేర్లు, నంబర్లు మొదలగునవి. 

ఉదాహరణకు స్టీలు, వెండి, బంగారు గిన్నెలపై ఆభరణాలపై వేసిన నంబర్లు పేర్లు రాయడం లేదా చెక్కడం ఈ కోవకు చెందినవి వీటిని పునరుద్దరించడం కొంచెం కష్టం.

2. లోహపు పొరను లోతుగా తొలచడం ద్వారా అక్షరాలు, నంబర్లు వ్రాయడం: ఉదాహరణకు వాహనాలపై ఇంజన్లు మీద, పనిముట్ల మీద ఉన్న నంబర్లు అక్షరాలు ఈ కోవకు చెందినవి. ఈ కోవకు చెందిన వాటిలో అక్షరాలు, నంబర్లు లోతుగా పదునైన మొనగల ఆయుధంతో తొలచినందువల్ల లోపలి పొరల వరకు తీవ్రమైన నష్టం జరిగి వుంటుంది. ఇట్టి వానిని చెరిపి మరలా నంబర్లు చెక్కినప్పుడు అడుగున వున్న నంబర్లను కొంచెం కష్టంగా తెలుసుకోవచ్చు. 

3. పంచ్‌ చేయటం: లోహాన్ని ఎక్కువ ఉష్ణోగ్రతలకు గురిచేసి నంబర్లను పంచ్‌ చేసి ముద్రిస్తారు. కొన్నిసార్లు ఈ వేడిమీదనే సమ్మెటతో కాని, ప్రెస్‌తోకాని బలంగా నంబర్లను, గుర్తులను పంచ్‌ చేసి ముద్రించి నప్పుడు లోహం లోపలి స్పటిక నిర్మాణం 1నుంచి2 మిల్లీ మీటర్ల వరకు వరకు చెదిరిపోయి మార్పులు చెందుతుంది. ఇటువంటి వాటిని దొంగలు ఫైలింగ్‌ చేయడం, గరుకు కాగితంతో రుద్దటం లేదా గ్రైండింగ్‌ చేసి అరగదీసి దానిపై మరలా సీసం (లెడ్‌) లేదా ఇతర లోహాలను కరగబెట్టి  పూత పూసి మరలా దానిపై కొత్తనంబర్లను పంచ్‌  చేసి రంగుపూసి కప్పివేస్తారు. ఈ పద్ధతిలో వేసిన నంబరును పునరుద్ధరించవచ్చును.

అంకెలు మరియు అక్షరాల పునరుద్దరణ పద్ధతిలోని వివిధ దశలు:  

1. ఉపరితలాన్ని శుభ్రపరచటం: పునరుద్దరణ చేయవలసిన ప్రదేశాన్ని మొదట స్కేలు ఉంచి ఫోటో తీసుకోవాలి. పునర్నిర్మాణం చేయవలసిన ఉపరితలాన్ని దుమ్ము, ధూళి, మట్టి, గ్రీసు, ఆయిల్‌ మరలు వంటివి పేరుకుని ఉంటే వాటిని నీరు, సోపు ద్రావణం, పెట్రోల్‌, కిరోసిన్‌, ఆల్కహాల్‌, అసిటోన్‌, లేదా బెంజిన్‌ వంటి ద్రావణాలను వాడి మురికిని తొలగించి శుభ్రపరచాలి. నంబరుపై ఒక వేళ పెయింట్‌ ఉన్నట్లయితే అసిటోన్‌తో గాని, తిన్నర్‌తో గాని మొదట పెయింట్‌ను జాగ్రత్తగా తొలగించాలి. ప్రతి దశలో ఏర్పడే మార్పులను ఫొటోగ్రఫీ పద్ధతిలో రికార్డు చేసుకోవాలి.  

2. పాలిషింగ్‌: ఉపరితలంపైన గీకినట్లుగా, చెక్కినట్లుగా గీతలు 

ఉంటే దానిని నిదానంగా అరగదీయాలి. అందుకొరకు గరకు కాగితం, కార్బొరాండమ్‌ గుడ్డ, పాలిషింగ్‌ లేదా, ఎలక్ట్రిక్‌ పాలిషింగ్‌ యంత్రాన్ని వినియోగించవచ్చును. ఆ తరువాత ఉపరితలాన్ని కొద్దిగా వేడిచేసి గది ఉష్ణోగ్రతకు చల్లబరచాలి. 

3. ఎచ్చింగ్‌: రసాయనాలను నంబరు ఉన్న లోహపు 

ఉపరితలంపై దూదితో రుద్ది లోహాన్ని కరిగించడమే 'ఎచ్చింగ్‌'. ఈ ప్రక్రియకు వివిధ ద్రావణాలు ఉన్నాయి. కాని  ఏ విధమైన రసాయన ద్రావణం వాడాలి? అన్నది నంబరు కలిగిన వస్తువుయొక్క లోహస్వభావం మీద ఆధారపడి ఉంటుంది. దానిని బట్టి నిపుణులు ఎచ్చింగ్‌ ద్రావణాన్ని ఎంచుకుంటారు. గ్లాసు రాడ్డుకు లేదా కర్రపుల్లకు దూదిని చుట్టి దాన్ని ఎచ్చింగ్‌ ద్రావణంలో ముంచి లోహపు ఉపరితలంపై రుద్దుతారు. ఈ ప్రక్రియను నిదానంగా ఎంతో ఓపికతో నిర్వహించాలి. లేకుంటే  నంబరులోతుగా వేయని సందర్భాలలో నంబరు పైకి కనిపించి రసాయనిక చర్య వేగం వల్ల వెంటనే అదృశ్యం కావచ్చు. ఈ ఎచ్చింగ్‌ కెమికల్‌ కొన్ని మార్లు ప్రయోగించిన తర్వాత అసలైన అంకెలు, అక్షరాలు, మార్పులు, చిహ్నాలు పునరుద్ధరణ అవుతూ ఉంటాయి. వాటిని గమనించిన వెంటనే తగిన విధంగా కాంతిని దానిపై ప్రసరింపజేసి ప్రతిదశలో  ఫోటోగ్రఫీ తీసుకుంటే అవి కోర్టుకు సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. కొన్నిసార్లు ఈ ప్రక్రియ మంద కోడిగా ఉంటే 

ఉపరితలాన్ని కొంచెం వేడిచేసి ఎబ్బింగ్‌ ద్రావణాన్ని పూస్తారు. దానితో చర్యవేగవంతం అవుతుంది. చెరిగిపోయిన గుర్తుల పునరుద్దరణ చాలా సమయం పట్టే క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ అసాధ్యమైనది మాత్రం కాదు. 

మిగతా వచ్చే సంచికలో..

 

వార్తావాహిని